స్టీల్‌ప్లాంటులో అదే పని ఒత్తిడి !
ABN , Publish Date - Jul 26 , 2026 | 05:15 AM
గత నెల ఘోర ప్రమాదం జరిగిన తర్వాత కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గడం లేదని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి.
ఎస్‌ఓపీ నిబంధనలు పాటించకే ల్యాడిల్ పేలుడు
విచారణ కమిటీ తేల్చిచెప్పినా మారని తీరు
విశాఖపట్నం, జూలై 25(ఆంధ్రజ్యోతి): గత నెల ఘోర ప్రమాదం జరిగిన తర్వాత కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గడం లేదని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. ‘స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్’ నిబంధనలు, సమయపాలన పాటించకపోవడం వలనే ల్యాడిల్ పేలుడు సంభవించిందని ప్రమాదంపై విచారణకు వేసిన త్రిసభ్య కమిటీ తేల్చిచెప్పిందని, అయితే ఇప్పుడు కూడా అదే వాతావరణం నెలకొని ఉందని చెబుతున్నాయి. భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉన్నతాధికారులు ఓవైపు చెబుతూనే అరకొర వసతులు, వనరులతో అధిక ఉత్పత్తి సాధించాలని ఆదేశిస్తున్నారని, దీనిపై ప్రశ్నిస్తుంటే... అలా చేయకుంటే ప్లాంటుకు నష్టాలు తప్పవని, పూర్తి జీతాలు ఇవ్వలేమని బెదిరిస్తున్నారని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. ప్రశాంతంగా, ప్రాణాలకు ముప్పు లేని పని వాతావరణం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్లాంటుకు ఆర్థిక సహాయం అందించడంలో కీలక పాత్ర పోషించిన ప్రజాప్రతినిధులు ఈ సమస్యలపై ప్లాంటు యాజమాన్యంతో చర్చించాలని ఉద్యోగులు కోరుతున్నారు.