ఎవరినో కాపాడాలని చూస్తోంది!
ABN , Publish Date - Mar 16 , 2026 | 05:00 AM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి సరిగ్గా ఏడేళ్లయిందని.. ఇప్పటికీ ఇది ఎవరు చేశారు.. ఎవరు చేయించారు.. ఎందుకు చేశారో సీబీఐ తేల్చలేదని ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
వివేకా హత్య కేసులో సీబీఐ ఎందుకిలా చేస్తోంది?
ఏడేళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నా న్యాయమేదీ?
అర్జున్‌రెడ్డికి కిరణ్ యాదవ్ పంపిన మెసేజ్‌లో ‘వివేకం సార్ చనిపోయాడు’ అని ఉంది
దానిపై విచారించాలని కోర్టు చెప్పినా
ఆ కోణంలో ఎందుకు చేయలేదు?
జగన్, భారతికి ఈ అర్జున్‌రెడ్డి సన్నిహితుడు
వైఎస్ భాస్కర్‌రెడ్డికి మనవడు కూడా
లోతుగా విచారిస్తే అన్నీ తెలుస్తాయి: వివేకా కుమార్తె
కడప, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి సరిగ్గా ఏడేళ్లయిందని.. ఇప్పటికీ ఇది ఎవరు చేశారు.. ఎవరు చేయించారు.. ఎందుకు చేశారో సీబీఐ తేల్చలేదని ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఫోన్ కాల్స్ కోణంలో పూర్తిగా విచారణ జరపలేదని.. ఎవరినో కాపాడాలని చూస్తోందని ఆరోపించారు. ఆదివారం పులివెందులలో మీడియా సమావేశంలో ఆమె ఫోన్ కాల్స్ అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ మాట్లాడారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నా తనకు న్యాయం జరగడం లేదన్నారు. కేసు విచారణలో ఏదో పొరపాటు జరుగుతోందని చెప్పారు. కోర్టు కూడా ఒక నిర్దిష్ట కోణంలో మాత్రమే దర్యాప్తు చేయాలని చెప్పిందని.. అయితే కోర్టుల గురించి మాట్లాడడం సబబు కాదన్నారు. ‘ఈ హత్య కేసులో ఇప్పటి వరకు సీబీఐ చేసిన విచారణలో 8 మందిని నిందితులుగా చేర్చింది. ఏ-2 సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ యాదవ్.. అర్జున్‌రెడ్డి అనే వ్యక్తికి పంపిన మెసేజ్‌లో ‘వివేకం సార్ చనిపోయాడు’ అని ఉంది.
కానీ దానిపై సీబీఐ విచారణ చేయలేదు. దానిపై దర్యాప్తు చేయాలని.. ఇంకా కొత్తగా ఏమైనా ఉంటే చేయండని కూడా కోర్టు సీబీఐకి చెప్పింది. అయినా ఆ కోణంలో దర్యాప్తు సంస్థ ఎందుకో విచారించలేదు. అర్జున్‌రెడ్డి.. ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డికి మనవడు అవుతాడు. జగన్‌కు, భారతీరెడ్డికి చాలా సన్నిహితుడు. పాదయాత్ర సమయంలో అర్జున్‌రెడ్డే అన్ని లాజిస్టిక్స్ చూసుకునేవాడు. ఇతడికి కిరణ్ యాదవ్ ఫోన్ చేశాడు. తీయకపోతే.. వివేకం సార్ చనిపోయాడని ఉదయం 7.12 గంటలకు మెసేజ్ పంపించాడు. వివేకానందరెడ్డి చనిపోయారన్న విషయం మొదట వచ్చింది సాక్షి టీవీలోనే. ఉదయం 7.13 గంటలకు వచ్చింది. కిరణ్ యాదవ్‌కు ముందే ఎలా తెలిసింది? ఒక్క నిమిషమే అయినా అదీ ముఖ్యమైనదే కదా! కిరణ్ యాదవ్ ఫోన్ చూస్తే ఆ రోజు ఉదయం గంగిరెడ్డితో కూడా మాట్లాడాడు. అలాగే హత్య జరిగిన అనంతరం అతడి నుంచి భరత్ యాదవ్‌కు, మహేంద్ర యాదవ్‌కు విపరీతమైన ఫోన్ కాల్స్ ఉన్నాయి. భరత్ యాదవ్ గురించి అందరికీ తెలుసు. ఒకరిని మర్డర్ చేసి జైలుకెళ్లి వచ్చాడు. అప్పట్లో అతడికి గన్ లైసెన్స్ ఉంది.. దానిని వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి ఇప్పించారని ఇక్కడ చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తికి గన్ లైసెన్స్ ఎందుకు ఇప్పించాల్సి వచ్చింది? అదీగాక దస్తగిరి (ఏ-5)తో పాటు భరత్ యాదవ్ కూడా ఢిల్లీకి వెళ్లాడు. వీటిపై లోతుగా విచారిస్తే అన్ని విషయాలూ తేలతాయి. కానీ సీబీఐ ఎందుకిలా చేస్తోంది? ఎవరిని రక్షించడానికి చేస్తోందో తెలియడం లేదు’ అని సునీతారెడ్డి వ్యాఖ్యానించారు.