Share News

క్రైస్తవ ప్రచారకుడి ముసుగులో..దాడి డ్రామా!

ABN , Publish Date - May 20 , 2026 | 04:19 AM

‘‘ఏజెన్సీ విడిచి వెళ్లిపోవాలంటూ నన్ను బెదిరిస్తున్నారు. ఇప్పుడు నాపై మతోన్మాదులు ఏకంగా దాడి చేశారు’’ అంటూ క్రైస్తవ మత ప్రచారకుడిగా చెప్పుకొనే వ్యక్తి ఆడిన డ్రామా బట్టబయలైంది.

క్రైస్తవ ప్రచారకుడి ముసుగులో..దాడి డ్రామా!

  • సానుభూతి కోసం దాడి చేయించుకున్న వైనం

  • అభినయ్‌ దర్శన్‌ బండారం బట్టబయలు

  • క్రైస్తవులతో కలిసి పాదయాత్ర, ‘భరోసా’ పార్టీ

  • బెదిరిస్తున్నారంటూ తొలుత సోషల్‌ మీడియా పోస్టు.. ఆపై ‘హత్యాయత్నం’ అంటూ ఆస్పత్రికి

  • సీరియ్‌సగా తీసుకున్న పోలీసులు..

  • వాట్సాప్‌ ఆడియో సాక్షిగా బయటపడ్డ నాటకం

విశాఖపట్నం, మే 19 (ఆంధ్రజ్యోతి): ‘‘ఏజెన్సీ విడిచి వెళ్లిపోవాలంటూ నన్ను బెదిరిస్తున్నారు. ఇప్పుడు నాపై మతోన్మాదులు ఏకంగా దాడి చేశారు’’ అంటూ క్రైస్తవ మత ప్రచారకుడిగా చెప్పుకొనే వ్యక్తి ఆడిన డ్రామా బట్టబయలైంది. కేవలం క్రైస్తవుల సానుభూతి కోసం తనపై తానే దాడి చేయించుకుని నాటకమాడినట్లు వెల్లడైంది. కడప నగరానికి చెందిన అభినయ్‌ దర్శన్‌ ‘భరోసా’ పార్టీ అధినేతగా, క్రైస్తవ మతప్రచారకుడిగా చెప్పుకొంటూ విశాఖ గిరిజన ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నారు. సోమవారం తనపై దాడి జరిగిందంటూ ఒక్కసారిగా హల్‌చల్‌ సృష్టించారు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టి తెగ తిప్పారు. వివరాల్లోకి వెళితే...

అభినయ్‌ దర్శన్‌ ఈ ఏడాది జనవరిలో అరకు లోయలో క్రైస్తవులతో కలిసి పాదయాత్ర ప్రారంభించారు. మార్చిలో కాకినాడలో క్రైస్తవుల సమక్షంలో ‘భరోసా’ పార్టీని ఏర్పాటు చేశారు. నెల రోజులుగా పాడేరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. 16 రోజులుగా గూడెంకొత్తవీధి మండలం మొండిగెడ్డ పంచాయతీ నీరుతోటపాలెంలోనే ఉంటున్నారు. తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని, ఏజెన్సీ విడిచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారని 10 రోజుల క్రితం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. సోమవారం గ్రామం నుంచి కారులో జర్రెల వైపు వెళ్తుండగా దుండగులు అడ్డగించి తనపై హత్యాయ త్నం చేశారని చింతపల్లి ఆస్పత్రిలో చేరారు. దాడి వీడియోను పోస్టు చేసి.. ‘భరోసా పార్టీ అధినేత అభిన య్‌పై మతోన్మాదుల దాడి’ అంటూ ప్రచారం చేశారు.


ఈ ఘటనపై చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించారు. తొలుత గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారనే కోణంలో విచారణ మొదలు పెట్టారు. సాంకేతిక ఆధారాలు పరిశీలించి, అనుచరులను ప్రశ్నించడంతో గుట్టరట్టయింది. అభినయ్‌ తనపై తానే దాడి చేయించుకున్నట్టు ఆధారా లు లభించాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం... తనపై దాడికి అభినయ్‌ ముగ్గురు వ్యక్తులను నియమించుకున్నారు. ఏ విధంగా? ఏ సమయంలో, ఎక్క డ దాడి చేయాలి? అనే సమాచారాన్ని, సూచనలను వాట్సాప్‌ వాయిస్‌ మెసేజ్‌లో వారికి పంపించారు. దాడి సమయంలో కారులో అభినయ్‌తోపాటు ముగ్గు రు అనుచరులు ఉన్నారు. దాడి ఘటనను వీరే మొబైల్‌లో చిత్రీకరించారు. ఆ దృశ్యాలను ఇన్‌స్టాతోపాటు సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్ట్‌ చేశారు. దీనికి సంబంధించిన వాయిస్‌ మెసేజ్‌లతోపాటు అన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు. క్రైస్తవులు, గిరిజను ల నుంచి సానుభూతి పొందేందుకే అభినయ్‌ ప్రణాళికతో దాడి చేయించుకున్నట్టు నిర్ధారించారు. అభినయ్‌తోపాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు.

Updated Date - May 20 , 2026 | 04:20 AM