వివేకా హత్య కేసు దర్యాప్తు..నెల గడువుతో విచారణపై ప్రభావం
ABN , Publish Date - Feb 06 , 2026 | 03:22 AM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నెలరోజులంటూ గడువుపెడితే దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశముందని అభిప్రాయపడింది.
సీబీఐ వీలైనంత త్వరగా పూర్తిచేయాలి
సునీతారెడ్డి అభ్యర్థనలు స్వీకరించాలి: సుప్రీం
ఎవరిని విచారించాలో సీబీఐకి పూర్తి స్వేచ్ఛ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నెలరోజులంటూ గడువుపెడితే దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశముందని అభిప్రాయపడింది. అందుకే.. ట్రయల్ కోర్టు ఆదేశాల ప్రకారం నెల రోజుల్లో కాక.. వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తిచేయాలని సీబీఐని ఆదేశించింది. నిందితులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డి, యాదాటి సునీల్ యాదవ్, టి.గంగిరెడ్డిలకు కింది కోర్టులు ఇచ్చిన బెయిళ్లను రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీతారెడ్డి, సీబీఐ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లు గురువారం న్యాయస్థానం ముందుకొచ్చాయి. కేసులో అన్ని కుట్రకోణాలను వెలికితీసేంత వరకూ సీబీఐ దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని సునీత కోరగా.. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. కేవలం ఇద్దరి పాత్రను వెలికితీసేంత వరకే దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సునీత దాఖలు చేసిన పిటిషన్ సైతం విచారణకు వచ్చింది. అన్ని పిటిషన్లను కలిపి జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్‌సింగ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. సునీత తరఫు సీనియర్‌న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. సీబీఐ దర్యాప్తు పరిధిని ప్రత్యేక కోర్టు కుదించడం సరికాదన్నారు. కేవలం నిర్దిష్ట అంశంపైనే దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించడం వల్ల వాస్తవాలు వెలుగులోకి రాకుండా దర్యాప్తు ముగిసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. సీబీఐ కోర్టు ఆదేశాలతో కేసులోని ఇతర కుట్ర కోణాలు, కీలక కుట్రదారులు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోతుందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అందుకే సీబీఐ కోర్టు ఆదేశాలను సవాల్ చేశామని తెలిపారు. కాగా.. సీబీఐ తరఫు న్యాయవాది కలుగజేసుకుని.. ఇప్పటికే ప్రధాన దర్యాప్తు ముగిసిందని, ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు అదనపు విచారణ నిర్వహిస్తున్నామన్నారు. తుదిదశలో ఉన్న క్రమంలో మళ్లీ అభ్యంతరాలు లేవనెత్తితే కేసును మరింత సమయం సాగదీయడమే అవుతుందని తెలిపారు.
దర్యాప్తు పేరుతో సాగదీసే కుట్ర: నిందితులు
దర్యాప్తు పేరుతో కేసును సాగదీసే కుట్ర జరుగుతోందని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తమ క్లయింట్లకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు కీలక దశలో ఉందని, అన్ని కోణాలను పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తేల్చిచెప్పింది. ప్రతి పిటిషన్‌పై మినీ ట్రయల్ నిర్వహించలేమని స్పష్టం చేసింది. ఇలాంటి విజ్ఞప్తులను అనుమతిస్తూ పోతే ఈ కేసుకు అంతుండదని తెలిపింది. ఇలాగే పిటిషన్లపై విచారిస్తుంటే దర్యాప్తు ముగియడానికి మరో నాలుగేళ్లు పట్టే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది.
అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తేనే వాస్తవాలు వెలుగులోకి: ధర్మాసనం
సునీత తరఫున రెండు కీలక అభ్యర్థనలు ఉన్నాయని.. వాటిని స్వీకరించేలా సీబీఐని ఆదేశించాలని లూథ్రా ఽవిజ్ఞప్తి చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఆమె అభ్యర్థనలు స్వీకరించాలని సీబీఐని ఆదేశించింది. అలాగే ట్రయల్ కోర్టు ఇచ్చిన నెలరోజుల గడువుతో కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని.. కొత్త నిజాలు తెలిసినప్పుడు గడువు ముగిసిందనే కారణంతో నిరాకరించలేం కదా అని ప్రశ్నించింది. సీబీఐకి ఉన్న స్వేచ్ఛను దెబ్బతీయలేమని, దానికి ఎవరినైనా విచారించే స్వేచ్ఛ ఉంటుందని జస్టిస్ సుందరేశ్ గుర్తుచేశారు. దర్యాప్తుపై నిర్ణీత గడువు విధించడాన్ని లూథ్రా మరోసారి ప్రస్తావిస్తుండగా.. ముందు దర్యాప్తు జరగనివ్వాలని.. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని న్యాయమూర్తి తెలిపారు. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకే సీబీఐ తన దర్యాప్తును కొనసాగించవచ్చని.. ఎవరిని విచారించాలి.. ఎవరిని అదుపులోకి తీసుకోవాలపై కలుగజేసుకోలేమని, ధర్మాసనం తేల్చిచెప్పింది. అది పూర్తిగా సీబీఐ విచక్షణకు సంబంధించిన అంశమని స్పష్టతనిచ్చింది. ట్రయల్ కోర్టు పర్యవేక్షణలో విచారణ వేగంగా జరగడమే ముఖ్యమని.. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడింది. వీలైనంతత్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. దర్యాప్తులో పురోగతిని బట్టి.. సునీత అభ్యర్థనలు, నిందితులు సమర్పించే అదనపు మెటీరియల్‌ను పరిగణనలోకి తీసుకుని తదుపరి నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చి 11వ తేదీకి వాయిదా వేసింది.