ఉద్యోగ కల్పనలో విశాఖ టాప్
ABN , Publish Date - Jul 24 , 2026 | 04:43 AM
దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతూ, ఉద్యోగ అవకాశాలు అధికంగా కల్పిస్తున్న పది నగరాల్లో విశాఖపట్నం ప్రథమ స్థానంలో నిలిచింది. ఉద్యోగ అవకాశాలపై విస్తృత సమాచారం అందించే లింక్డ్‌ఇన్ సంస్థ ఇటీవల ద్వితీయ శ్రేణి నగరాల్లో సర్వే నిర్వహించింది.
ద్వితీయ శ్రేణి నగరాల జాబితాలో విజయవాడకు పదో స్థానం.. లింక్డ్‌ఇన్ సర్వే నివేదికలో వెల్లడి
లింక్డ్‌ఇన్ సర్వే నివేదిక వెల్లడి
విశాఖపట్నం, జూలై 23(ఆంధ్రజ్యోతి): దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతూ, ఉద్యోగ అవకాశాలు అధికంగా కల్పిస్తున్న పది నగరాల్లో విశాఖపట్నం ప్రథమ స్థానంలో నిలిచింది. ఉద్యోగ అవకాశాలపై విస్తృత సమాచారం అందించే లింక్డ్‌ఇన్ సంస్థ ఇటీవల ద్వితీయ శ్రేణి నగరాల్లో సర్వే నిర్వహించింది. సుమారు 25 లక్షల మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. వీటి ఆధారంగా ప్రతిభకు అవకాశం కల్పిస్తూ, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న పది నగరాల జాబితాను రూపొందించింది. అందులో విశాఖపట్నం మొదటి స్థానం దక్కించుకోగా.. ఆ తర్వాతి స్థానాల్లో లుథియానా, సూరత్, వదోదరా, ప్రయాగ్‌రాజ్, రాజ్‌కోట్, జబల్‌పూర్, రాంచీ, రాయ్‌పూర్, విజయవాడ నిలిచాయి. విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్లు, లుథియానాలో తయారీ రంగం, రాయ్‌పూర్‌లో ఐటీ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందడం వల్ల ఆయా నగరాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని సర్వే నివేదికలో లింక్డ్‌ఇన్ పేర్కొంది. విశాఖపట్నం డిజిటల్ ఎకానమీ, మౌలిక వసతుల రంగంలో భారీస్థాయిలో పెట్టుబడులు ఆకర్షించిందని, డేటా సెంటర్‌ల ఏర్పాటు కోసం గూగుల్ రూ.1.35 లక్షల కోట్లు, రిలయన్స్ రూ.1.6 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నాయని లింక్డ్‌ఇన్ సంస్థ వివరించింది. ఇక, ఉద్యోగ అవకాశాలు కల్పన విషయంలో విజయవాడకు జాతీయ రహదారి ఆయువుపట్టుగా నిలిచిందని లింక్డ్‌ఇన్ పేర్కొంది. పెట్టుబడులు భారీగా వస్తున్నాయని, హైదరాబాద్‌కు త్వరగా చేరుకునేలా నిర్మిస్తున్న కొత్త జాతీయ రహదారి ఉపాధి అవకాశాలకు గేట్లు తెరుస్తుందని పేర్కొంది. ఇది కాకుండా 91 ఐటీ సంస్థలు, ఈ-గవర్నెన్స్ ఆపరేషన్లు, రియల్ ఎస్టేట్ బూమ్, అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుతో వాణిజ్య కేంద్రంగా మారిపోయిందని వ్యాఖ్యానించింది. హెచ్‌సీఎల్ టెక్, కేఎల్ యూనివర్సిటీల ద్వారా ఉద్యోగాలు అధికంగా లభిస్తున్నాయని వెల్లడించింది.