క్లిక్ దూరంలో పోలీస్ సేవలు!
ABN , Publish Date - May 17 , 2026 | 04:40 AM
తూర్పు తీరంలో నాలెడ్జ్ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యం ఇస్తోందని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా అన్నారు.
త్వరలో అందుబాటులోకి మొబైల్ యాప్
విశాఖలో శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం: డీజీపీ
ఆందోళనకర స్థాయిలో సైబర్ నేరాలు
అందుబాటులోకి సైబర్ వార్ రూమ్
వైజాగ్ సిటీ పోలీస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన పోలీస్ బాస్
విశాఖపట్నం, మే 16(ఆంధ్రజ్యోతి): తూర్పు తీరంలో నాలెడ్జ్ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యం ఇస్తోందని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా అన్నారు. నగర పోలీస్ కమిషనరేట్ అధికారులు అభివృద్ధి చేసిన ‘వైజాగ్ సిటీ పోలీస్’ వెబ్‌సైట్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘2000 సంవత్సరం ఆరంభంలో హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో ఇప్పుడు విశాఖ నగరం కూడా అదే మాదిరిగా అభివృద్ధి చెందుతోంది. భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, మోసం వంటి కేసుల్లో బాధితులు వైజాగ్ సిటీ పోలీస్ వెబ్‌సైట్ ద్వారా పోలీస్ సేవలను పొందేలా సైట్‌కు రూపకల్పన చేశారు. ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేలా వెబ్‌సైట్‌ను రూపొందించిన సీపీ శంఖబ్రత బాగ్చికి అభినందనలు. మిగిలిన పోలీస్ యూనిట్‌ల అధికారులు కూడా దీనిని అమలు చేయడంపై దృష్టి పెట్టాలి. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్‌ను వాడుతున్నారు. శరీర అవయవాల్లో సెల్‌ఫోన్ కూడా ఒకటి అన్నట్టు మారిపోయింది. అందుకనే త్వరలో ‘మొబైల్ యాప్’ ద్వారా పోలీస్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి యత్నిస్తాం.
మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. మహిళలకు రక్షణ కల్పించేందుకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో శక్తి బృందాలు పనిచేస్తున్నాయి. ఏదైనా సమాచారం అందితే ఐదు నుంచి ఎనిమిది నిమిషాల్లో బాధితుల వద్దకు చేరుకుని సహాయం అందజేస్తున్నాయి. సైబర్ నేరాలను కట్టడి చేయడంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరగాళ్లు రోజుకొక తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే రాష్ట్రస్థాయిలో ‘సైబర్ వార్ రూమ్’ను అందుబాటులోకి తెచ్చాం. సైబర్ నేరాలకు గురైన బాధితులకు నిరంతరం సిబ్బంది అందుబాటులో ఉండి సహాయం చేసేలా ఏర్పాట్లు చేశాం’ అని డీజీపీ తెలిపారు. సీపీ శంఖబ్రతబాగ్చి మాట్లాడుతూ, ‘డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సూచనతో నగరంలో డ్రగ్స్, గంజాయి నియంత్రణ, మహిళల భద్రతకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టాం. భవిష్యత్తులో నగర ప్రజల భద్రత, సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు అమలు చేస్తాం’ అని తెలిపారు. అనంతరం విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసులకు డీజీపీ సిల్వర్ డిస్క్ అవార్డులను డీజీపీ చేతులు మీదుగా అందజేశారు.