Share News

భయంతో ఆగిన బాలుడి ఊపిరి!

ABN , Publish Date - Aug 21 , 2026 | 03:40 AM

విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యూకేజీ చదువుతున్న ఆరేళ్ల బాలుడు భయంతో టీచర్‌ చేతుల్లోనే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. హోంవర్క్‌ చేయలేదని మందలించిన క్లాస్‌ టీచర్‌..

భయంతో ఆగిన బాలుడి ఊపిరి!

  • హోమ్‌ వర్క్‌ చేయలేదని చెంపపై కొట్టిన టీచర్‌

  • క్షణాల్లో కుప్పకూలి ఆరేళ్ల బాలుడి మృతి

  • విశాఖలో విషాదం.. విచారణకు విద్యా శాఖ ఆదేశం

  • ఒత్తిడికి గురికావడం వల్లే గుండె షట్‌డౌన్‌: వైద్యులు

  • టీచర్లకు ప్రత్యేక శిక్షణ.. ప్రభుత్వ నిర్ణయం

విశాఖపట్నం/మహారాణిపేట, అమరావతి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యూకేజీ చదువుతున్న ఆరేళ్ల బాలుడు భయంతో టీచర్‌ చేతుల్లోనే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. హోంవర్క్‌ చేయలేదని మందలించిన క్లాస్‌ టీచర్‌.. చెంపపై ఓ దెబ్బ కొట్టగా.. క్షణాల్లోనే గుండె ఆగి ఆమెపైనే కుప్పకూలిపోయాడు. అంత చిన్న బాలుడు అకస్మాత్తుగా గుండె ఆగి మరణించడం ఒక్కసారిగా విషాదం నింపింది. తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చింది. ఈ ఘటనపై విశాఖ కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. వివరాలిలా ఉన్నాయి... నగరంలోని వన్‌టౌన్‌ కొత్తరోడ్డు ప్రాంతానికి చెందిన తమ్మన కృష్ణప్రసాద్‌, సాయిప్రియ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె మనస్విని రామ్‌నగర్‌ కోటక్‌ స్కూలులో రెండో తరగతి చదువుతుండగా.. కుమారుడు ప్రణయ్‌తేజ (6) ఇంటికి సమీపంలోని లిటిల్‌ గార్డెన్‌ స్కూలులో యూకేజీ చదువుతున్నాడు. కృష్ణప్రసాద్‌ కుటుంబం వారం క్రితం తీర్థయాత్రలకు వెళ్లి రెండు రోజుల క్రితమే వచ్చింది. గురువారం ప్రణయ్‌తేజ పాఠశాలకు వెళ్లాడు. 10.30 గంటల సమయంలో ఉపాధ్యాయురాలు సుష్మ.. హోంవర్క్‌ తనిఖీ చేస్తున్నారు. ప్రణయ్‌తేజ హోమ్‌వర్క్‌ చేయకపోవడంతో దగ్గరకు పిలిచి షర్టు పట్టుకున్నారు. హోమ్‌వర్క్‌ ఎందుకు చేయలేదని చెంపపై ఒక దెబ్బ వేశారు. బాగా భయపడిపోయిన ప్రణయ్‌తేజ ఒక్కసారిగా టీచర్‌పై కుప్పకూలిపోయాడు. టీచర్‌ అప్రమత్తమై ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించగా.. సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ చిన్నారి చనిపోయినట్టు వైద్యులు చెప్పారు. ఆ తర్వాత కేజీహెచ్‌కు తరలించారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్‌ పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు వచ్చి పాఠశాల, కేజీహెచ్‌ మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సుష్మను అదుపులోకి తీసుకున్నారు.


విచారణకు త్రిసభ్య కమిటీ: విద్యాశాఖ

విద్యార్థి మృతి ఘటన అత్యంత దురదృష్టకరమని, ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణిస్తుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఘటన జరిగిన వెంటనే అధికారులు విచారణ చేపట్టి ప్రాథమిక నివేదిక సమర్పించారని, మరింత సమగ్రంగా పరిశీలించేందుకు విశాఖ ఆర్‌జేడీ, డీఈవో, ఆర్‌డీవోలు సభ్యులుగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. ఉపాధ్యాయులు విద్యార్థులతో సున్నితంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించేలా అవసరమైన సెన్సిటైజేషన్‌ కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది.

బాలుడు చనిపోవడం బాధాకరం: లోకేశ్‌

లిటిల్‌ గార్డెన్‌ స్కూలులో ఆరేళ్ల ప్రణయ్‌తేజ మృతిచెందడం బాధాకరమని మంత్రి లోకేశ్‌ అన్నారు. ‘విద్యార్థి తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మీకు కలిగిన నష్టం ఎవరూ పూడ్చలేనిది. మా ప్రభుత్వం మీకు అన్నివిధాలా అండగా ఉంటుంది. ధైర్యంగా ఉండాలి’ అని పేర్కొన్నారు. బాధ్యులపై, సంబంధిత స్కూలు యాజమాన్యంపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని లోకేశ్‌ స్పష్టం చేశారు.

తీవ్ర ఒత్తిడికి గురికావడం వల్లే

విశాఖలోని ప్రైవేటు పాఠశాలలో బాలుడి మృతి ఘటన బాధకరం. వయస్సుతో సంబంధం లేకుండా అకస్మాత్తుగా హార్ట్‌ ఫెయిల్యూర్స్‌ వస్తుంటాయి. దీన్ని గుండెపోటు అనలేం. తీవ్ర ఒత్తిడికి గురికావడం వల్ల గుండె అకస్మాత్తుగా ఆగిపోతుంది. గతంలో ఎంసెట్‌ విద్యార్థులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొనేవారు. ఈ సమస్య ఎవరికైనా రావొచ్చు. విశాఖ పాఠశాలలో బాలుడు అకస్మాత్తుగా తీవ్రమైన ఒత్తిడికి గురికావడంతో గుండె ఎలక్ట్రికల్‌ షట్‌డౌన్‌ అయి మరణించినట్లు భావించవచ్చు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునే వ్యాయామాలు చేయాలి. టీచర్లు కూడా పిల్లల్ని భయపెట్టి ఒత్తిడికి గురిచేయకుండా, సున్నితంగా మాట్లాడాలి. శిక్షణ పద్ధతుల్లో మార్పురావాలి. విద్యాబోధనలో వారికి కూడా కౌన్సెలింగ్‌, శిక్షణ వంటివి చేపడితే ఇలాంటి వాటిని నివారించవచ్చు.

- సీనియర్‌ చీఫ్‌ కార్డియాలజిస్ట్‌, ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ వీసీ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌

Updated Date - Aug 21 , 2026 | 03:45 AM