వీఐటీ-ఏపీలో ముగిసిన ‘విటోపియా’
ABN , Publish Date - Feb 25 , 2026 | 05:04 AM
అమరావతిలోని వీఐటీ-ఏపీ యూనివర్సిటీలో గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్న ‘విటోపియా 2026’ ఉత్సవాలు మంగళవారం ముగిశాయి.
విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య నిర్వహణ
అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): అమరావతిలోని వీఐటీ-ఏపీ యూనివర్సిటీలో గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్న ‘విటోపియా 2026’ ఉత్సవాలు మంగళవారం ముగిశాయి. ఉత్సాహభరిత పోటీలు, ఉర్రూతలూగించే ప్రదర్శనలు, విద్యార్థుల కేరింతలు, తుళ్లింతలతో సాగిన ఈ ఉత్సవ సంరంభం విజయవంతమైనట్టు వీఐటీ నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఉత్సవం వీఐటీ-ఏపీ క్యాంప్‌సలోని విద్యార్థులను ఒకేచోట చేర్చి ప్రతిభ, సమష్టి కృషి, సృజనాత్మకతను చాటి చెప్పింది. చివరి రోజు మంగళవారం వివిధ సాంస్కృతిక పోటీల్లో పాల్గొన్న వారు బహుళ కళాత్మక విభాగాల్లో అసాధారణమైన నైపుణ్యం, అభిరుచిని ప్రదర్శించారు. సోమవారం సాయంత్రం జరిగిన ప్రో-షోలో, దర్శన్ రావల్, మక్కా బ్యాండ్, తేరి మికో వంటి ప్రఖ్యాత కళాకారులు తమ సంగీత నైపుణ్యంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. చివరి రోజున శాస్త్రీయ సంగీత ద్వయం మోహన సిస్టర్స్, ఉత్సాహ భరితమైన పైనాపిల్ ఎక్స్‌ప్రెస్, ప్రముఖ ప్రదర్శనకారుడు డీజే పృఽథ్వీ, బ్యాండ్ సర్కిల్స్ వంటి అద్భుతమైన లైనప్ పాల్గొని గొప్ప సంగీత మహోత్సవాన్ని అందించారు. సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలతో పాటు విద్యార్థులు ఉత్సాహంగా పిల్లో ఫైట్, సాక్ రేస్, విస్పర్ ఛాలెంజ్, మ్యూజికల్ చైర్స్, బెలూన్ బర్స్డ్, ఆర్చరీ, రింగ్ టాస్ వంటి వివిధ రకాల వినోదభరితమైన కార్నివాల్ ఆటల్లో పాల్గొని పండుగ వాతావరణానికి ఉత్సాహాన్ని, ఆనందాన్ని జోడించారు. ఈ కార్యక్రమానికి వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ పి.అరుల్మొళి వర్మన్, రిజిస్ట్రార్ జగదీష్ చంద్ర ముదిగంటి, విటోపియా కన్వీనర్ డాక్టర్ ఎస్.గోపీకృష్ణన్, స్టూడెంట్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఖదీర్ పాషా, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రామచంద్రరావు తదితరులు కూడా పాల్గొన్నారు.