కొత్తగా ఏమీ తేలలేదు
ABN , Publish Date - Mar 11 , 2026 | 04:27 AM
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తును సీబీఐ ముగించింది. తదుపరి దర్యాప్తులో కొత్తగా ఏమీ తేలలేదని.. కొత్త నిందితులుగానీ, కొత్త ఆధారాలుగానీ లభించలేదని...
కొత్త నిందితులు లేరు.. ఆధారాలు లేవు
తదుపరి దర్యాప్తు అంశాన్ని ముగించండి
వివేకా హత్య కేసులో మూడో అనుబంధ తుది అభియోగ పత్రం దాఖలు చేసిన సీబీఐ
హైదరాబాద్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తును సీబీఐ ముగించింది. తదుపరి దర్యాప్తులో కొత్తగా ఏమీ తేలలేదని.. కొత్త నిందితులుగానీ, కొత్త ఆధారాలుగానీ లభించలేదని హైదరాబాద్ నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు అంశాన్ని ముగించాలని కోరుతూ మూడో సప్లిమెంటరీ - ఫైనల్ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. తన తండ్రి కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలని కోరుతూ, వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌పై విచారణను ముగించిన సీబీఐ కోర్టు, ఈ కేసులో ఏ-7గా ఉన్న వైఎస్ భాస్కరరెడ్డి సోదరుడి మనవడు అర్జున్‌రెడ్డి, మరో నిందితుడు సునీల్ యాదవ్ (ఏ-2) కిరణ్ యాదవ్ మధ్య సందేశాలపై దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తదుపరి దర్యాప్తు చేపట్టిన సీబీఐ తాజాగా దీనిపై మూడో అనుబంధ తుది చార్జిషీట్‌ను దాఖలుచేసింది. ‘‘వివేకానందరెడ్డి చనిపోయిన 2019 మార్చి 14న రాత్రి కిరణ్‌యాదవ్ తన ఇంట్లోనే ఉన్నాడు. ఉదయం టీవీ చూస్తూ, వివేకా చనిపోయిన విషయం తెలుసుకున్నాడు. ఈ సమాచారాన్ని ఇద్దామని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు అర్జున్‌రెడ్డికి ఫోన్ చేశాడు. అర్జున్‌రెడ్డి ఫోన్‌లో అందుబాటులోకి రాకపోవడంతో ‘అన్నా.. వివేకం సర్ చనిపోయాడు’ అని ఆయన మొబైల్‌కు సందేశం పంపించాడు’ అని సీబీఐ పేర్కొంది. ఈ ఇద్దరి మధ్య సందేశాలకు సంబంధించిన అంశంపై దర్యాప్తు చేశామని.. ఎలాంటి కొత్త ఆధారాలు, కొత్త నిందితులు లేరని పేర్కొంది.