వివేకా హత్య కేసు నిందితుడు..శివశంకర్‌రెడ్డిని ఏపీకి వెళ్లనివ్వొద్దు!
ABN , Publish Date - Mar 04 , 2026 | 04:43 AM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి(ఏ-5).. తన తల్లికి శస్త్రచికిత్స జరిగిందన్న నెపంతో ఏపీలో అడుగుపెట్టాలని...
తల్లికి సర్జరీ పేరుతో వెళ్లాలని చూస్తున్నారు
నాంపల్లి కోర్టుకు సునీతారెడ్డి వినతి
సాక్షులను ప్రభావితం చేయొచ్చు: సీబీఐ
హైదరాబాద్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి(ఏ-5).. తన తల్లికి శస్త్రచికిత్స జరిగిందన్న నెపంతో ఏపీలో అడుగుపెట్టాలని చూస్తున్నారని వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి పేర్కొన్నారు. ఈ కేసులో కీలక సాక్షులందరూ కడపలోనే ఉన్నందున వారి ని రక్షించే ఉద్దేశంతోనే ఆయన ఏపీలోకి ప్రవేశించకుండా తెలంగాణ హైకోర్టు బెయిల్ షరతుల్లో నిషేఽధం విధించిందని గుర్తుచేశారు. షరతును సడలించి ఆయనకు అనుమతిస్తే సాక్షులకు చాలా ప్రమాదమన్నారు. 79 ఏళ్ల వృద్ధురాలైన తన తల్లికి శస్త్రచికిత్స జరిగిందని.. అది విఫలం కావడంతో మళ్లీ ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని.. పులివెందుల లో ఉంటున్న తన తల్లి బాగోగులు చూసుకునేందుకు ఎవ రూ లేరని.. తానొక్కడినే కుమారుడినని.. నెలరోజులపాటు ఏపీకి వెళ్లేలా అనుమతి ఇవ్వాలని కోరుతూ శివశంకర్‌రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో దరఖాస్తు చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ సీబీఐ, సునీతారెడ్డి మంగళవారం కౌంటర్లు వేశారు. ఆయన తల్లికి జరిగిన సర్జరీ విఫలమైందనడానికి వైద్యపరమైన ఆధారాలు లేవన్నారు. అలాగే తానొక్కడినే కుమారుడినని.. తల్లిని చూసుకోవడానికి ఎవరూ లేరన్న ఆయన వాదనను సునీతారెడ్డి తోసిపుచ్చారు. ఆయన కొడుకు చైతన్యరెడ్డి, కోడలు ఇద్దరూ అర్హత కలిగిన వైద్యులని.. కడప లో వారికి ఆస్పత్రి కూడా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లా రు. పిటిషనర్ ఉండడానికి అనుమతి ఉన్న హైదరాబాద్ లో కడప కంటే అత్యాఽధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయని.. అయినప్పటికీ కడప, పులివెందులకు వెళ్తానని ఆయన కోరడం అనుమానించాల్సిన విషయమేనని తెలిపారు. శివశంకర్‌రెడ్డి రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తి అయినందున ఏపీకి వెళ్లేందుకు అనుమతిస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. దీని ప్రభావం ట్రయల్‌పై పడుతుందని.. అందుచేత ఆయనకు అనుమతివ్వవద్దని సీబీఐ కూడా కోరింది. కోర్టు తదుపరి విచారణను గురువారాని(5వ తేదీ)కి వాయిదావేసింది.