Share News

‘ఉక్కు’ భద్రత తుక్కు!

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:00 AM

ఆంధ్రులు పోరాడి సాధించుకున్న ‘విశాఖ ఉక్కు’ ప్రైవేటీకరణ ముప్పు నుంచి తప్పించుకుంది. కానీ... యాజమాన్యం అనుసరిస్తున్న ‘పొదుపు’ చర్యలతో ప్రమాదాల ముప్పు ముంచుకొస్తోంది.

‘ఉక్కు’ భద్రత తుక్కు!

  • కేంద్ర ఉక్కు శాఖ ఉదాసీనత

  • భద్రతా చర్యలకు యాజమాన్యం నీళ్లు

  • నిధులు లేవంటూ ‘ఎస్‌ఓపీ’కి సెలవు

  • రెండేళ్లుగా జరగని భద్రతా సమావేశాలు

  • ఫ్యాక్టరీస్‌ విభాగం సూచనలూ బేఖాతరు

  • మూడేళ్లలో తగ్గిన 7500 మంది సిబ్బంది

  • ఉన్న వాళ్లపై పెరిగిన పని ఒత్తిడి

  • తరచూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఉపద్రవాలు

  • ప్రైవేటీకరణ ముప్పు తప్పినా పొదుపు పేరిట ‘ప్రమాదం’

(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

ఆంధ్రులు పోరాడి సాధించుకున్న ‘విశాఖ ఉక్కు’ ప్రైవేటీకరణ ముప్పు నుంచి తప్పించుకుంది. కానీ... యాజమాన్యం అనుసరిస్తున్న ‘పొదుపు’ చర్యలతో ప్రమాదాల ముప్పు ముంచుకొస్తోంది. తాజాగా జరిగిన పేలుడు ఘటనతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పరిశ్రమల స్థాయి, స్వభావాన్ని బట్టి ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన భద్రతా చర్యలనూ తీసుకోకుండా వదిలేశారు. అదేమంటే... ‘నిధులు లేవు’ అంటూ చేతులెత్తేస్తున్నారు.

ఇదేనా జాగ్రత్త...

విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ! కేంద్ర ఉక్కు శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైనది. ఇలాంటి సంస్థలో గత మూడేళ్లుగా నిర్వహణ పనులను స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం పక్కన పెట్టేసింది. చివరికి... ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ ఇచ్చే సూచనలు సైతం పెడచెవిన పెడుతున్నారు. ఆరు నెలల క్రితం ఫ్యాక్టరీస్‌ విభాగం అధికారులు మూడు రోజులు విశాఖ ప్లాంటులో అన్ని రకాల తనిఖీలు నిర్వహించారు. భద్రతపై పలు సూచనలు చేశారు. వాటిపై చర్యలు తీసుకొని నివేదిక ఇవ్వాలని కోరారు. విశాఖ ఉక్కు యాజమాన్యం ఇప్పటివరకూ దానికి సమాధానం ఇవ్వలేదు. మంగళవారం ప్లాంటులో ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభా్‌షకు ఫ్యాక్టరీస్‌ అధికారులు ఇదే విషయం చెప్పారు. అక్కడున్న ప్లాంటు అధికారులు దీనికి సమాధానం చెప్పలేక తలలు దించుకోవలసి వచ్చింది. స్టీల్‌ ప్లాంటులోని ప్రతి విభాగం నిర్వహణకు సంబంధించి స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ (ఎస్‌ఓపీ) ఉన్నాయి. వాటిని ఆ విభాగం అధికారులు అమలు చేయాలి. రెండేళ్ల క్రితం వరకు ప్రతి నెలా షాప్‌ ఫ్లోర్‌ ప్రొడక్షన్‌ కమిటీలు, సేఫ్టీ కమిటీలు సమావేశమై లోపాలపై చర్చించేవి. తరువాతి సమావేశంలో ఆ లోపాలపై ఎటువంటి చర్యలు తీసుకున్నదీ వివరించేవారు. ఆ క్రమంలో స్పేర్‌పార్టులు కావాలని, రిపేర్లు చేయించాలని పలు ప్రతిపాదనలు చేస్తే యాజమాన్యం వాటికి ఆమోదం తెలిపేది. ఏకే సక్సేనా ఇన్‌చార్జి సీఎండీగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ (ప్రమాద మరణాలు) సమావేశాలన్నీ నిలిపివేశారు. ఉన్న వాటితోనే సర్దుకుపోవాలని, స్పేర్‌ పార్టులు అడగవద్దని, నిధులు లేవని స్పష్టంచేశారు. దాంతో ‘ఎస్‌ఓపీ’ అమలు కావడం లేదు. ఫలితంగా ప్రమాదాల సంఖ్య పెరుగుతూ వస్తోంది.


ప్రాథమిక పనులకూ...

విశాఖ ఉక్కులో అత్యంత కీలకమైన బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ట్యాంకులు, కూలింగ్‌ టవర్లు దెబ్బతింటున్నా మరమ్మతులు చేపట్టడం లేదు. రా మెటీరియల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంటు (ఆర్‌ఎంహెచ్‌పీ)లో కన్వేయర్‌ బెల్టులు తరచూ తెగిపోతున్నాయి. కన్వేయర్ల పైన షెడ్ల రేకులు పలుచోట్ల ఊడిపోయాయి. వర్షం పడినప్పుడు ఆ ఖాళీల్లో నుంచి నీరు కింద పడి ముడి పదార్థాలు ముద్దగా మారుతున్నాయి. దాంతో బెల్ట్‌లు ఆగిపోతున్నాయి. ఇవన్నీ చాలా ప్రాథమిక పనులు. వీటి నిర్వహణకు కూడా యాజమాన్యం నిధులు కేటాయించడం లేదు.

సిబ్బంది కోత...

విశాఖ ఉక్కులో నానాటికీ సిబ్బంది సంఖ్య తగ్గిపోతోంది. గత మూడేళ్లలో ఐదువేలమంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. 2500 మంది రెగ్యులర్‌ ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ ఇచ్చారు. ప్రతినెలా సగటున 50 మంది రిటైర్‌ అవుతున్నారు. అంతేకాదు... దేశంలో ఎక్కడా లేని విధంగా విశాఖ ఉక్కులో కేంద్రం ఉత్పత్తి ఆధారిత వేతనాలు చెల్లిస్తోంది. ఉత్పత్తి తగ్గితే వేతనమూ తగ్గుతుందన్న మాట! దీంతో సిబ్బంది తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.


ఎల్‌డీ గ్యాస్‌ లీక్‌ అవుతున్నా...

కొన్ని విభాగాల్లో ప్రాణాంతకమైన వృఽధా వాయువులు లీక్‌ అవుతున్నాయి. అక్కడ ప్రమాదాన్ని సూచిస్తూ రెడ్‌ లైట్లు కూడా వెలుగుతున్నాయి. అయినా అధికారులు స్పందించడం లేదు. స్టీల్‌ తయారీలో భాగంగా లింజ్‌-డోనవిట్జ్‌ (ఎల్‌డీ) గ్యాస్‌ విడుదల అవుతుంది. దానిని రికవరీ ప్లాంట్ల ద్వారా కలెక్ట్‌ చేసి రోలింగ్‌ మిల్స్‌ నడపడానికి ఉపయోగిస్తారు. ఈ గ్యాస్‌ చాలా ప్రమాదకరమైనది. గాలి కన్నా బరువైనది. రంగు, వాసన ఉండదు. త్వరగా మండుతుంది. ఇందులో ఎక్కువగా కార్బన్‌ మోనాక్సైడ్‌ ఉంటుంది. దాంతోపాటు కార్బన్‌ డయాక్సైడ్‌, నైట్రోజన్‌ ఉంటాయి. ఈ గ్యాస్‌ లీకయ్యే ప్రాంతంలో 15 నిమిషాలు ఉంటే కళ్లు తిరిగి పడిపోతారు. వాంతులు అవుతాయి. అంతకంటే ఎక్కువ సమయం ఉంటే ప్రాణాపాయం కలుగుతుంది. ఈ గ్యాస్‌కు 12 సీల్‌ పాయింట్లు ఉన్నాయి. వాటి హోల్డర్‌ బేస్‌మెంట్లు పాడైపోయి, గ్యాస్‌ లీకవుతోంది. ఈ విషయాన్ని అక్కడ ఏర్పాటు చేసిన ఇండికేటర్లు ‘రెడ్‌ లైటు’ వెలిగిస్తూ ప్రమాదాన్ని సూచిస్తున్నాయి.


ప్రమాదకరంగా బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3

బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 ప్రమాదకరంగా మారింది. అక్కడ హాట్‌మెటల్‌తో పాటు స్లాగ్‌ (బూడిద) వస్తుంది. దానికి గ్రాన్యులేషన్‌ ట్యాంకుల్లోకి తీసుకుని నీటిని పంపించి స్లర్రీ స్లాగ్‌గా (నీటి ఒత్తిడితో ఐరన్‌ఓర్‌ను తీసుకురావడం) మారుస్తారు. ఆ గ్రాన్యులేషన్‌ ట్యాంకులకు రంధ్రాలు పడి శిథిలావస్థకు చేరాయి. లోపల అంతా తుప్పు పట్టేశాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలియదు.

ప్రమాదంపై త్రిసభ్య కమిటీ

ప్లాంటుకు రాక..విచారణ ప్రారంభం

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటులో సోమవారం జరిగిన ల్యాడిల్‌ పేలుడు, ఎనిమిది మంది కార్మికులు మృతిచెందిన ఘటనకు కారణాలు వెలికి తీయడానికి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి త్రిసభ్య కమిటీని నియమించారు. ఆయన ప్రకటన చేసి 24 గంటలు గడవక ముందే ఆ కమిటీ సభ్యులు మంగళవారం మధ్యాహ్నం స్టీల్‌ ప్లాంటుకు చేరుకొని విచారణ ప్రారంభించారు. ఈ కమిటీలో సెయిల్‌ (బొకారో) ప్లాంటుకు చెందిన డైరెక్టర్‌ ఇన్‌చార్జి ప్రియా రంజన్‌, చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ జితేంద్ర కుమార్‌, మాజీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ గోపాల్‌సింగ్‌ ఉన్నారు. వీరు ప్రమాదానికి దారితీసిన కారణాలు,విశాఖ ఉక్కులో పాటిస్తున్న విధానాలు, భద్రతా ప్రమాణాలు... ఇలా ప్రతిదీ పరిశీలించి నివేదికను సమర్పిస్తారు. దానిని బట్టి బాధ్యులపై చర్యలు చేపడతారు. కమిటీ సభ్యులు ముందుగా కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, ఉక్కు సీఎండీ ప్రభాకర్‌లను కలిసి ప్రాథమిక వివరాలు తీసుకున్నారు.

Updated Date - Jun 10 , 2026 | 04:03 AM