నేటి నుంచి బ్లాస్ట్ ఫర్నేస్-1 షట్ డౌన్
ABN , Publish Date - Jun 11 , 2026 | 05:57 AM
విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో గురువారం నుంచి బ్లాస్ట్ ఫర్నేస్-1ను షట్‌డౌన్ చేస్తున్నారు. కోక్ కొరత వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
విశాఖపట్నం, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో గురువారం నుంచి బ్లాస్ట్ ఫర్నేస్-1ను షట్‌డౌన్ చేస్తున్నారు. కోక్ కొరత వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. గతేడాది కేంద్రం ఆర్థిక సాయం అందించడంతో మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లను ఆపరేషన్‌లోకి తీసుకువచ్చారు. దాంతో 100 శాతం ఉత్పత్తి సాధ్యమైంది. ఇటీవల మళ్లీ ముడిపదార్థాల కొరత ఏర్పడడంతో ఉత్పత్తి కొంత మందగించింది. ఇప్పుడు స్టీల్ మెల్టింగ్ షాప్-1లో ప్రమాదం జరగడంతో 80 శాతం పనిచేయడం లేదు. ఈ మేరకు బ్లాస్ట్ ఫర్నేస్-1ను ఆపితే కొంత వరకు ప్రయోజనం ఉంటుందని భావించి ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇక ప్రమాదం సంభవించిన ఎస్‌ఎంఎస్-1ను కూడా పూర్తిస్థాయిలో ఉత్పత్తికి సిద్ధం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు.
మూడు నెలల్లో అన్నీ సరిచేస్తాం
ప్రస్తుత పరిస్థితుల్లో స్టీల్ ప్లాంటుకు ఎటువంటి సాయం కావాలో చెబితే తాము ప్రభుత్వం ద్వారా అందిస్తామని పలువురు ప్రజా ప్రతినిధులు ఉక్కు యాజమాన్యాన్ని కోరారు. ఎలాంటి సహాయం అయినా అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఏమీ అవసరం లేదని, ఉన్న వాటితోనే మూడు నెలల్లో అన్నీ సర్దుబాటు చేసి ప్లాంటును పూర్వస్థితికి తీసుకువస్తామని యాజమాన్యం చెప్పినట్టు తెలిసింది. ఈ మేరకు ఉద్యోగ, కార్మిక సంఘాలతో బుధవారం చర్చించి, అంతా సహకరించాలని కోరారు.