లాభాల్లోకి విశాఖ ఉక్కు
ABN , Publish Date - Feb 04 , 2026 | 04:12 AM
‘విశాఖపట్నం ఉక్కు కర్మాగారం నష్టాల నుంచి లాభాల బాటలోకి వచ్చింది. కార్మికులు, యాజమాన్యం కలిసి పనిచేస్తే మరిన్ని మెరుగైన ఫలితాలు వస్తాయి’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
గత ఏడాది సెప్టెంబరులో 486 కోట్ల నష్టం
ఈ జనవరిలో 54 కోట్ల లాభం
కార్మికులు, యాజమాన్యం కలిసి పనిచేయాలని సమీక్షలో సీఎం సూచన
విశాఖపట్నం, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ‘విశాఖపట్నం ఉక్కు కర్మాగారం నష్టాల నుంచి లాభాల బాటలోకి వచ్చింది. కార్మికులు, యాజమాన్యం కలిసి పనిచేస్తే మరిన్ని మెరుగైన ఫలితాలు వస్తాయి’ అని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో ఆయన మంగళవారం విశాఖ ఉక్కుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ నుంచి కేంద్ర ఉక్కు కార్యదర్శి సందీప్ పౌండ్రిక్, ప్లాంటు సీఎండీ మనీశ్ రాజ్ గుప్తా, సీఎస్ విజయానంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎండీ మనీ్‌షరాజ్ గుప్తా ప్లాంటు సాధించిన ప్రగతిని సీఎంకు వివరించారు. ‘గత ఆర్థిక సంవత్సరం(2024-25) రెండో క్వార్టర్‌లో రోజుకు 9,215 టన్నుల హాట్ మెటల్ మాత్రమే ఉత్పత్తి చేశాం. ఇప్పుడు 19,401 టన్నులు వస్తోంది. ప్లాంటు యుటిలైజేషన్ కెపాసిటీ 94 శాతానికి చేరింది. 2024 సెప్టెంబరులో రూ.486 కోట్ల నష్టాల్లో ఉన్న స్టీల్‌ప్లాంటు ఈ జనవరిలో రూ.54 కోట్ల లాభం ఆర్జించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం రూ.11,440 కోట్లతోనే ఇది సాధ్యమైంది. ప్రస్తుతం ప్లాంటుకు క్రెడిట్ రేటింగ్ కూడా పెరిగింది’ అని సందీప్ పౌండ్రిక్ తెలిపారు. ‘అన్ని విభాగాల్లోను నూతన విధానాలు అమలు చేయండి. ప్లాంటును మరింత బలోపేతం చేయాలి. కార్మికులు, ఉద్యోగుల సమర్థ వినియోగంతో మంచి ఫలితాలు వస్తాయని మరోసారి నిరూపితమైంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశాఖ ఉక్కు కర్మాగారానికి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి’ అని సీఎం హామీ ఇచ్చారు.