అట్టహాసంగా విశాఖ ఉత్సవ్ ప్రారంభం
ABN , Publish Date - Jan 25 , 2026 | 05:18 AM
విశాఖ ఉత్సవ్ శనివారం సాయంత్రం సాగర తీరాన అట్టహాసంగా ప్రారంభమైంది. తొలుత ఆర్కే బీచ్ రోడ్డులోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి కాళీమాత ఆలయం వరకూ...
ఆర్కే బీచ్ రోడ్డులో కార్నివాల్
రుషికొండలో హెలీ టూరిజం
విశాఖపట్నం, జనవరి 24(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉత్సవ్ శనివారం సాయంత్రం సాగర తీరాన అట్టహాసంగా ప్రారంభమైంది. తొలుత ఆర్కే బీచ్ రోడ్డులోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి కాళీమాత ఆలయం వరకూ వివిధ జానపద కళారూపాలతో కార్నివాల్ నిర్వహించారు. వాటితో పాటే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు... అందరూ కలసి నడుచుకుంటూ బీచ్‌లో ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక వద్దకు చేరుకున్నారు. వేదికపై సుమారు 42 అడుగులు వెడల్పున ఏర్పాటు చేసిన ఎల్‌సీడీ స్ర్కీన్ విశేషంగా ఆకట్టుకుంది. రామకృష్ణా బీచ్‌లో ఉత్సవ వాతావరణం అలుముకుంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి వేదికపై నుంచి ‘విశాఖ ఉత్సవాలు ప్రారంభం’ అని ప్రకటించిన తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించారు. గాయని సునీత తన పాటలతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ, ‘విశాఖపట్నం పర్యాటక రాజధానిగా వర్ధిల్లుతుంది. బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్‌గా నిర్వహిస్తున్న ఈ ఉత్సవానికి ప్రజలు కుటుంబాలతో సహా వచ్చి విజయవంతం చేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, పర్యాటకాభివృద్ధి సంస్థ స్పెషల్ సెక్రటరీ అజయ్‌జైన్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం రుషికొండ బీచ్‌లో మంత్రి కందుల దుర్గేశ్ హెలీ టూరిజాన్ని ప్రారంభించారు. రుషికొండను అడ్వంచర్ స్పోర్ట్స్ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.