లారీ ఆగి.. నలుగురి ప్రాణం తీసింది!
ABN , Publish Date - Jul 20 , 2026 | 03:53 AM
ముందువెళుతున్న లారీని డ్రైవర్ ఆకస్మాత్తుగా ఆపడంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ...
వెనుక నుంచి బలంగా ఢీకొట్టిన కారు
విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
మరొకరికి తీవ్ర గాయాలు
మృతులు పల్నాడు జిల్లా వాసులు
విశాఖపట్నం/ఆనందపురం, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ముందువెళుతున్న లారీని డ్రైవర్ ఆకస్మాత్తుగా ఆపడంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న బాలుడుసహా నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గండిగుండం సమీపంలో 16వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్ల గ్రామానికి చెందిన మందపాటి చంద్రశేఖర్, ఆయన కుమారుడు మందపాటి భవానీశంకర్, పాలగాని రామాంజనేయులు, దూదేకుల మీరావలి శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరులో ఒక శుభకార్యానికి బయలుదేరారు. నరసరావుపేటకు చెందిన మగతాపురపు శ్రీనివాసరావు కారులో శనివారం రాత్రి వీరంతా బయలుదేరగా.... కారు ఆదివారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయానికి విశాఖ జిల్లా ఆనందపురం మండలం గండిగుండం పంచాయతీ పరిధిలోని సత్తారు జంక్షన్ వంతెనపైకి చేరింది. ఆసమయంలో ముందు వెళుతున్న ఓ లారీ ఉన్నట్టుండి రోడ్డుపై ఆగిపోవడంతో వెనుక వస్తున్న కారు రెప్పపాటులో లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. పెద్ద శబ్దం రావడంతోపాటు కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. ఆ వెంటనే లారీ ఆగకుండా వెళ్లిపోయింది. కారులో ప్రయాణిస్తున్న భవానీశంకర్ (12), రామాంజనేయులు (54), మీరావలి (56), డ్రైవర్ శ్రీనివాసరావు (50) అక్కడికక్కడే మృతిచెందారు. చంద్రశేఖర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆనందపురం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని తీవ్రగాయాలతో ఉన్న చంద్రశేఖర్‌ను 108 అంబులెన్స్‌లో విశాఖలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కారులో నుంచి నలుగురి మృతదేహాలను బయటకు తీశారు. లారీ నంబర్‌ను సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా గుర్తించిన పోలీసులు.. వాహనం యజమానికి ఫోన్ చేసి వాహనాన్ని వెనక్కు రప్పించారు. లారీ ప్రస్తుతం ఆనందపురం పోలీసు స్టేషన్‌లో వుంది.