విశాఖలో 9 సెంటీమీటర్ల వాన
ABN , Publish Date - Aug 07 , 2026 | 04:36 AM
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గురువారం ఎండ తీవ్రత కొనసాగింది. ఉక్కపోత పెరిగింది. అలాగే, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
ఉత్తరాంధ్రలోని మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ వర్షం
14న అల్పపీడనం
విశాఖపట్నం, అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గురువారం ఎండ తీవ్రత కొనసాగింది. ఉక్కపోత పెరిగింది. అలాగే, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో వాతావరణంలో తీవ్ర అనిశ్చితి నెలకొని గురువారం మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్రలో ఎక్కువచోట్ల ఈదురుగాలులతో వర్షం కురిసింది. విశాఖ నగరం బుచ్చిరాజుపాలెంలో 9.17, మహారాణిపేటలో 8.9, విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 8.62, పార్వతీపురం జిల్లా సాలూరులో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 14న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.