Share News

కోస్టల్‌ కారిడార్‌కు మళ్లీ జీవం!

ABN , Publish Date - Feb 14 , 2026 | 02:34 AM

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాది జూన్‌లో ప్రారంభం కానుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపాదిత కోస్టల్‌ కారిడార్‌ మళ్లీ జీవం పోసుకుంది...

కోస్టల్‌ కారిడార్‌కు మళ్లీ జీవం!

  • విశాఖ నుంచి భోగాపురం వయా భీమిలి.. ఆరు వరుసలు.. 60 మీటర్ల వెడల్పుతో రోడ్డు

  • మాస్టర్‌ ప్లాన్‌లో పెట్టిన వీఎంఆర్‌డీఏ

  • కొన్ని ప్రాంతాల్లో ఎలివేటెడ్‌ కారిడార్లు

  • ప్రాజెక్టుకు 6289 కోట్లు అవసరమని అంచనా

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాది జూన్‌లో ప్రారంభం కానుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపాదిత కోస్టల్‌ కారిడార్‌ మళ్లీ జీవం పోసుకుంది. విశాఖపట్నం పోర్టు నుంచి రుషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ బీచ్‌ కారిడార్‌ నిర్మించాలనే ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. దీనికి నిధులు ఇవ్వడానికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గతంలో అంగీకారం కూడా తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించి, ప్రాజెక్టును పట్టాలు ఎక్కించాలని ఆదేశించారు. దీంతో జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) సమగ్ర ప్రణాళిక రూపొందించింది. ఈ నెల మొదటి వారంలో రవాణా శాఖ ఉన్నతాధికారులు దీనిపై జిల్లా అధికారులతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) తన మాస్టర్‌ ప్లాన్‌-2041లో కారిడార్‌కు సంబంధించిన కొత్త వివరాలు నమోదు చేసి, ప్రజలకు అందుబాటులో ఉంచింది.

కొన్ని ప్రాంతాల్లో ఎలివేటెడ్‌ కారిడార్లు

కొత్త ప్రతిపాదనల ప్రకారం విశాఖ పోర్టు నుంచి కైలాసగిరి వరకు ప్రస్తుతం ఉన్న 30 మీటర్ల రహదారిని 40 మీటర్లకు విస్తరిస్తారు. అక్కడి నుంచి భోగాపురం వరకు రహదారిని 60 మీటర్ల వెడల్పున నిర్మిస్తారు. ఈ మార్గంలో కొన్నిచోట్ల ఎలివేటెడ్‌ కారిడార్లు కూడా వస్తాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. విశాఖ నుంచి భీమిలి బీచ్‌ మార్గంలో ఎక్కడైతే పర్యాటకులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు స్టార్‌ హోటళ్లు, రిసార్టులు నిర్మించారో.. వాటికి ఈ రహదారి విస్తరణ వల్ల ఇబ్బంది కలగకూడదని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మిస్తారని చెబుతున్నారు. సాగర్‌నగర్‌లో రాడిసన్‌ బ్లూ వద్ద 800 మీటర్ల వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ వస్తుందని సమాచారం. అదేవిధంగా భోగాపురం వద్ద విమానాశ్రయాన్ని ఈ రహదారిని కలిపే చోట కూడా ఎలివేటెడ్‌ కారిడార్‌ వేస్తారని అంటున్నారు.


5.jpg

55 కి.మీ పొడవున.. ఆరు వరుసల్లో

విశాఖ పోర్టుకు చెందిన కంటెయినర్‌ టెర్మినల్‌ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకూ 55 కిలోమీటర్ల పొడవున ఆరు వరుసల్లో బీచ్‌ కారిడార్‌ వేస్తారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకుల భూములకు లబ్ధి కలిగేలా భీమిలి సమీపాన కారిడార్‌ అలైన్‌మెంట్‌ మార్చేశారు. భీమిలి పట్టణంలో పురాతన కట్టడాలు దెబ్బతింటాయంటూ నేరెళ్లవలస మీదుగా మళ్లించారు. ఇప్పుడు మాస్టర్‌ ప్లాన్‌లో ఆ మార్గం తప్పించి, వేరే మార్గంలో కారిడార్‌ను ప్రతిపాదించినట్టు వీఎంఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి. కాగా, భీమిలి నుంచి భోగాపురం వరకూ 19.66 కిలోమీటర్ల పొడవున గ్రీన్‌ ఫీల్ట్‌ కారిడార్‌ వస్తుంది. అంటే ఇది కొత్తగా వేయాల్సిన మార్గం. దీనికి సుమారు 350 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. ఈ మొత్తం కోస్టల్‌ కారిడార్‌ ప్రాజెక్టు కోసం భూసేకరణకు రూ.4,315 కోట్లు, నిర్మాణాలకు రూ.1,974 కోట్లు అవసరం అవుతాయని అంచనా. వీటిలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

Updated Date - Feb 14 , 2026 | 02:34 AM