Share News

స్టీల్‌ ప్లాంట్‌లో ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Jun 09 , 2026 | 06:29 AM

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటులో పేలుడు ప్రమాదం అంతా నిమిషాల్లో జరిగిపోయింది. దగ్గరలో ఉన్న కార్మికులు ప్రమాదం నుంచి బయట పడటానికి కానీ.. వారికి సాయం చేయడానికి కానీ..

స్టీల్‌ ప్లాంట్‌లో ఏం జరిగిందంటే..

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటులో పేలుడు ప్రమాదం అంతా నిమిషాల్లో జరిగిపోయింది. దగ్గరలో ఉన్న కార్మికులు ప్రమాదం నుంచి బయట పడటానికి కానీ.. వారికి సాయం చేయడానికి కానీ.. ఏమాత్రం అవకాశం, సమయం లేనివిధంగా ఘోరం జరిగిపోయింది. ల్యాడిల్‌లోని సుమారు 1500-2000 డిగ్రీల వేడి గల ద్రవపు ఉక్కు ఒక్కసారిగా పేలడంతో వెంటనే మంటలు చెలరేగాయి. కార్మికులు అగ్నికీలల్లో కాలిపోయి బొగ్గులా మారిపోయారు. ప్రమాదం ఎలా జరిగిందంటే...

  • స్టీల్‌ ఉత్పత్తిలో భాగంగా బ్లాస్ట్‌ ఫర్నేస్‌లో తయారు చేసిన ద్రవపు ఉక్కు(హాట్‌ మెటల్‌)ను ల్యాడిల్‌ ద్వారా స్టీల్‌ మెల్టింగ్‌ షాపు (ఎస్‌ఎంఎస్‌) విభాగంలోకి తీసుకువెళ్తున్నారు. అది 1,500 డిగ్రీల నుంచి 2000 డిగ్రీల వేడితో ఉంది. చాలా జాగ్రత్తగా హ్యాండిల్‌ చేస్తున్నారు.

  • అప్పుడప్పుడు ల్యాడిల్‌ బ్యాలెన్స్‌ తప్పి కొంత హాట్‌ మెటల్‌ కిందకు పడిపోతుంటుంది. అలాగే ల్యాడిల్‌కు రంధ్రం పడి కూడా కారిపోతుంటుంది. అయితే ఈ సారి అలా జరగలేదు. ల్యాడిల్‌లో హాట్‌మెటల్‌ ఏ కారణంగానో ఒక్కసారిగా పేలిపోయింది.

  • పేలుడు జరిగిన సమయంలో ల్యాడిల్‌లో 150 టన్నుల సలసలా కాగుతున్న ద్రవపు ఉక్కు ఉంది. పేలుడు ధాటికి ల్యాడిల్‌ తునాతునకలైపోవడంతో హాట్‌ మెటల్‌ నలువైపులా చెల్లాచెదురుగా పడింది. దీంతో క్షణాల్లో ఎక్కడికక్కడే మంటలు చెలరేగాయి.

  • హాట్‌ మెటల్‌ కింద పడి మంటలు చెలరేగిన ప్రాంతం దగ్గరలో కంట్రోల్‌ రూమ్‌ ఉంది. కంట్రోల్‌ రూమ్‌లో ఉన్న ఉద్యోగులు కూడా మంటల్లో చిక్కుకున్నారు. ఇలా ల్యాడిల్‌పైన ఉంటుండగానే పేలడం విశాఖ ఉక్కు చరిత్రలో ఇదే ప్రథమం.

Updated Date - Jun 09 , 2026 | 06:31 AM