హోంగార్డులకు ఆరోగ్య బీమా: మంత్రి అనిత
ABN , Publish Date - May 23 , 2026 | 06:38 AM
హోంగార్డులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా విశాఖనగరంలో సమగ్ర ఆరోగ్య బీమా వర్తింపజేస్తున్నట్టు హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.
విశాఖలో పనిచేస్తున్న వారికి వర్తింపు.. మొదటి ప్రీమియం చెల్లింపు
మహారాణిపేట(విశాఖపట్నం), మే 22(ఆంధ్రజ్యోతి): హోంగార్డులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా విశాఖనగరంలో సమగ్ర ఆరోగ్య బీమా వర్తింపజేస్తున్నట్టు హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. శుక్రవారం విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘హోం గార్డుల తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు వైద్య ఖర్చులకు వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో విశాఖ నగర పోలీస్ విభాగం ప్రత్యేకంగా ఆరోగ్య బీమాను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రతి హోంగార్డు కుటుంబానికి రూ.3 లక్షల బేస్ పాలసీతో రూ.30 లక్షల టాప్‌అప్ కవరేజీ, అదనంగా రూ.3 లక్షల కాంప్లిమెంటరీ కవరేజీ అందుతుంది. ఈ పఽథకంలో భర్త, భార్య, ఇద్దరు పిల్లలకు బీమా వర్తిస్తుంది. ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి రూ.10,264 ప్రీమియం ఉండగా మొదటి సంవత్సరం ప్రీమియం పోలీస్ సంక్షేమ నిధి నుంచి చెల్లిస్తున్నాం. నగరంలోని 975 మంది హోంగార్డుల కుటుంబాల్లోని సుమారు 3,144 మంది బీమా ప్రయోజనం పొందనున్నారు. ఇందుకోసం పోలీస్ సంక్షేమ నిధి నుంచి రూ.87.98 లక్షలు వెచ్చించాం’ అని అనిత తెలిపారు. ఆరోగ్య బీమా పాలసీ పత్రాను హోంమంత్రి హోం గార్డులకు అందజేశారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దివీస్ వితరణ: ‘దివీస్’ సంస్థ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా విశాఖ నగర పోలీస్ విభాగానికి ఎమర్జన్సీ హ్యాండ్లింగ్ నిమిత్తం రూ.19.92 లక్షల విలువైన రెండు ఎల్‌ఎంవీ వాహనాలు అందజేసింది. వాటిని శుక్రవారం హోంమంత్రి అనిత నగర పోలీసుశాఖకు అప్పగించారు.