ఏఐ హబ్‌గా విశాఖ
ABN , Publish Date - Feb 08 , 2026 | 04:53 AM
దేశంలోనే ఏఐ హబ్‌గా విశాఖపట్నం గుర్తింపు పొందుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు.
డబుల్ ఇంజన్ సర్కారుతో ఏపీ అభివృద్ధి
త్వరలోనే క్వాంటమ్‌లో ఎంటెక్ కోర్సులు
రూ.6 వేల కోట్లతో నేషనల్ క్వాంటమ్ మిషన్
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి
అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): దేశంలోనే ఏఐ హబ్‌గా విశాఖపట్నం గుర్తింపు పొందుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు శనివారం ఆయన విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలోనూ, అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవనాలకు సీఎం చంద్రబాబుతో కలసి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ప్రాజెక్టులకు కేంద్రం నిధులు సమకూరుస్తోందని వివరించారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునే దిశగా 25 సంవత్సరాలకు నిర్దేశించుకున్న శక్తిమంతమైన రోడ్‌మ్యా్‌పతో ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పారు. సామాన్యులపై భారం తగ్గించేందుకు 17 రకాల క్యాన్సర్ మందులు, 7 రకాల అరుదైన వ్యాధులకు సంబంధించిన మందులపై పన్నులు రద్దు చేశారని పేర్కొన్నారు. దేశ చరిత్రలో మొదటిసారిగా కేంద్ర బడ్జెట్‌లో మానసిక ఆరోగ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ నిమ్హాన్స్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు చెప్పారు. బయో-టెక్నాలజీ రంగానికి రూ.10వేల కోట్లు కేటాయించడం దేశంలో మరో పారిశ్రామిక విప్లవానికి నాంది కానుందన్నారు. కాగా, క్వాంటమ్ కంప్యూటింగ్‌లో ప్రస్తుతం బీటెక్ కోర్సులు అందిస్తున్న వర్సిటీలు త్వరలోనే ఎంటెక్ కోర్సులు కూడా ప్రారంభిస్తాయని జితేంద్ర సింగ్ ప్రకటించారు. ‘సాధారణంగా మనమంతా ఇవ్వాల్టి రోజున జీవిస్తూ, రేపటి కోసం ఆలోచిస్తాం.
కానీ సీఎం చంద్రబాబు రేపటి కోసం జీవిస్తూ, ఎల్లుండి కోసం ఆలోచిస్తారు. విశాఖను డీప్-సీ రీసెర్చ్ కేంద్రంగా మార్చేలా ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ప్రకటించారు. ఆ కార్యాచరణను త్వరితగతిన అమలు చేస్తాం. భారత్‌ను సాంకేతికంగా అత్యున్నతంగా మారుస్తాం’ అని కేంద్ర మంత్రి తెలిపారు. నేషనల్ క్వాంటమ్ మిషన్‌ను ప్రారంభించామని, దీనికోసం రూ.6 వేల కోట్లు కేటాయించామని వివరించారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ కంప్యూటర్లతో పాటు నిపుణులను కూడా తయారు చేస్తుందని ప్రకటించారు. రక్షణ, ఆరోగ్యం, ఆర్థికం... తదితర రంగాల్లో వేగవంతమైన పరిశోధనలు, ఆవిష్కరణలతో పాటు క్యూబిట్ నుంచి క్రయోజెనిక్స్ సహా వేర్వేరు అధునాతన సాంకేతికాంశాలకు ఈ హబ్ కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు. ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందుతాయన్నారు. పవిత్ర అమరావతి రాజధాని నుంచి భారత క్వాంటం కంప్యూటింగ్ ప్రయాణం ప్రారంభించడం వికసిత్ భారత్‌లో కీలకమని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. అంతకుముందు విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కేంద్ర బడ్జెట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.