Share News

వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌లో మరో రెండు ప్రమాదాలు

ABN , Publish Date - Jun 12 , 2026 | 04:06 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో వరుస ప్రమాదాలు వణికిస్తున్నాయి. స్టీల్‌ మెల్ట్‌ షాప్‌(ఎస్‌ఎంఎస్‌)-1లో గురువారం రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌లో మరో రెండు ప్రమాదాలు

ఉక్కుటౌన్‌షిప్‌/విశాఖపట్నం, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో వరుస ప్రమాదాలు వణికిస్తున్నాయి. స్టీల్‌ మెల్ట్‌ షాప్‌(ఎస్‌ఎంఎస్‌)-1లో గురువారం రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఉదయం 5.20గంటల సమయంలో కంటిన్యూస్‌ కాస్టింగ్‌ సెక్షన్‌కు పంపడానికి 28వ నంబరు లాడిల్‌ను సిద్ధం చేశారు. పైనుండే ట్రాక్‌ మీదుగా స్టీమ్‌ ట్రాన్స్‌ఫర్‌ కార్‌ ద్వారా తరలించే సమయంలో ఆ లాడిల్‌కు పెద్ద రంధ్రం పడడంతో అందులో ఉన్న సుమారు 80టన్నుల వరకు ద్రవపు ఉక్కు నేలపై పడి ఒక్కసారిగా మంటలు రేగాయి. అక్కడి ఉద్యోగులు వెంటనే బయటకు పరుగులు తీశారు. ఇక రాత్రి ఎస్‌ఎంఎస్‌ కన్వర్టర్‌లో టాపింగ్‌ అయిన లిక్విడ్‌ స్టీల్‌ను లాడిల్‌ ద్వారా సీసీడీ (కంటిన్యూ కాస్టింగ్‌ విభాగం)కి పంపే క్రమంలో ఆర్గాన్‌-3 వద్ద ఆక్సిజన్‌ బ్లోయింగ్‌ చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా లాడిల్‌ నుంచి ద్రవపు ఉక్కు బయటకు రావడంతో మంటలు వచ్చాయి. ప్లాంట్‌లో జరుగుతున్న వరుస ప్రమాదాలతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముగ్గురు సీనియర్ల సస్పెన్షన్‌

విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఒకేరోజు ముగ్గురు సీనియర్లను సస్పెండ్‌ చేశారు. మరో ఇద్దరిని బదిలీ చేశారు. ఇటీవల ల్యాడిల్‌ పేలుడు ఘటనలో మరణించిన ఉద్యోగి గోల్డ్‌ కుమార్‌ మృతదేహాన్ని ఆయన సొంత రాష్ట్రం బిహార్‌కు విమానంలో తరలించే బాధ్యతను యాజమాన్యం హెచ్‌ఆర్‌ విభాగానికి అప్పగించింది. అయితే విమానం అందుబాటులో లేకపోవడంతో ఏసీ అంబులెన్స్‌లో పంపించారు. దీంతో ఇద్దరు సీనియర్‌ హెచ్‌ఆర్‌ మేనేజర్లను సస్పెండ్‌ చేస్తూ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ఆ విభాగంలో ఇద్దరు సీనియర్‌ జనరల్‌ మేనేజర్లను వేరే విభాగాలకు బదిలీ చేశారు. వారిలో ఒకరైన మధుసూదన్‌ 3నెలల్లో రిటైర్‌ కావలసి ఉంది. కోక్‌ఓవెన్‌ విభాగానికి బదిలీని అవమానంగా భావించిన ఆయన రాజీనామా చేశారు. ఎస్‌ఎంఎస్‌ విభాగానికి బదిలీ అయిన మహిళా అధికారిణి భాను రాజీనామాకు సిద్ధపడగా యూనియన్‌ నేతలు వారించినట్టు తెలిసింది. గురువారం జరిగిన ల్యాడిల్‌ ప్రమాదానికి బాధ్యుడిని చేస్తూ మరో ఉద్యోగిని సస్పెండ్‌ చేశారు.

Updated Date - Jun 12 , 2026 | 04:07 AM