Share News

విశాఖ ఉక్కులో ఘోరం

ABN , Publish Date - Jun 09 , 2026 | 04:19 AM

విశాఖ ఉక్కు కర్మాగారంలో ఘోర ప్రమాదం జరిగింది. 9 మంది సిబ్బంది మంటల్లో సజీవ దహనమైపోయారు. ఏం జరిగిందో తెలిసేలోపే బొగ్గుల్లా మాడిపోయారు.

విశాఖ ఉక్కులో ఘోరం

  • 9 మంది సిబ్బంది దుర్మరణం

  • స్టీల్‌ప్లాంట్‌లో పేలిన ల్యాడిల్‌

  • చుట్టుపక్కలకు చిమ్మిన హాట్‌ మెటల్‌

  • 1500 డిగ్రీల ఉష్ణోగ్రతతో కుతకుత

  • అగ్నిగోళం బద్దలైనట్టుగా మంటలు

  • బొగ్గుల్లా మారిన మృతదేహాలు

  • క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమం

  • విశాఖ చేరుకున్న కుమారస్వామి

  • మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం

  • క్షతగాత్రులకు రూ.10 లక్షలు

  • ఉక్కు యాజమాన్యం ప్రకటన

విశాఖ స్టీల్‌ప్లాంటులో పెను ప్రమాదం చోటుచేసుకుంది. 1500 డిగ్రీల వేడితో... సలసలా కాగే హాట్‌ మెటల్‌ను తీసుకెళ్తున్న ల్యాడిల్‌ పేలిపోయింది. ఆ ద్రవం మీద పడి తొమ్మిది మంది సిబ్బంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. మృతుల్లో మేనేజర్‌ నుంచి కాంట్రాక్టు కార్మికుల వరకు ఉన్నారు.

విశాఖపట్నం/గాజువాక/ఉక్కు టౌన్‌షిప్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారంలో ఘోర ప్రమాదం జరిగింది. 9 మంది సిబ్బంది మంటల్లో సజీవ దహనమైపోయారు. ఏం జరిగిందో తెలిసేలోపే బొగ్గుల్లా మాడిపోయారు. హాట్‌ మెటల్‌ విరుచుకుపడటంతో అగ్నిగోళం బద్దలయినట్లు.. ఆ ప్రాంగణం దాదాపు రెండు గంటలపాటు ఎగసిపడే మంటలతో భీతిగొలిపింది. హాట్‌ మెటల్‌ను తీసుకెళ్లే ల్యాడిల్‌ పేలడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఉద్యోగ వర్గాల కథనం ప్రకారం... విశాఖ ఉక్కు కర్మాగారంలోని స్టీల్‌ మెల్టింగ్‌ షాపు-1లో సోమవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో సుమారు 20 మంది సిబ్బంది పని చేస్తున్నారు. లిక్విడ్‌ స్టీల్‌గా మారడానికి ముందు దశ అయిన హాట్‌ మెటల్‌ను ల్యాడిల్‌లలో భారీ కొక్కేనికి తగిలించి తరలిస్తారు. ఈహాటల్‌ మెటల్‌ను శుద్ధి చేసి... ‘మౌల్డింగ్‌’లలోకి ఒంపుతారు. ఒకరకంగా చెప్పాలంటే... ఉక్కు అచ్చులను తయారు చేసే ప్రక్రియ ఇది. ఇలా ల్యాడిల్‌లో తరలిస్తున్న హాట్‌ మెటల్‌ ఒక్కోసారి కొద్దిగా ఒలికిపోవడం, చిన్నపాటి ప్రమాదాలు చోటుచేసుకోవడం అరుదుగా జరుగుతుంటుంది. కానీ... సోమవారం ల్యాడిల్‌ పేలిపోయి 150 టన్నుల దాకా ఉన్న హాట్‌ మెటల్‌ ఒక్కసారిగా చుట్టూ విరజిమ్మింది. అగ్నిపర్వతం నుంచి వెలువడే లావా తరహాలో చుట్టుపక్కల 25 అడుగుల వరకు విరుచుకుపడింది. అది పడిన చోటల్లా మంటలు చెలరేగాయి. ల్యాడిల్‌కు పది అడుగుల దూరంలోనే కార్మికులు, సిబ్బందిపై హాట్‌ మెటల్‌ పడటంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది.


  • ఏమిటి కారణం...

హాట్‌ మెటల్‌ను తరలించే ల్యాడిల్‌ పేలడం విశాఖ ఉక్కు చరిత్రలోనే కాదు... దేశంలోనే ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. దీనికి కారణంపై పలురకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒక కథనం ప్రకారం... హాట్‌ మెటల్‌లోని మలినాలు తొలగించి, శుద్ధమైన ఉక్కు తయారీ కోసం అల్యూమినియం, ఫెర్రో అలాయ్స్‌ వంటి కొన్నిరకాల ‘మెటల్‌ యాడిటివ్స్‌’ కలుపుతారు. వాటిని ఆక్సిజన్‌తో ‘బ్లో’ చేస్తారు. ఈ క్రమంలో ఎక్కడో జరిగిన పొరపాటువల్ల మెటల్స్‌లో రియాక్షన్‌ జరిగి పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్నారు. తాజా ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టంతోపాటు స్టీల్‌ప్లాంట్‌కు ఆస్తి నష్టమూ వాటిల్లింది. ఎస్‌ఎంఎస్‌-1 ప్రాంగణం చాలావరకు అగ్నికీలల్లో చిక్కుకుంది. ఒక క్రేన్‌ కాలిపోయింది.

  • పని ఒత్తిడితో సతమతం...

ఇటీవల ఉక్కు ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగింది. ఎనిమిది గంటలకు బదులు 12 గంటలు డ్యూటీ చేయిస్తున్నారు. ఇటీవల కాలంలో చాలామంది ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ ఇచ్చి పంపించేశారు. కాంట్రాక్టు కార్మికులను సగానికి తగ్గించేశారు. వేలాది మందిని తొలగించి 100 శాతం ఉత్పత్తి చేయాలని లక్ష్యం ఇస్తున్నారు. గత నవంబరు నుంచి ఉత్పత్తి ఆధారిత జీతాలను అమలు చేస్తున్నారు. దాంతో ఉద్యోగులు భద్రతా ప్రమాణాలకు సంబంధించిన ప్రొటోకాల్‌ను పాటించలేకపోతున్నారు. త్వరత్వరగా ప్రక్రియలు పూర్తిచేసే హడావిడిలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. సమయం అయిపోతున్నదనే తొందరలో ల్యాడిల్‌ను పరిమిత వేగానికి మించి కదిలిస్తే, అది బ్యాలెన్స్‌ తప్పి ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందని, దాన్ని కూడా కొట్టి పారేయలేమని యూనియన్‌ నాయకులు చెబుతున్నారు.


  • ప్రైవేటు నిర్లక్షమా?

స్టీల్‌ మెల్టింగ్‌ షాపు-1 నిర్వహణ పనులను ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. నిర్వహణ లోపం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కాగా, ప్రమాద స్థలిని ఉక్కు అధికారులు సోమవారం రాత్రి పరిశీలించారు. మళ్లీ ఉత్పత్తి ప్రారంభించేందుకు గల అవకాశాలపై చర్చించారు. అయితే రాత్రి విధులకు హాజరయ్యేందుకు సంబంధిత విభాగంలోని కార్మికులు విముఖత వ్యక్తం చేశారు. యాజమాన్యం తమకు పూర్తి భద్రత కల్పిస్తేనే విధులకు హాజరవుతామని స్పష్టంచేశారు. ఆ ప్రాంతమంతా పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేశారు.

  • షిప్టు మార్చుకుని ప్రాణాలు కోల్పోయాడు

ఎం.కృష్ణ నాగ్‌ (56) స్టీల్‌ ప్లాంటులో జనరల్‌ ఫోర్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ఆయన సోమవారం సి - షిఫ్ట్‌ డ్యూటీకి వెళ్లాల్సి ఉంది. కానీ డ్యూటీని బి-షి్‌ఫ్టనకు మార్చుకొని విధులకు హాజరయ్యారు. స్టీల్‌ మెల్టింగ్‌ షాపులో ల్యాడిల్‌ వద్ద పనిచేస్తుండగా సా యంత్రం 4.15 గంటలకు జరిగిన ప్రమాదంలో ఆయ న అక్కడికక్కడే చనిపోయారు. షిఫ్ట్‌ మార్చుకోకుం డా ఉంటే ప్రాణాలతో బతికేవారని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. కృష్ణనాగుకు పాప, బాబు ఉన్నారు.

  • అప్పుడే అప్రమత్తమై ఉంటే..

స్టీల్‌ ప్లాంటులో భారీ ప్రమాదం జరగనుందనే విషయం విధి ముందే హెచ్చరించిందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ప్రమాదం జరిగిన స్టీల్‌ మెల్టింగ్‌ షాపు-1 ప్రాంగణంలోనే నాలుగు రోజుల క్రితం ఒక ల్యాడిల్‌ పేలిందని చెబుతున్నారు. కాకపోతే దాని తీవ్రత తక్కువని సీనియర్‌ ఉద్యోగి ఒకరు తెలిపారు. చుట్టుపక్కలకు హాట్‌మెటల్‌ వెదజల్లకుండా ఆ రోజున పైకి ఎగజిమ్మిందని, దానివల్ల ప్రమాదం పెద్దగా జరగలేదని పేర్కొన్నారు.


‘రోజూ ఫోన్‌ చేసేవారు, ఈరోజే...’

  • బోరుమన్న వెంకటరమణ భార్య జోగమ్మ

విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం మదీనాబాగ్‌ సమీపాన గల సత్యారావు కాలనీకి చెందిన నక్కా వెంకట రమణ స్టీల్‌ప్లాంటులోని ఎస్‌ఎంఎస్‌ విభాగంలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నారు. సోమవారం ఆయన బి-షిప్టు డ్యూటీకి వెళ్లారు. ప్రతిరోజూ డ్యూటీకి వెళ్లిన వెంటనే భార్య జోగమ్మకు ఫోన్‌ చేస్తారు. కానీ సోమవారం ఫోన్‌ చేయలేదని, ఇంతలోనే ఆయన చనిపోయిన వార్త చెవిన పడిందని జోగమ్మ ఉక్కు జనరల్‌ ఆస్పత్రి వద్ద బోరున విలపించింది. ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆస్పత్రిలో చేర్చారు. వెంకటరమణకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. మరో మృతుడు భానుకుమార్‌కు మూడేళ్ల క్రితం గాజువాక శ్రీనగర్‌ ప్రాంతానికి లావణ్యతో వివాహమైంది. ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. పెద్దదిక్కును కోల్పోవడంతో భార్య లావణ్యతో పాటు తల్లి వరలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరో మృతుడు నక్కరాజు అప్పలరాజుకు భార్య మణి, కుమారుడు దేవివరప్రసాద్‌, కుమార్తె హేమశ్రీతో పాటు తల్లిదండ్రులు అప్పారావు, అప్పలనరసమ్మ ఉన్నారు.

మృతులు వీరే...

గోల్డ్‌ కుమార్‌ (మేనేజర్‌), జీవీ అప్పారావు (సైడ్‌ ఆపరేటర్‌), ప్రభాకరరావు (స్టాండ్‌ 3 ఆపరేటర్‌), జి.భానుకుమార్‌ (షిఫ్ట్‌ ఇన్‌చార్జి, స్టాండ్‌-1), కృష్ణ నాగు (స్టాడ్‌-4 ఆపరేటర్‌), రమణ (పౌడర్‌ కలాసీ-కాంట్రాక్ట్‌ వర్కర్‌), త్రినాథ్‌ (స్టాండ్‌ ఆపరేటర్‌-కాంట్రాక్టు వర్కర్‌), ఎన్‌.అప్పలరాజు(స్టాండ్‌ ఆపరేటర్‌-కాంట్రాక్టు వర్కర్‌), మరో వ్యక్తి.

క్షతగాత్రులు:

పైడిరాజు, రావూరి మల్లికార్జునరావు, పల్లెల శ్రీనివాస్‌, అర్జున్‌ అప్పారావు, సత్యానంద్‌, సూరిబాబు. క్షతగాత్రులను షీలానగర్‌లోని కిమ్స్‌ ఆస్పత్రి, సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.


  • 25 లక్షల చొప్పున పరిహారం

మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున యాజమాన్యం పరిహారం ప్రకటించింది. గాయపడిన ఉద్యోగులకు రూ. 10 లక్షల పరిహారం చొప్పున పరిహారం ప్రకటించారు. ఉద్యోగి రిటైర్మెంట్‌ వరకు క్వార్టర్స్‌లో నివాసం ఉండేందుకు అవకాశం కల్పించారు. పిల్లల చదువులకు ఆర్థిక సహాయం చేస్తారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి తెలిపారు. మృతుల్లో పర్మినెంట్‌ ఉద్యోగుల కుటుంబాలకు మొత్తంగా రూ. 1.5 కోట్ల వరకు పరిహారం, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ. 35 లక్షల వరకు సహాయం అందుతుందని ఆయన వెల్లడించారు.


  • పొరపాటు ఎక్కడో తేలాల్సి ఉంది

  • కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదం అత్యంత దురదృష్టకరమైన ఘటన అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ దుర్ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. స్టీల్‌ తయారీ ప్రాసె్‌సలో భాగంగా 1500 డిగ్రీల సెల్సియస్‌ అత్యధిక ఉష్ణోగ్రతతో కూడిన 150 టన్నుల ద్రవరూప ఉక్కు(హాట్‌ మెటల్‌)ను లాడెల్‌ ద్వారా నంబర్‌-2 మిషన్‌ దగ్గరకు తరలిస్తున్న సమయంలో ఈ బ్లాస్ట్‌ జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందింది. ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు మరణించడం అత్యంత విచారకరం. ప్రమాద సమయంలో పక్క మిషన్‌ దగ్గర విధుల్లో ఉన్న ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించడమే మా మొదటి ప్రాధాన్యత. అవసరమైతే వారిని మెరుగైన వైద్యం కోసం తరలించేందుకు ప్రభుత్వం తరపున ఎయిర్‌ అంబులెన్స్‌ను సిద్ధం చేశాం. ప్రమాద తీవ్రత దృష్ట్యా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌.డి.కుమారస్వామి ఈ రాత్రికే విశాఖపట్నం చేరుకున్నారు. తీవ్రమైన వేడి మంటల కారణంగా ప్రస్తుతానికి ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లే పరిస్థితి లేదని అధికారులు తెలిపారు. స్టీల్‌ తయారీ ప్రాసె్‌సలో ఎక్కడ పొరపాటు జరిగిందనేది తేలాల్సి ఉంది.’ అని స్పష్టం చేశారు. అనంతరం కారులో వైజాగ్‌ బయలుదేరారు.

Updated Date - Jun 09 , 2026 | 05:08 AM