Union Minister Sarbananda Sonowal: విశాఖ పోర్టు పనితీరు భేష్
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:27 AM
విశాఖపట్నం పోర్టు ఈ ఏడాది 100 మిలియన్ టన్నుల సరకు రవాణాను అధిగమిస్తుందని కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు
రూ.52.23 కోట్లతో ఎల్‌పీజీ బెర్తులో అగ్నిమాపక సదుపాయాల అభివృద్ధి
రూ.35.87 కోట్లతో ఓఆర్‌ఎస్ డ్రైడాక్ ఆధునికీకరణ
రూ.97.7 కోట్లతో జి+9 అంతస్థుల పరిపాలనా భవన నిర్మాణం
రూ.44.2 కోట్లతో హార్బర్ పార్కులో నివాసానికి అపార్ట్‌మెంట్ల నిర్మాణం
విశాఖపట్నం, జనవరి 10(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం పోర్టు ఈ ఏడాది 100 మిలియన్ టన్నుల సరకు రవాణాను అధిగమిస్తుందని కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. పోర్టులో రూ.230 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. స్థానిక సాలగ్రామపురంలోని సాగరమాల కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ‘విశాఖపట్నం పోర్టు చక్కటి పనితీరు ప్రదర్శిస్తోంది. ప్రపంచంలోని తొలి 100 పోర్టుల్లో ఒకటిగా నిలుస్తోంది’ అని పేర్కొన్నారు. ఎంపీ ఎం.శ్రీభరత్ మాట్లాడుతూ, ‘పోర్టు చేపట్టిన ప్రాజెక్టులు పూర్తిచేసే బాధ్యతను ఆ శాఖపైనే వదిలేయకుండా ప్రజాప్రతినిధులుగా మా వంతు పాత్ర పోషిస్తాం. కాలుష్య నియంత్రణకు జిల్లా అధికారులతో కలసి మరింత సమర్థంగా పనిచేయాలి’ అని సూచించారు. కేంద్ర కార్యదర్శి విజయకుమార్ మాట్లాడుతూ, సరకు రవాణా పెంచడంతో పాటు భద్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పోర్టు ఇన్‌చార్జి చైర్మన్ అంగముత్తు మాట్లాడుతూ... ఉద్యోగుల పని, నివాస పరిస్థితులు మెరుగుపడేలా ఆధునిక పరిపాలనా కార్యాలయం, నివాస సముదాయం నిర్మిస్తున్నామన్నారు. నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ, సీఎస్‌ఆర్ ద్వారా ప్రజోపయోగ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలన్నారు. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, పోర్టు వల్ల విశాఖపట్నం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. కార్యక్రమంలో పోర్టు డిప్యూటీ చైర్మన్ రోషిణి అపరంజి పాల్గొన్నారు. పోర్టు సహకారంతో పలు కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఈ సందర్భంగా ధ్రువపత్రాలు అందజేశారు.
విశాఖలో లైట్‌హౌస్ మ్యూజియం
లైట్‌హౌస్ టూరిజంపై మోదీ దృష్టి
266 కోట్లతో గుజరాత్‌లో అతిపెద్ద లైట్‌హౌస్
మరో 75 లైట్‌హౌ్‌సల అభివృద్ధికి చర్యలు
కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్
విశాఖపట్నం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): దేశంలో అతిపెద్ద లైట్‌హౌ్‌సను గుజరాత్‌లోని నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్(లోథల్)లో రూ.266 కోట్లతో.. 77 మీటర్ల ఎత్తున నిర్మించనున్నట్టు కేంద్ర పోర్టులు, నౌకాయాన, జలరవాణా శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ వెల్లడించారు. శనివారం విశాఖపట్నంలో జరిగిన లైట్‌హౌస్ ఉత్సవం ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. దేశంలో లైట్‌హౌస్ టూరిజాన్ని పెంచాలని ప్రధాని మోదీ సంకల్పించారని, ఈ నేపథ్యలో 75 లైట్‌హౌ్‌సలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దీనికి అదనంగా మరో 25 లైట్‌హౌ్‌సలను గుర్తించామని, వాటిని కూడా పర్యాటకంగా ముందుకు తీసుకువెళతామని చెప్పారు. బ్రహ్మపుత్ర నదీ తీరాన అసోంలో బోగిబీల్, సిల్‌ఘాట్, పాండు, బిశ్వంత్‌ఘాట్‌లో నాలుగు లైట్‌హౌ్‌సలు నిర్మిస్తామన్నారు. విశాఖపట్నంలో పాత లైట్‌హౌ్‌సను మ్యూజియంగా అభివృద్ధి చేయడానికి విశాఖపట్నం పోర్టు 3,156 చ.మీ. స్థలాన్ని అందిస్తోందని, అందులో డైరెక్టర్ జనరల్ ఆఫ్ లైట్ హౌసెస్ అండ్ లైట్‌షిప్స్ సంస్థ పనులు చేపడుతుందని ప్రకటించారు. దీనికి సంబంఽధించిన ఎంఓయూపై వేదికపైనే కేంద్ర మంత్రి సోనోవాల్ సంతకాలు చేశారు. అలాగే, అండమాన్‌లో జంగ్లిఘాట్‌లో సిబ్బంది క్వార్టర్ల పునర్నిర్మాణానికి మంత్రి సోనోవాల్ ఆన్‌లైన్‌లో శంకుస్థాపన చేశారు. గోవాలోని అగౌడా లైట్‌హౌ్‌సలో లైట్ అండ్ సౌండ్ షోను ఇక్కడి నుంచే ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం, గ్యాస్, పర్యాటకశాఖల సహాయ మంత్రి సురేశ్ గోపి, విశాఖపట్నం పోర్టు ఇన్‌చార్జి చైర్మన్ అంగముత్తు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు.