Share News

చిన్నారిపై వీధి కుక్కల దాడి

ABN , Publish Date - May 16 , 2026 | 04:11 AM

విశాఖపట్నం మహానగరంలోని పార్కులో ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు సామూహిక దాడి చేశాయి.

చిన్నారిపై వీధి కుక్కల దాడి

  • ఆడుకుంటుండగా పదుల సంఖ్యలో మీద పడి..

  • చెవి కొరికేసి, ఒళ్లంతా గాయపరిచి.. విశాఖలో దారుణం

కూర్మన్నపాలెం (విశాఖపట్నం), మే 15(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం మహానగరంలోని పార్కులో ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు సామూహిక దాడి చేశాయి. ఒళ్లంతా గాయపరచి, చెవిని కొరికేశాయి. వాటి దాడిని తట్టుకోలేక పిల్లాడు ఏడుస్తూ.. పెడబొబ్బలు పెడుతుండటంతో స్థానికులు వచ్చి రక్షించారు. జీవీఎంసీ 86వ వార్డులోని వుడా ఫేజ్‌-2లో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న జాయూస్‌.. వుడా ఫేజ్‌-2లో ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి జీవిస్తున్నారు. ఆమె శుక్రవారం విధులకు వెళ్లగా.. కుమార్తెలు, కుమారుడు ఇంట్లో ఉన్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో అక్కలు ఇద్దరూ నిద్రిస్తుండగా, మోక్షరాజు (4) ఇంటి సమీపంలోని పార్కులో ఆడుకునేందుకు వెళ్లాడు. అక్కడే ఉన్న వీధికుక్కలు కొద్దిసేపటికి ఒక్కసారిగా బాలుడిపై దాడి చేశాయి. బాలుడిని తీవ్రంగా గాయపరిచి, చెవిని కొరికేశాయి. బాలుడు పెద్దగా ఏడుస్తుండడంతో స్థానికులు వచ్చి రక్షించి, తల్లికి సమాచారం ఇచ్చారు. ఆమె హుటాహుటిన వచ్చి ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు నల్లూరు సూర్యనారాయణ, వేగుంట శ్రీనివాస్‌ ఆస్పత్రికి చేరుకుని చిన్నారి తల్లికి ధైర్యం చెప్పారు.

Updated Date - May 16 , 2026 | 04:17 AM