ఆర్నెల్లు.. 240 ఖాతాలు.. రూ.400 కోట్ల బెట్టింగ్
ABN , Publish Date - May 14 , 2026 | 04:54 AM
ఆన్‌లైన్ ద్వారా మన దేశంతోపాటు శ్రీలంకలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ బెట్టింగ్ ముఠా గుట్టును విశాఖ నగర పోలీసులు బయటపెట్టారు.
నకిలీ అకౌంట్లతో కొనసాగుతున్న దందా.. ఒక్కో బ్యాంక్ అకౌంట్‌కు రూ.5 వేలు చొప్పున బేరం
60 ఖాతాలు తెరచి వివరాలు అందజేసిన నగర వాసి
బెట్టింగ్ లావాదేవీలు జరుగుతున్నట్టు తెలిసి పోలీసులకు ఫిర్యాదు
కోల్‌కతాలో కాల్ సెంటర్‌పై సైబర్‌క్రైమ్ పోలీసులు దాడి
24 మంది అరెస్టు, బ్యాంకు ఖాతాల్లోని రూ.2.75 కోట్లు ఫ్రీజ్
విశాఖపట్నం, మే 13 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ ద్వారా మన దేశంతోపాటు శ్రీలంకలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ బెట్టింగ్ ముఠా గుట్టును విశాఖ నగర పోలీసులు బయటపెట్టారు. సుమారు 240 అకౌంట్ల ద్వారా గత ఆరు నెలల్లో రూ.400 కోట్లు వరకు బెట్టింగ్ నిర్వహించినట్టు గుర్తించారు. బెంగళూరు, కోల్‌కతా కేంద్రంగా బెట్టింగ్ యాప్‌లను నిర్వహిస్తున్న 24 మందిని అరెస్టు చేసి.. వారి నుంచి 13 ల్యాప్‌టాప్‌లు, 81 సెల్‌ఫోన్లు, 149 బ్యాంక్ పాస్‌బుక్‌లను స్వాధీనం చేసుకుని వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.2.75 కోట్లను ఫ్రీజ్ చేశారు. నగర పోలీస్ కమిషనరేట్‌లో బుధవారం ఈ వివరాలను సీపీ శంఖబ్రతబాగ్చి మీడియాకు వెల్లడించారు. మారికవలసకు చెందిన తాండి రవిశంకర్ (31)కు అదే ప్రాంతానికి చెందిన త్రినాథ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్‌చేసి పాస్‌బుక్, ఏటీఎం కార్డు ఇస్తే నెలకు రూ.మూడు వేలు చొప్పున ఇస్తారంటూ, ఆశ చూపించాడు. అకౌంట్ ఎవరికి ఇవ్వాలని రవిశంకర్ ప్రశ్నించగా, కశింకోటకు చెందిన కొణతాల జగదీశ్ పేరు చెప్పాడు. దీంతో రవిశంకర్ నేరుగా జగదీశ్‌కు ఫోన్ చేసి మాట్లాడగా రూ.ఐదు వేలు ఇస్తామని చెప్పడంతో సుమారు 60 బ్యాంకు ఖాతాలను సరఫరా చేశాడు. కొన్నాళ్ల తర్వాత ఓ ఖాతాదారడు బ్యాంకుకు వెళ్లినప్పుడు అతని ఖాతా నుంచి రూ.17 లక్షల వరకు లావాదేవీలు జరిగినట్టు, అదంతా బెట్టింగ్‌కు సంబంధించినవి ఉన్నాయని అధికారులు చెప్పారు. ఆ వ్యక్తి అదే విషయాన్ని రవిశంకర్‌కు చేరవేశాడు. అప్రమత్తమైన రవిశంకర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. జగదీశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, కోల్‌కతాలోని రిజెంట్ పార్క్ కేంద్రంగా బెట్టింగ్ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఏప్రిల్ 21న రిజెంట్ పార్క్‌పై దాడి చేసి మధ్యప్రదేశ్‌కు చెందిన సాగర్ బురమాన్, చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన గోవింద్ రొహరా, లవ్ జ్ఞానవేణి, జార్ఖండ్‌కు చెందిన క్రిష్‌కుమార్ సహా 15 మందిని అరెస్టు చేశారు. వీరందరినీ కస్టడీకి తీసుకుని విచారించగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పఖరాని కరణ్ అలియస్ అలెక్స్ అలియాస్ గబ్బర్.. అల్ర్టావిన్, ఫస్ట్ ఫెయిర్ ప్లే, రెడ్డీ అన్న, ఎక్స్ఛేంజ్ 666 వంటి బెట్టింగ్ యాప్‌లను శ్రీలంక నుంచి దిగుమతి చేసుకున్నట్టు గుర్తించారు. గోవా, బెంగళూరు, కోల్‌కతా కేంద్రంగా బెట్టింగ్ కాల్‌సెంటర్లు ఏర్పాటుచేసి ఏపీ, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు తేలింది. ఒక్కో యాప్‌కు ఒక్కో అడ్మిన్‌ను నియమించి వారికి కమీషన్ కింద కొంతమొత్తం ఇచ్చి, శ్రీలంకలోని ప్రధాన బుకీలకు మరికొంత మొత్తాన్ని చేరవేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.