Share News

భూమంతర్‌కాళీ

ABN , Publish Date - Jul 13 , 2026 | 03:23 AM

మధురవాడ.. విశాఖలో భూముల ధరలు ఆకాశాన్నంటిన ప్రాంతం. ఇక్కడ ఎకరం కనీసం రూ.20-30 కోట్ల పైమాటే. గజాల లెక్కన కొనాలన్నా అంత ఆషామాషీ విషయం కాదు. ఇంతటి ఖరీదైన ప్రాంతంలోని..

భూమంతర్‌కాళీ

  • భూమే లేదు.. వెబ్‌ల్యాండ్‌లో ఎంట్రీ

  • విశాఖలో సరికొత్త భూ బాగోతం

  • 130 కోట్ల సర్కారు భూమిపై కన్నేసిన పెద్దలు

  • వైసీపీ నేతకు టీడీపీ నాయకుడి అండ

  • 2024 ఎన్నికలకు ముందు నమోదు

  • 2019 నుంచే రికార్డు ఉన్నట్టు డేటా ట్యాంపరింగ్‌

  • కూటమి సర్కారు రాగానే ఫిర్యాదులు

  • అది ప్రభుత్వ భూమేనని తహశీల్దార్‌ నివేదిక

  • చర్యలపై నేటికీ ఉన్నతాధికారుల మీనమేషాలు

  • భూమిపై పొజిషన్‌ కోసం ప్రయత్నాలు

భూ కుంభకోణాలలో ఇదో సరికొత్త దందా. సాధారణంగా భూముల రికార్డులు తారుమారు చేసి వాటిపై హక్కుల కోసం అడ్డదారులు తొక్కుతుంటారు. కానీ అసలు ప్రైవేటు భూమే లేకపోయినా, వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో ఉన్నట్టుగా సృష్టించారు. మొత్తం ప్రభుత్వ భూమి ఉన్న సర్వే నంబర్‌లో తమ భూమిని(లేని) గుర్తించి ఇవ్వాలని సరికొత్త దందా మొదలుపెట్టారు. విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన మధురవాడలో దాదాపు 130 కోట్ల రూపాయల విలువైన భూమిపై కన్నేశారు. టీడీపీ నాయకుడి అండతో గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ నేత చేస్తున్న నిర్వాకమిది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే మొదలైన ఈ భూ దోపిడీ స్కెచ్‌ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ భూదందాకు కొందరు ఉన్నతాధికారులు కూడా తెరవెనుక అండగా ఉన్నారు. దీంతో రెండేళ్లుగా ఈ భూమి విషయంలో దాగుడు మూతల దండాకోర్‌ పంచాయితీ నడుస్తోంది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మధురవాడ.. విశాఖలో భూముల ధరలు ఆకాశాన్నంటిన ప్రాంతం. ఇక్కడ ఎకరం కనీసం రూ.20-30 కోట్ల పైమాటే. గజాల లెక్కన కొనాలన్నా అంత ఆషామాషీ విషయం కాదు. ఇంతటి ఖరీదైన ప్రాంతంలోని భూమిపై గోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ నేత ఒకరు కన్నేశారు. ఇందుకు ఓ టీడీపీ నేత, మాజీ మంత్రి తెరవెనక వంతపాడారు. మధురవాడలోని సర్వే నంబర్‌ 296లోని భూమి కొట్టేసేందుకు ప్లాన్‌ వేశారు. రెవెన్యూ అధికారిక నివేదిక ప్రకారం 296లో 13 సబ్‌ డివిజన్ల కింద మొత్తం 50.40 ఎకరాల భూమి ఉంది. ఇదంతా ప్రభుత్వ భూమి. ఇందులో నుంచి కాలక్రమేణా రాజకీయ బాధితులు ముగ్గురికి కొంత భూమిని ప్రభుత్వం అసైన్‌ చేసింది.


మరికొంత భూమిని వుడాకు ఇచ్చింది. మిగిలిన భూమి ప్రభుత్వ నియంత్రణలోనే ఉంది. ఇదంతా 2024 ఎన్నికలకు ముందున్న రెవెన్యూ రికార్డులలో ఉంది. అయితే ఎన్నికల సమయంలో గోదావరి జిల్లాలకు చెందిన ఓ వైసీపీ నేత, స్థానిక టీడీపీ నేత సహకారంతో రెవెన్యూ అధికారులను మాయచేసి వెబ్‌ల్యాండ్‌లో 296 సర్వే నంబర్‌ కింద కొత్త సబ్‌ డివిజన్‌ సృష్టించారు. ఓ ప్రైవేటు వ్యక్తికి వారసత్వంగా 5.33 ఎకరాల భూమి వచ్చినట్లుగా రికార్డు నమోదు చేశారు. 2024లో ఎన్నికల నోటి ఫికేషన్‌ రావడానికి కొద్దిరోజుల ముందు ఈ తతంగం జరిగింది. ఆ తర్వాత నాటి అధికారులను ఉపయోగించుకొని ఆ ఎంట్రీని వెబ్‌ల్యాండ్‌లో 2019లోనే చేసినట్లుగా గణాంకాలు చూపేలా మరో మాయ చేశారు. అంటే.. ఈ రికార్డు 2019 నుంచే ఉందని చెప్పేందుకు సాంకేతికంగా కూడా వెబ్‌ల్యాండ్‌లోని డేటాను ట్యాంపర్‌ చేశారు. కూటమి సర్కారు వచ్చాక 2024 జూలై నాటికి ఈ భూమిపై పలు ఫిర్యాదులు వచ్చాయి. మధురవాడలోని సర్వే నం.296-14లో ఉన్న భూమి ప్రైవేటుదా? ప్రభుత్వానిదా? సర్వే నంబర్‌లోని మొత్తం భూమి ప్రభుత్వానిది అయితే ప్రైవేటు భూమి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఏం జరిగిందో తేల్చాలని ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై నాటి విశాఖ కలెక్టర్‌ భీమిలి తహశీల్దార్‌ నుంచి నివేదిక కోరారు. ఆయన విచారణ జరిపి 2024 జూలై 25న నివేదిక ఇచ్చారు. 296 సర్వే నంబర్‌లో 50.40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని పేర్కొన్నారు.


ఇదీ తహశీల్దార్‌ నివేదిక

‘మధురవాడలోని సర్వే నంబర్‌ 296లోని భూమి క్లాసిఫికేషన్‌ గయాళు అంటే.. ప్రభుత్వ భూమి. ఇందులో 296-1 నుంచి 296-13 వరకే సబ్‌ డివిజన్లు ఉన్నాయి. ముగ్గురు రాజకీయ బాధితులకు ఈ సర్వేలోని భూమిని సబ్‌ డివిజన్‌ చేసి కేటాయించాం. 296-3లో 5 ఎకరాలు ఒకరికి, 296-4లో 7.82 ఎకరాలు మరొకరికి అసైన్‌ చేశారు. 296-7బీలో 3.59 ఎకరాలు మరో రాజకీయ బాధితుడికి అసైన్‌ చేశారు. మిగతా భూమి ప్రభుత్వ నియంత్రణలోనే ఉంది. కొత్తగా సృష్టించిన 14వ సబ్‌డివిజన్‌ ఫేక్‌. దాన్ని వెబ్‌ల్యాండ్‌లోనే సృష్టించారు. ఎఫ్‌ఎమ్‌బీ, ఇతర రెవెన్యూ ఫిజికల్‌ రికార్డుల్లో 14వ సబ్‌డివిజన్‌ ఏర్పాటు ప్రస్తావనే లేదు. మండల సర్వేయర్‌ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. 14వ సబ్‌ డివిజన్‌ కింద 5.33 ఎకరాల ప్రైవేటు భూమి అన్నదే లేదు. దాన్ని ఫేక్‌, ఫోర్జరీ ఎంట్రీగా గుర్తించి చర్యలు తీసుకోవాలి. వెబ్‌ల్యాండ్‌లో ఆ భూమిని ఎంట్రీ చేసిన తర్వాత డిజిటల్‌ సంతకం కోసం తహశీల్దార్‌ వద్దకు ఫైలు కూడా రాలేదు. సర్వే నం.296-14 ఎంట్రీని వెబ్‌ల్యాండ్‌ నుంచి తొలగించండి. ఈ సబ్‌ డివిజన్‌పై ఎలాంటి లావాదేవీలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించండి’ అని కలెక్టర్‌కు పంపించిన నివేదికలో తహశీల్దార్‌ పేర్కొన్నారు. ఈ భూమి విషయంపై భీమిలి తహశీల్దార్‌ కలెక్టర్‌కు నివేదించి రెండేళ్లు పూర్తయింది. దీనిపై కలెక్టర్‌ సమగ్ర విచారణ జరిపించి వెబ్‌ల్యాండ్‌లో తప్పుడు ఎంట్రీలు ఎవరు నమోదుచేశారో తేల్చాలి. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ రెండేళ్లయినా చర్యలు లేవు. వెబ్‌ల్యాండ్‌లోని ఎంట్రీని చూపి ఫిజికల్‌గా భూమిపై పొజిషన్‌ కోరేదాకా పరిస్థితి వచ్చింది. అది ఫేక్‌ ఎంట్రీ అని, దానిపై తక్షణ చర్యలు తీసుకోవాలని రెండేళ్ల క్రితమే తహశీల్దార్‌ కోరినా ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? స్పందించకపోవడానికి ఉన్నతాధికారులకు ఉన్న ఇబ్బందేమిటి? 130 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని చెరపట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని ఉన్నతాధికారులు ఎందుకు సీరియ్‌సగా తీసుకోవడం లేదు? నేతల ఒత్తిళ్లే చర్యలకు మెకాలొడ్డుతున్నాయా? ఎవ రికో మేలు చేసేందుకే చర్యలు తీసుకోవడం లేదా? ఇప్పటికీ వెబ్‌ల్యాండ్‌లో తప్పుడు ఎంట్రీలే కనిపిస్తుండటం అనేక సందేహాలకు తావిస్తోంది.

Updated Date - Jul 13 , 2026 | 03:27 AM