Share News

విశాఖ - సికింద్రాబాద్‌ వందేభారత్‌ కోచ్‌ల పెంపు

ABN , Publish Date - Jan 28 , 2026 | 05:57 AM

విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య భారీ డిమాండ్‌తో నడుస్తున్న వందే భారత్‌ రైళ్లకు వాల్తేరు డివిజన్‌ అధికారులు అదనంగా మరో నాలుగు కోచ్‌లు జత చేశారు.

విశాఖ - సికింద్రాబాద్‌ వందేభారత్‌ కోచ్‌ల పెంపు

విశాఖపట్నం, జనవరి 27(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య భారీ డిమాండ్‌తో నడుస్తున్న వందే భారత్‌ రైళ్లకు వాల్తేరు డివిజన్‌ అధికారులు అదనంగా మరో నాలుగు కోచ్‌లు జత చేశారు. ఈ నెల పదో తేదీ వరకు 16 కోచ్‌లతోనే వందే భారత్‌ రైళ్లు నడిచాయి. ఇప్పుడు వాటిని 20కి పెంచారు. ఇందులో ఏసీ చైర్‌ కార్‌కోచ్‌లు 18 కాగా, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కోచ్‌లు రెండు. ఈ రైలులో మొన్నటి వరకు 1,128 సీట్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 1,440కు పెరిగింది. 20833 నంబర్‌ కలిగిన రైలు విశాఖలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు మధ్యాహ్నం 2.20 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. అక్కడి నుంచి తిరిగి (నంబరు 20834) మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11.35 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. వీటిని ప్రారంభించినప్పటి నుంచి ఆక్యుపెన్సీకి మించిన డిమాండ్‌తో నడుస్తున్నాయి. దాంతో కోచ్‌లు పెంచినట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. ఇక, తిరుపతికి స్లీపర్‌ క్లాస్‌ వందే భారత్‌ కోసం నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో వందే భారత్‌ రైళ్ల కోసం రూ.300 కోట్లతో మెయింటెనెన్స్‌ డిపో ఏర్పాటుకు కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Updated Date - Jan 28 , 2026 | 05:57 AM