Share News

వాడేది బీఎండబ్ల్యూ కారు.. చేసేవి చోరీలు!

ABN , Publish Date - Feb 08 , 2026 | 04:03 AM

విశాఖలో ఇల్లాలిని, హైదరాబాద్‌లో ప్రియురాలిని పెట్టకుని, బీఎండబ్ల్యూ కారులో జల్సాగా తిరుగుతూ రూ.కోటి విలువైన బంగారం, వెండి, డబ్బు కూడబెట్టుకున్న ఘరానా దొంగను విశాఖ పోలీసులు...

వాడేది బీఎండబ్ల్యూ కారు.. చేసేవి చోరీలు!

  • విశాఖ, కాకినాడ, రాజమండ్రిల్లో 62 దొంగతనాలు

  • రూ.కోటి విలువైన చోరీ సొత్తు స్వాధీనం

  • విశాఖలో ఇల్లాలు, హైదరాబాద్‌లో ప్రియురాలు.. దొరికింది విశాఖలో..

విశాఖపట్నం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): విశాఖలో ఇల్లాలిని, హైదరాబాద్‌లో ప్రియురాలిని పెట్టకుని, బీఎండబ్ల్యూ కారులో జల్సాగా తిరుగుతూ రూ.కోటి విలువైన బంగారం, వెండి, డబ్బు కూడబెట్టుకున్న ఘరానా దొంగను విశాఖ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అరెస్టు చేసేవరకూ అతడి దొంగతనాల గురించి ఇంట్లోగాని, బయట వాళ్లకు గాని తెలియకపోవడం చిత్రం. వివరాలను శనివారం సీపీ శంఖబ్రతబాగ్చి వెల్లడించారు. కాకినాడకు చెందిన మహే్‌షరెడ్డి చిన్నతనం నుంచే జల్సాలకు అలవాటుపడి.. 15 ఏళ్ల వయస్సులోనే దొంగతనాల బాటపట్టాడు. పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 4 చోట్ల దొంగతనాలు చేసి పోలీసులకు పట్టుబడడంతో జువెనైల్‌ హోమ్‌కు పంపించా రు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. హైదరాబాద్‌ వెళ్లి కొన్ని ఐటీ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేశాడు. తర్వాత విశాఖ వచ్చి పలు ఐటీ కంపెనీల్లో పనిచేశాడు. ఇక్కడే కంపెనీలోని యువతితో ప్రేమాయణం సాగించాడు. హైదరాబాద్‌లోని ఒక సంస్థలో మంచి ఆఫర్‌ వచ్చిందంటూ 6 నెలల కిందట విశాఖలో ఉద్యోగం మానేసి హైదరాబాద్‌ వెళ్లాడు. అక్కడ మరో యువతితో ప్రేమాయణం మొదలుపెట్టాడు. ఆమెతో ప్రేమాయణం సాగిస్తూనే అప్పుడప్పుడు విశాఖ వచ్చి.. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రెక్కీ చేసేవాడు. రెక్కీ సమయంలో కూడా తన ఆనవాళ్లేవి కనిపించకుండా మాస్క్‌, టోపీ ధరించేవాడు. రెక్కీ చేసిన ఇంట్లో రాత్రివేళ చోరీ చేసి, తర్వాత రోజు హైదరాబాద్‌ వెళ్లిపోయేవాడు.


చోరీల గురించి భార్యకే తెలియదు!

మహే్‌షరెడ్డి విశాఖలో తనకు పరిచయమైన యువతిని రెండు నెలల కిందట పెళ్లి చేసుకున్నాడు. మరోవైపు హైదరాబాద్‌లో యువతితో సంబంధం కొనసాగించాడు. చోరీచేసిన బంగారం, వెండిని భార్య, ప్రియురాలికి ఇస్తూ విలాస జీవితం గడిపేవాడు. చోరీసొత్తు విక్రయించి ఖరీదైన బీఎండబ్ల్యూ కారు కొన్నాడు. మహే్‌షరెడ్డి నేరచరిత్ర గురించి పోలీసులు అరెస్టు చేసేంతవరకూ అతడి భార్యకు, ప్రియురాలికి తెలియదు. మహే్‌షరెడ్డి తన భార్య, ప్రియురాలి వద్ద భారీ వేతనం సంపాదించే ఉద్యోగిగా బిల్డప్‌ ఇస్తూ చోరీ చేసిన సొమ్ముతో వ్యాపార రంగంలోకి ప్రవేశించాలని పథకం రచించాడు. అతను స్వతహాగా బాడీబిల్డర్‌. జిమ్‌ చేసేవాళ్లు కండరాలను పెంచేందుకు వాడే ప్రొటీన్‌ పౌడర్‌ తయా రీ యూనిట్‌ను విశాఖలో పెట్టాలనుకున్నాడు. అందుకు చోరీలు కూడా పెంచాడు. గత ఏడాదిన్నర కాలంలో గాజువాక, ఆరిలోవ, మల్కాపురం, పెందుర్తి, దువ్వాడ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 26, కాకినాడ, రాజమండ్రి, సర్పవరం, రామచంద్రపురంలో 36 చోరీలు చేశాడు.

ఎలా దొరికాడంటే..!

గాజువాకలోని జోగవానిపాలేనికి చెందిన కన్నా శివరామకృష్ణ గత ఏడాది అక్టోబరు 10న అరుణాచలం వెళ్లారు. ఇంటి యజమాని 13న ఫోన్‌ చేసి ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి ఉన్నాయని చెప్పడంతో ఆయన 14న నగరానికి వచ్చారు. బీరువా విరగ్గొట్టి ఉంది. అందులోని 17 తులాలు బంగారం, 30 తులాల వెండి వస్తువులు చోరీకి గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు.. చోరీ జరిగిన ఇంటితోపాటు పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా... ఒకరు ముఖానికి మాస్క్‌, టోపీ ధరించి ఉండడంతో గుర్తించలేకపోయారు. గ్లౌజ్‌లు ధరించడంతో ఘటనా స్థలంలో వేలిముద్రలు కూడా లభించలేదు. నిందితుడు చోరీకి పాల్పడిన తర్వాత ఒకచోట పార్కింగ్‌ చేసి ఉన్న స్కూటీని తీసుకుని వెళ్లిపోయాడు. సీసీ కెమెరా ఫుటేజీలో గుర్తించిన స్కూటీ కోసం గాలించారు. కొన్నాళ్లకు మాధవధారలో పార్కింగ్‌ చేసి ఉండగా మహే్‌షరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Feb 08 , 2026 | 04:04 AM