Share News

విశాఖ అరకు లోయ రైలు మార్గానికి

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:45 AM

విశాఖపట్నం-అరకులోయ రైలు మార్గానికి ‘ఇండియా టుడే’ జాతీయ అవార్డు లభించింది. దేశంలో పర్యాటక రంగానికి సంబంధించి వివిధ అంశాలపై ఇండియా టుడే జాతీయ స్థాయి సర్వే-2026 నిర్వహించగా..

విశాఖ అరకు లోయ రైలు మార్గానికి

  • ఇండియా టుడే జాతీయ అవార్డు

  • 15న గోవాలో అందుకోనున్న పర్యాటక మంత్రి దుర్గేశ్‌

విశాఖపట్నం, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం-అరకులోయ రైలు మార్గానికి ‘ఇండియా టుడే’ జాతీయ అవార్డు లభించింది. దేశంలో పర్యాటక రంగానికి సంబంధించి వివిధ అంశాలపై ఇండియా టుడే జాతీయ స్థాయి సర్వే-2026 నిర్వహించగా, ‘ఇండియన్‌ రూట్స్‌ ఎడిటర్స్‌ చాయిస్‌’ విభాగంలో ఈ రైలు మార్గం నంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది. గోవాలో ఈ నెల 15న నిర్వహించే ఉత్సవంలో ఈ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం తరఫున పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ అందుకోనున్నారు.

ఏమిటీ మార్గం ప్రత్యేకత

అరకులోయ ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. విశాఖపట్నం నుంచి 131 కిలోమీటర్లు దూరం.. అందమైన రైలు మార్గం ఉంది. విశాఖ నుంచి కిరండూల్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కితే 4గంటల్లో అరకు చేరుకోవచ్చు. ఈ మార్గంలో రైలు కొండకోనలు, గుట్టలు, జలపాతాల మీదుగా వెళుతుంది. ఏకంగా 58 కొండలను తొలిచి, వాటి మధ్య నుంచి వేసిన టన్నెళ్లలో రైలు ప్రయాణించడం మరిచిపోలేని అనుభూతి. ఇవి కాకుండా ఎత్తైన కొండల మధ్య, కింద గలగల పారే జలపాతాల మధ్య నిర్మించిన 84 బ్రిడ్జిల మీదుగా ఈ రైలు వెళుతుంది. మరోవైపు ప్రకృతి అందాలను తిలకించడానికి విశాఖపట్నం రైల్వే అధికారులు అద్డాల రైలు పెట్టెలు (విస్టా డోమ్‌ కోచ్‌) నడుపుతున్నారు. రైలులో ప్రయాణిస్తూ టన్నెళ్లు, బ్రిడ్జిలు, కింద పారే జలపాతాలు, లోతైన లోయలు, విశాలమైన మైదానాలు, దట్టమైన అటవీ ప్రాంతాలను చూడొచ్చు. ఈ మార్గంలోనే బొర్రాగుహలు కూడా ఉన్నాయి. ఇన్ని విశిష్ఠతలు ఉండడం వల్లనే దీనికి అవార్డు దక్కింది!.

Updated Date - Jun 14 , 2026 | 04:45 AM