‘జూ’లలో జీవ వైవిధ్యం
ABN , Publish Date - Jan 30 , 2026 | 05:41 AM
జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో జంతు ప్రదర్శన శాలలు కీలకపాత్ర పోషిస్తాయని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు.
వన్యప్రాణుల సంరక్షణలో కార్పొరేట్లు భాగస్వామ్యం కావాలి
విశాఖ జూను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్
జూలోని రెండు జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్
విశాఖపట్నం, జనవరి 29(ఆంధ్రజ్యోతి): జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో జంతు ప్రదర్శన శాలలు కీలకపాత్ర పోషిస్తాయని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు. గురువారం ఆయన నగరంలోని జంతుప్రదర్శశాలను సందర్శించారు. ఏనుగులు, ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎన్‌క్లోజర్ల వద్దకు వెళ్లి వాటి పేర్లు, ఆహార అలవాట్లు అడిగి తెలుసుకున్నారు. జిరాఫీలకు అరటిపండ్లు, రావి ఆకులు తినిపించారు. తన తల్లి అంజనాదేవి జన్మదినం సందర్భంగా రెండు జిరాఫీలను దత్తత తీసుకుంటున్నట్టు పవన్ ప్రకటించారు. సంవత్సరంపాటు వాటి ఖర్చు, సంరక్షణ బాధ్యత తీసుకుంటున్నట్టు చెప్పారు. 650 ఎకరాల్లో గల విశాఖ జూలో వందలాది వన్యప్రాణులు, పక్షులు జీవిస్తున్నాయని, వాటి సంరక్షణలో కార్పొరేట్ సంస్థలు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. తమకు నచ్చిన జంతువును ఎంచుకుని, వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. తొలుత ఆయన సీతాకోక చిలుకల పార్కును సందర్శించారు. టైగర్ రకానికి చెందిన సీతాకోక చిలుక తనచేతిపై వాలగా సున్నితంగా పట్టుకుని పూలమొక్కలపై విడిచిపెట్టారు. అనంతరం నీటి ఏనుగులను పరిశీలించారు. వాటికి ఇచ్చే ఆహారం, సంరక్షణకు తీసుకునే జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకున్నారు. జూలో నూతనంగా ఎలుగుబంట్ల కోసం ఏర్పాటుచేసిన ఎన్‌క్లోజర్‌ను పవన్‌కల్యాణ్ ప్రారంభించారు. ఏనుగుల వద్దకు వెళ్లి వాటికి ఆహారాన్ని అందించారు. అనంతరం కంబాలకొండ ఎకోపార్కును సందర్శించారు. అక్కడ 50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన నగర వనాలను ప్రారంభించారు. ఎకోపార్కులోని శాంతివనంలో మహాగణి మొక్కలు నాటారు. పీసీసీఎఫ్ పీవీ చలపతిరావు, ఏపీసీసీఎఫ్ శాంతిప్రియ పాండే, ఫారెస్ట్ డెవల్‌పమెంట్ ఆఫీసర్ జ్యోతి, జేసీ విద్యాధరి పాల్గొన్నారు.