ఉక్కు పవర్ ప్లాంటులో కార్బన్ మోనాక్సైడ్ లీక్
ABN , Publish Date - May 12 , 2026 | 05:25 AM
విశాఖఉక్కు కర్మాగారంలోని థర్మల్ పవర్ ప్లాంటు (టీపీపీ) విభాగంలో సోమవారం కార్బన్ మోనాక్సైడ్ లీక్ కావడంతో నలుగురు కాంట్రాక్టు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.
నలుగురు కాంట్రాక్టు కార్మికులకు అస్వస్థత
ఉక్కుటౌన్‌షిప్, మే 11(ఆంధ్రజ్యోతి): విశాఖఉక్కు కర్మాగారంలోని థర్మల్ పవర్ ప్లాంటు (టీపీపీ) విభాగంలో సోమవారం కార్బన్ మోనాక్సైడ్ లీక్ కావడంతో నలుగురు కాంట్రాక్టు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. టీపీపీ విభాగంలో ఓ కాంట్రాక్టు సంస్థ వద్ద జీవీఎంసీ 77వ వార్డు నమ్మిదొడ్డి ప్రాంతానికి చెందిన నమ్మి శ్రీనివాసరావు (37), దాసరి తాతారావు (55), దాసరి అప్పన్నరెడ్డి (43), దేవాడకు చెందిన ఎండీ అజీజ్ (51) పనిచేస్తున్నారు. వీరంతా సోమవారం ఎనిమిది మీటర్ల ఎత్తులో గల ప్లాట్‌ఫామ్‌పై నిల్చుని కప్లింగ్ మార్చే పనులు చేస్తున్నారు. ఆ సమయంలో పైపులోని కార్బన్ మోనాక్సైడ్ లీకవడంతో నలుగురూ స్పృహ తప్పి కిందపడిపోయారు. సమీపంలోని కార్మికులు వెంటనే గ్యాస్‌వాల్వ్‌ను కట్టేశారు. అస్వస్థతకు గురైన కార్మికులను ఉక్కు జనరల్ ఆస్పత్రికి, తర్వాత గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను స్టీల్‌ప్లాంటు కాంట్రా క్టు లేబర్ యూనియన్ సీఐటీయూ నాయకులు రమణ పరామర్శించారు.