విశాఖకు సెమీ రింగ్ రోడ్డు
ABN , Publish Date - May 10 , 2026 | 06:36 AM
విశాఖపట్నానికి 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్‌రోడ్డు నిర్మిస్తామని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు.
రాంబిల్లి నుంచి భోగాపురం వరకు నిర్మాణం
ల్యాండ్ పూలింగ్ ద్వారా భూ సేకరణ
రూ.14 వేల కోట్లతో రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీరు
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ
విశాఖపట్నం, మే 9 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నానికి 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్‌రోడ్డు నిర్మిస్తామని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. విశాఖ మహా నగర ప్రాంతాభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. రాంబిల్లి నుంచి విశాఖ మీదుగా భోగాపురం వరకు ఈ సెమీ రింగ్‌రోడ్డు వస్తుందని తెలిపారు. దీనికి డీపీఆర్ తయారవుతోందని, ప్రజా ప్రతినిధులతో చర్చించిన తర్వాత అలైన్‌మెంట్ నిర్ణయిస్తామని వెల్లడించారు. అవసరమైన భూమిని ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరిస్తామన్నారు. రింగ్ రోడ్డుకు ఇరువైపులా లేఅవుట్లు వేసి, రైతులకు వాటా ఇస్తామని తెలిపారు. భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానిస్తూ బీచ్ కారిడార్ నిర్మాణం కూడా చేపడతామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీరు ఇచ్చేందుకు రూ.14 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. భూగర్భ కాలువల నిర్మాణానికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ ఉందన్నారు. వర్షపు నీరు పోవడానికి ఓపెన్ డ్రైన్లు నిర్మిస్తామన్నారు. ఇళ్లలో కిచెన్, బాత్‌రూమ్‌ల్లో ఉపయోగించిన నీరు పోవడానికి ప్రత్యేక కాలువలు నిర్మించే ప్రణాళిక ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీటి నిర్మాణానికి రూ.29 వేల కోట్లు అవసరమని, ముందుగా జనాభా ఎక్కువగా, మీడియంగా ఉండే ప్రాంతాల్లో రూ.9 వేల కోట్లతో వీటి నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 123 మునిసిపాలిటీలలో మురుగునీటి శుద్ధి కేంద్రాలు(ఎ్‌సటీపీ) నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. భూమి విలువను బట్టి పన్ను వేసే విధానం గత ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిందని, దానినే కొనసాగిస్తున్నామని మంత్రి నారాయణ స్పష్టంచేశారు. ఎంఎ్‌సఎంఈలు, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్ పాల్గొన్నారు.