Share News

వివేకా హత్య కేసులో దర్యాప్తు ముగిసింది!

ABN , Publish Date - Mar 12 , 2026 | 04:26 AM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ముగిసిందని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రకటించింది. ఇప్పటికే మూడో సప్లిమెంటరీ చార్జిషీటు కూడా దాఖలు చేశామని..

వివేకా హత్య కేసులో దర్యాప్తు ముగిసింది!

  • ఇక విచారణ అక్కర్లేదు.. మిగిలింది కోర్టు ట్రయలే.. సుప్రీంలో సీబీఐ

  • సునీత తరఫు సీనియర్‌ న్యాయవాది లూథ్రా అభ్యంతరం

  • కీలక ఆధారాలున్నందున నిందితుల బెయిల్‌ రద్దు చేయాలని వినతి

  • ఇవన్నీ ట్రయల్‌ కోర్టులో తేల్చుకోవాలన్న ధర్మాసనం

  • ఆ వెంటనే ట్రయల్‌ ప్రారంభించాలని ఆదేశం

న్యూఢిల్లీ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ముగిసిందని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రకటించింది. ఇప్పటికే మూడో సప్లిమెంటరీ చార్జిషీటు కూడా దాఖలు చేశామని.. ఇక తదుపరి దర్యాప్తు ఏమీ అవసరం లేదని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. మిగిలింది దిగువ కోర్టు విచారణ మాత్రమేనని పేర్కొంది. ఈ వాదనతో వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా విభేదించారు. తమ అభ్యంతరాలపై స్పష్టత రాలేదని.. ఈ కేసులో తమ వద్ద కీలక మెటీరియల్‌ ఉందని తెలిపారు. నిందితుల ప్రమేయానికి సంబంధించి కీలక ఆధారాలు ఉన్నందున.. వాటిని పరిగణనలోకి తీసుకుని వారికిచ్చిన బెయిల్‌ రద్దు చేయాలని కోరారు. నిందితులు గతంలో కేసును ప్రభావితం చేసిన అంశాలను గమనంలోకి తీసుకోవాలన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి (ఏ-5), వైఎస్‌ అవినాశ్‌రెడ్డి (ఏ-8), వైఎస్‌ భాస్కర్‌రెడ్డి (ఏ-7), గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి (ఏ-6), యాదాటి సునీల్‌ యాదవ్‌(ఏ-2), గంగిరెడ్డి(ఏ-1)లకు దిగువ కోర్టు ఇచ్చిన బెయిళ్లను రద్దు చేయాలని సునీతారెడ్డి, సీబీఐ వేర్వేరు పిటిషన్లు దాఖలుచేయడం తెలిసిందే. కేసులో అన్ని కుట్రకోణాలను వెలికితీసేంతవరకూ సీబీఐ దర్యాప్తు జరిపేలా ఆదేశాలించాలని సునీతారెడ్డి కోరగా.. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. కేవలం ఇద్దరి పాత్రను వెలికితీసేంతవరకే దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు అన్ని వ్యాజ్యాలనూ కలిపి బుధవారం జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌సింగ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. అన్నీ సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలనుకోవడం సరికాదని, దిగువ కోర్టుకు వెళ్లాలని స్పష్టంచేసింది. బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్లనూ కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో.. దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో కింది కోర్టులో విచారణను ఇకపై వేగవంతం చేయాలని ఆదేశించింది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 207 కింద నిందితులకు చార్జిషీట్లు, ఇతర ఆధారాల పత్రాలను అందజేసే ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టుకు సూచించింది. ఇది ముగిసిన వెంటనే, వీలైనంత వేగంగా కేసు ట్రయల్‌ ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించింది.


కడప వెళ్లడానికి శివశంకర్‌రెడ్డికి మూడ్రోజులు అనుమతి

వివేకా హత్య కేసులో ఏ5 దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కడప వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు పాక్షికంగా అనుమతి ఇచ్చింది. తన తల్లి ఆరోగ్యం సరిగా లేనందున కడప వెళ్లేందుకు నెల రోజులు అనుమతి ఇవ్వాలని శివశంకర్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. నెల కుదరదని.. మూడ్రోజులు మాత్రమే కడప వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది. అక్కడ బంధువులతో తప్ప వేరెవరితోనూ మాట్లాకూడదని, సాక్షులను కలవడం, ప్రభావితం చేయడం చేయకూడదని ఆదేశించింది. సీబీఐకి సమాచారం ఇచ్చాకే కడప వెళ్లాలని, స్థానిక పోలీసులు శివశంకర్‌రెడ్డిపై నిఘా ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Updated Date - Mar 12 , 2026 | 04:26 AM