Share News

‘స్టెమ్‌ క్వెస్ట్‌’తో ఒత్తిడి లేని చదువు..!

ABN , Publish Date - May 14 , 2026 | 05:42 AM

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు యాపిల్‌ సంస్థ ఏటా నిర్వహించే ‘స్విఫ్ట్‌ స్టూడెంట్‌ చాలెంజ్‌-2026’లో నగరానికి చెందిన యువకుడు సత్తాచాటాడు.

‘స్టెమ్‌ క్వెస్ట్‌’తో ఒత్తిడి లేని చదువు..!

  • ‘యాపిల్‌’ స్విఫ్ట్‌ స్టూడెంట్‌ చాలెంజ్‌లో విశాఖ యువకుడి సత్తా

  • విద్యార్థుల మానసిక ఒత్తిడిని దూరం చేసే యాప్‌ రూపకల్పన

  • ఐదు లక్షల మంది పోటీ.. టాప్‌-15లో నిలిచిన ‘స్టెమ్‌ క్వెస్ట్‌’

  • అమెరికాలో ‘వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌’కు ఆహ్వానం

  • గీతం యూనివర్సిటీ విద్యార్థి మానస్‌ మళ్ల్లాకు దక్కిన చాన్స్‌

  • జూన్‌ 9న యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌తో భేటీ అయ్యే చాన్స్‌

విశాఖపట్నం, మే 13(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు యాపిల్‌ సంస్థ ఏటా నిర్వహించే ‘స్విఫ్ట్‌ స్టూడెంట్‌ చాలెంజ్‌-2026’లో నగరానికి చెందిన యువకుడు సత్తాచాటాడు. గీతం యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న మానస్‌ మళ్లా... విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు ‘స్టెమ్‌ క్వెస్ట్‌’ అనే వినూత్న యాప్‌ను డిజైన్‌ చేశారు. ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాయంతో రూపొందించిన ఈ పర్సనలైజ్డ్‌ లెర్నింగ్‌ యాప్‌.. యాపిల్‌ దృష్టిని ఆకర్షించింది. ఈ చాలెంజ్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది పాల్గొనగా యాపిల్‌ ఎంపిక చేసిన టాప్‌-15 ఉత్తమ ఆవిష్కరణల్లో మానస్‌ డిజైన్‌ చేసిన ‘స్టెమ్‌ క్వెస్ట్‌’ యాప్‌ కూడా చోటు దక్కించుకుంది. అలాగే భారత్‌ నుంచి ఎంపికైన ఏకైక ఆవిష్కరణ మాన్‌సదే కావడం విశేషం. ఈ మేరకు జూన్‌ 6 నుంచి 13 వరకు అమెరికాలోని కాలిఫోర్నియాలో నిర్వహించే ‘వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌’కు హాజరుకావాలని యాపిల్‌ సంస్థ నుంచి మాన్‌సకు ఆహ్వానం అందింది. జూన్‌ 9న ఆ సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌తో భేటీ అయ్యే అవకాశం కల్పించింది. ఈ సమావేశంలో యాప్‌ను మరింతగా అభివృద్ధి చేసి ఎలా ముందుకు తీసుకువెళ్లాలి, విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంది అనే వివరాలను టిమ్‌ కుక్‌తో మానస్‌ పంచుకునే అవకాశం ఉంది.


యాప్‌ పనిచేస్తుందిలా...

సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌ , మేథమెటిక్స్‌ (స్టెమ్‌) సబ్జెక్టులను అర్థమయ్యేలా వినూత్న పద్ధతుల్లో వివరించడమే ఈ స్టెమ్‌ క్వెస్ట్‌ యాప్‌ ప్రధాన ఉద్దేశం. ఈ సబ్జెక్టులు నేర్చుకోవడంలో ఎంతోమంది తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. వారిలో భయాన్ని తగ్గించి, యానిమేటెడ్‌ క్యారెక్టర్ల సాయంతో సులువుగా నేర్చుకునేలా యాప్‌ను తీర్చిదిద్దారు. యాప్‌ ఓపెన్‌ చేయగానే ఈ నాలుగు సబ్జెక్టుల ఆప్షన్స్‌ కనిపిస్తాయి. వాటిలో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకుని వీడియో కాల్‌ చేయవచ్చు. నచ్చిన భాషలో యానిమేటెడ్‌ క్యారెక్టర్‌తో ఇంటరాక్ట్‌ అవుతూ ఆయా సబ్జెక్టులు నేర్చుకోవచ్చు. యానిమేటెడ్‌ క్యారెక్టర్‌ చెప్పే అంశాలు విద్యార్థికి అర్థమవుతున్నదీ, లేనిదీ వారి ముఖ కవళికలను బట్టి గుర్తించేలా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారంగా యాప్‌ను డిజైన్‌ చేశారు. ఒకవేళ విద్యార్థికి అర్థం కాలేదని భావిస్తే.. స్పష్టత వచ్చేంత వరకూ ఇది నేర్పుతుంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ విద్యార్థులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దిన ఈ యాప్‌ 72 భాషల్లో సేవలందిస్తుంది.

ఒత్తిడిని అధిగమించేందుకు

ఐఐటీకి ప్రిపరేషన్‌ సమయంలో నా స్నేహితుడు ఆత్మహత్యకు యత్నించాడు. అలాంటివారు దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉంటారని అర్థమైంది. దీనికి పరిష్కారం చూపించాలనుకున్నాను. బీటెక్‌లో చేరిన తర్వాత ఈ కాంటెస్ట్‌ గురించి తెలుసుకుని పూర్తిస్థాయిలో దృష్టిసారించి ఈ యాప్‌ను డిజైన్‌ చేశాను. 2023లో ఐఐటీ హైదరాబాద్‌ బిల్డ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ ఆవిష్కరణకు రూ.2 లక్షల వరకు సాయం చేసింది. ఇప్పుడు అమెరికా వెళ్లేందుకు గీతం కాలేజీ ఆర్థిక సహకారం అందిస్తోంది. అక్కడ యాపిల్‌ ఇంజనీర్లతో వారం రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఉంటుంది. అనంతరం యూప్‌ను పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చి మార్కెట్‌లో విడుదల చేస్తాం. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకున్నా.. ఆఫ్‌లైన్‌లో కూడా దీన్ని వినియోగించవచ్చు. అమ్మ లక్ష్మీ గృహిణి, నాన్న రామారావు గీతం విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌. తల్లిదండ్రులు, ప్రొఫెసర్ల సహకారం మరువలేను.

- మానస మళ్లా, స్టెమ్‌ క్వెస్ట్‌ యాప్‌ డిజైనర్‌

Updated Date - May 14 , 2026 | 05:42 AM