వివేకా హత్య కేసులో.. రంగంలోకి ఈడీ!
ABN , Publish Date - Aug 22 , 2026 | 04:11 AM
మాజీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తొలిసారి రంగప్రవేశం చేసింది.
ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి నివాసాల్లో తనిఖీలు
శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి, సునీల్, దస్తగిరి ఇళ్లలో కూడా..
పులివెందుల, హైదరాబాద్ సహా ఏడు చోట్ల ఏకకాలంలో సోదాలు
అవినాశ్ ఇంట్లో 24 లక్షల నగదు స్వాధీనం
2 బ్యాంకు లాకర్ల తాళాలు, కీలక పత్రాలు,ఎలక్ర్టానిక్, డిజిటల్ ఆధారాలు సైతం..
దర్యాప్తు సక్రమంగా జరగడం లేదంటూ ఈనెల 8న రాష్ట్రపతికి వివేకా కుమార్తె లేఖ
డబ్బు మూలాలు, మనీ ట్రయల్, హత్య వెనుక విస్తృత కుట్రపై దర్యాప్తునకు వినతి
దరిమిలా మొదటిసారి తెరపైకి ఈడీ!!
హత్య క్రమంలో చేతులు మారిన డబ్బుపై ఆరా
మనీ ట్రయల్ కోణంలో తొలి అడుగు
కడప/హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తొలిసారి రంగప్రవేశం చేసింది. శుక్రవారం ఏకకాలంలో హైదరాబాద్‌లోను, కడప జిల్లాలోనూ ఏడు చోట్ల ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ఇళ్ల్లతో పాటు వివేకా హత్య కేసు నిందితులైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి ఇళ్లలోనూ సోదాలు నిర్వహించింది. అవినాశ్‌రెడ్డి ఇంట్లో రూ.24 లక్షల నగదు, రెండు లాకర్ల తాళాలను, కొన్ని కీలక పత్రాలను, డిజిటల్, ఎలకా్ట్రనిక్ ఆధారాలను కూడా స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఈడీ అధికారులు సుమారు 40 మంది ఏకకాలంలో పులివెందుల బాకరాపురంలోని ఎంపీ అవినాశ్‌రెడ్డి, జయమ్మ కాలనీలోని దస్తగిరి, మైత్రి లేఅవుట్‌లో ఉంటున్న సునీల్ యాదవ్, సుజాత థియేటర్ వెనుక ఉంటున్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, తొండూరు మండలం టి.తుమ్మలపల్లెలోని ఎర్ర గంగిరెడ్డి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. అయితే ఆ సమయంలో అవినాశ్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఎర్రగంగిరెడ్డి ఇళ్లలో లేరు. ఎంపీ ఇంటికి తాళం వేసి ఉంది. ఆయన చిన్నాన్న మనోహర్‌రెడ్డి వచ్చి తాళం తీయడంతో అధికారులు లోపలకు వెళ్లారు. దాదాపు ఆరున్నర గంటలు తనిఖీలు చేశారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో అవినాశ్‌రెడ్డి నివాసంలోనూ 8 గంటలు సోదాలు నిర్వహించారు. బ్యాంకు ఖాతాలు, ఆర్ధిక లావాదేవీలు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, ఇతర ఆర్థిక రికార్డులను పరిశీలించి కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్‌లోని మైహోమ్ అవతార్‌లో శివశంకర్‌రెడ్డి నివాసంలోనూ సోదాలు జరిపి కొన్ని డిజిటల్ ఆధారాలు సేకరించినట్లు ఈడీ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. దస్తగిరి ఇంట్లో కూడా దాదాపు 7 గంటల పాటు విచారణ చేపట్టి పలు వివరాలను రాబట్టడమే గాక 1400 పేజీల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. తన తండ్రి హత్య కేసులో దర్యాప్తు సక్రమంగా సాగడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తూ వివేకా కుమార్తె సునీతారెడ్డి ఈనెల 8వ తేదీన భారత రాష్ట్రపతికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. హత్య జరిగి ఏడేళ్లు గడుస్తున్నా కొన్ని కీలక అంశాల చిక్కుముడి వీడలేదని, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోలేదని, డబ్బు మూలాలు, మనీ ట్రయల్, హత్య వెనుక ఉన్న విస్తృత కుట్ర, కీలక వ్యక్తుల కదలికలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆమె అందులో తెలిపారు. కేసులో కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీల కోణాన్ని లోతుగా పరిశీలించాలని ఆమె అభ్యర్థించిన నేపఽథ్యంలో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. హత్యకు డబ్బు ఎవరు సమకూర్చారు? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరెవరికి చెల్లించారు? నగదు బదిలీ బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిందా? హవాలా మార్గాలను వాడారా? దీని వెనుక ఎవరున్నారనే అంశాలపై ఈడీ దృష్టి సారించడం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.
దేవిరెడ్డి చైతన్యరెడ్డిని విచారించిన ఈడీ
దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు దేవిరెడ్డి చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు పులివెందులకు పిలిపించుకుని విచారించినట్లు సమాచారం. దస్తగిరి వేరే కేసులో కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో చైతన్యరెడ్డి మెడికల్ క్యాంపు పేరిట జైలుకు వెళ్లి దస్తగిరిని కలిశారు. వివేకా హత్య కేసులో తాను చెప్పిందంతా అబద్ధమని, అప్పటి సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ తనను కొట్టి బెదిరించడంతో అలా చెప్పానని చెబితే రూ.20 కోట్లు ఇస్తామని చైతన్యరెడ్డి తనకు ఆఫర్ ఇచ్చినట్లు అప్పట్లో దస్తగిరి వెల్లడించారు. దీనిపై దస్తగిరిని, ఆ సమయంలో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీటెక్ రవిని, అప్పటి సెంట్రల్ జైలు డాక్టర్‌ను సీబీఐ అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు చైతన్యరెడ్డిని పులివెందులకు పిలిపించి సుదీర్ఘంగా విచారించినట్లు సమాచారం.
మనీలాండరింగ్ నిబంధనల మేరకే తనిఖీలు..: ఈడీ
తమ దర్యాప్తులో మనీ ట్రయల్‌కు సంబంధించి కొన్ని కీలక విషయాలు గుర్తించినట్లు ఈడీ తెలిపింది, మనీలాండరింగ్ నిబంధనల ప్రకారమే తనిఖీలు చేపట్టామని పేర్కొంది. ‘వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15న తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు 2020 మార్చి 11న ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీబీఐ ఐపీసీ 302, 120బీ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. కోర్టులో మూడు చార్జిషీట్లు కూడా దాఖలు చేసింది. వివేకానందరెడ్డి వైసీపీలో ఉండడంతో ఆయన రాజకీయ ప్రభావం పెరుగుతుందని, అది తమ రాజకీయ ఆధిపత్యానికి సవాల్‌గా మారుతుందని దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు సీబీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో వివేకా హత్యకు నేరపూరిత కుట్ర పన్నినట్లు చార్జిషీటులో తెలిపింది. ఈ కుట్రలో ఎర్ర గంగిరెడ్డి, షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్ తదితరులను కలుపుకొన్నారు. దస్తగిరి తర్వాత అప్రూవర్‌గా మారడంతో ప్రత్యేక సీబీఐ కోర్టు క్షమాభిక్ష ప్రసాదించింది. హత్యకు సుమారు నెలరోజుల ముందే కుట్ర పన్నినట్లు దస్తగిరి వాంగ్మూలమిచ్చాడు. ఎర్ర గంగిరెడ్డి తనకు చెప్పిన ప్రకారం దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితో పాటు కొందరు సీనియర్ నాయకులు కూడా వివేకా హత్యలో భాగస్వాములుగా ఉన్నారని.. వివేకా హత్యకు ప్రతిఫలంగా శివశంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తామని చెప్పినట్లు వెల్లడించాడు. ఈ మొత్తంలో తన వాటాగా రూ.5 కోట్లు ఇస్తామని ఎర్ర గంగిరెడ్డి ప్రలోభపెట్టినట్లు చెప్పాడు. తనకు సునీల్ యాదవ్ నుంచి రూ.కోటి అందాయని.. అందులో రూ.25 లక్షలు సునీల్ యాదవ్ తీసుకోగా మిగిలిన రూ.75 లక్షలను తన స్నేహితుడు సయ్యద్ మున్నాకు ఇచ్చినట్లు దస్తగిరి తెలిపాడు. సయ్యద్ మున్నా, అతడి తల్లి లాకర్ నుంచి రూ.46.76 లక్షలు, లెక్కల్లో చూపని బంగారాన్ని సీబీఐ స్వాధీనం చేసుకుంది’ అని ఈడీ పేర్కొంది. సీబీఐ ఎఫ్‌ఐఆర్, చార్జిషీట్ల ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో తాము దర్యాప్తు చేపట్టినట్లు తెలిపింది.
సునీల్ యాదవ్‌నూ ప్రశ్నించిన ఈడీ
ఈడీ అధికారులు సెర్చ్ వారెంట్‌తో తన ఇంటికి వచ్చి ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు తనిఖీలు చేపట్టారని వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ చెప్పాడు. హత్యకు ముందు, జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని, వ్యవహార శైలిపై ఆరాతీసినట్లు తెలిపాడు. అడిగిన వాటికి తాను, తన కుటుంబ సభ్యులు సమాధానాలిచ్చినట్లు తెలిపాడు. ఈడీ అధికారులు ఆస్తులున్న వారి మీదపడితే బాగుంటుందని.. తమలాంటోళ్ల మీదకు వచ్చి పడితే ఎలాగని ప్రశ్నించాడు. ఈ కేసుల వల్ల తన తండ్రి చనిపోయాడని.. తనపై మూడు సార్లు దాడి చేశారని.. దాని గురించి ఎవరు మాట్లాడరని వాపోయాడు. కాణిపాకం వినాయకస్వామి సాక్షిగా, తన బిడ్డ సాక్షిగా చెబుతున్నానని.. ఈ కేసుతో తనకు సంబంధం లేదని.. తనను అన్యాయంగా ఇరికించారని అన్నాడు.