Share News

ప్రపంచ జలక్రీడల గమ్యస్థానంగా విశాఖ

ABN , Publish Date - Aug 23 , 2026 | 04:33 AM

అంతర్జాతీయ వాటర్‌ స్పోర్ట్సు గమ్యస్థానంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

ప్రపంచ జలక్రీడల గమ్యస్థానంగా విశాఖ

  • రాష్ట్రంలో వరల్డ్‌ స్పోర్ట్స్‌ ఈవెంట్లు నిర్వహిస్తాం.. భిన్న నేపథ్య దేశాలైనా క్రీడలతో ఐక్యంగా ఉండాలి

  • విశాఖలో స్పోర్ట్స్‌ టూరిజానికి అపార అవకాశాలు.. అథ్లెట్లు, కోచ్‌లు, ట్రైనర్లకు మెండుగా ఉపాధి

  • ఏపీలో సమగ్ర క్రీడా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.. బ్రిక్స్‌ సదస్సులో సీఎం చంద్రబాబు

  • విశాఖలో ప్రారంభమైన 2 రోజుల సదస్సు.. భారత బృందానికి కేంద్ర మంత్రి మాండవీయ నేతృత్వం

విశాఖపట్నం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ వాటర్‌ స్పోర్ట్సు గమ్యస్థానంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రపంచస్థాయి క్రీడా ఈవెంట్లు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరిగే బ్రిక్స్‌ దేశాల యువజన, క్రీడా శాఖల మంత్రుల సదస్సు శనివారం రాడిసన్‌ బ్లూ హోటల్‌లో ప్రారంభమైంది. మన దేశ బృందానికి కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా శాఖల మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, సహాయ మంత్రి రక్షా నిఖిల్‌ ఖడ్సే నాయకత్వం వహించారు. అభివృద్ధిలో యువత సహకారం, భాగస్వామ్యం మరింత బలోపేతం చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. భాష, సంస్కృతి, భౌగోళికంగా భిన్నమైనా, క్రీడలతో బ్రిక్స్‌ దేశాలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. విశాఖ కేంద్రంగా బ్రిక్స్‌ యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఇన్నోవేషన్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. వాటర్‌ స్పోర్ట్స్‌, స్పోర్ట్స్‌ టూరిజానికి విశాఖలో ఉన్న అపార అవకాశాలను వివరించారు. ఇక్కడ అథ్లెట్లు, కోచ్‌లు, ట్రైనర్లకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఏపీలో స్టేట్‌ అకాడమీలు, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లతో సమగ్ర క్రీడా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. అమరావతి స్పోర్ట్స్‌ సిటీ కేంద్రంగా పూర్తి ఎకో సిస్టమ్‌ వస్తుందన్నారు.


అనుభవాలకు సదవకాశం: మాండవీయ

కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మాట్లాడుతూ, వికసిత్‌ భారత్‌ లక్ష్యం 2047 నాటికి లక్ష మంది యువ నాయకులను అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని, ఆ స్ఫూర్తితో ‘మై భారత్‌’ పేరుతో ఒక వేదిక ఏర్పాటు చేశామని చెప్పారు. అందులో 2.5 కోట్ల యువత పేర్లు నమోదు చేసుకొని చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. బ్రిక్స్‌ సమావేశం వల్ల అనుభవాలు పంచుకోవడానికి అవకాశం దక్కిందన్నారు. సభ్య దేశాల ప్రతినిధులు ‘తల్లి పేరుతో ఒక మొక్క’ నినాదంతో విశాఖలోని తొట్లకొండపై ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటారు.

గాలా డిన్నర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు

బ్రిక్స్‌ సదస్సులో భాగంగా శనివారం రాత్రి నోవోటెల్‌ హోటల్‌లో గాలా డిన్నర్‌ కార్యక్రమం నిర్వహించారు. ‘ఒకే సంస్కృతి-అనేక విశ్వాసాలు-ఒకే మానవత్వం’ అనే సందేశంతో ప్రదర్శించిన కళారూపాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కూచిపూడి నృత్యంతో కార్యక్రమం మొదలైంది. ‘ఆంధ్ర వైభవం, జనజీవన సంకల్పం-విశాఖపట్నం’ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ సంస్కృతి ప్రత్యేకతను చాటిచెప్పారు. అలాగే గుజరాతీ, కేరళ, మణిపురి, అస్సాం రాష్ర్టాల సాంస్కృతిక వైభవం తెలియజేసేలా ప్రదర్శనలు ఇచ్చారు. చివరగా జాతి సమైక్యత, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ అన్ని రాష్ర్టాల కళాకారులు కలిసి చేసిన నృత్యం కార్యక్రమానికి హైలైట్‌గా నిలిచింది. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోల శ్రీబాలవీరాంజనేయస్వామి పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2026 | 04:34 AM