డిజిటల్ ప్రయాణంలో కొత్త అధ్యాయం
ABN , Publish Date - Apr 29 , 2026 | 07:32 AM
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి పడిన పునాది... భారతదేశ డిజిటల్ ప్రయాణంలో నూతన అధ్యాయానికి నాందిగా రాష్ట్ర ఐటీ మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
గూగుల్ ఏఐ హబ్‌తో విశాఖ మున్ముందుకు..
హైదరాబాద్ 30 ఏళ్లలో సాధించిన అభివృద్ధిని, విశాఖలో పదేళ్లలో సాధించాలని లక్ష్యం
‘భారత్ ఏఐ శక్తి’ సదస్సులో ఐటీ మంత్రి లోకేశ్
ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టాలని పిలుపు
విశాఖపట్నం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి పడిన పునాది... భారతదేశ డిజిటల్ ప్రయాణంలో నూతన అధ్యాయానికి నాందిగా రాష్ట్ర ఐటీ మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ‘భారతదేశ ఏఐ కారిడార్‌ను ఉమ్మడిగా నిర్మించడం’ అనే అంశంపై గూగుల్ ఆఽధ్వర్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక నోవాటెల్ హోటల్‌లో ‘భారత్ ఏఐ శక్తి’ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి లోకేశ్ హాజరై మాట్లాడుతూ.. గూగుల్ ఏర్పాటు రాష్ట్రానికి కీలక మలుపుగా అభివర్ణించారు. విశాఖ సాధారణ నగరం కాదని, దశాబ్దాలుగా దేశానికి ఒక గేట్‌వేలా పనిచేస్తోందన్నారు. దేశ ఖనిజ సంపదను ప్రపంచానికి అనుసంధానిస్తోందన్నారు. మన దేశ భవిష్యత్తును విశాఖ నిర్మిస్తుందని బలంగా విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రపంచం భారీ పరిశ్రమల నుంచి డిజిటల్ మౌలిక సదుపాయాల వైపు, తయారీ నుంచి మెషీన్ ఇంటిలిజెన్స్ వైపు మారుతోందని, ఈ ప్రయాణంలో వైజాగ్ మరింత అభివృద్ధి చెందనుందన్నారు. గూగుల్ ఏఐ హబ్ ప్రారంభంతో ఈ మార్పును ప్రత్యక్షంగా చూస్తామన్నారు. ఇటీవలే ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ప్లాంటుకు శంకుస్థాపన చేశాయని, ఏఐ, డేటా, ఫార్మా, వైద్య పరికరాల రంగాల్లో భారీ అభివృద్ధి జరుగుతోందన్నారు. హైదరాబాద్ 30 ఏళ్లలో సాధించిన అభివృద్ధిని, విశాఖలో వచ్చే పదేళ్లలోనే సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
పారిశ్రామికవేత్తలతో లోకేశ్ భేటీ
పలువురు పారిశ్రామికవేత్తలతో లోకేశ్ విడిగా సమావేశమయ్యారు. డెల్టా ఎలకా్ట్రనిక్స్ ఇండియా ప్రెసిడెంట్ బెంజిమన్ లిన్‌తో సమావేశం సందర్భంగా.. ఇన్నోవేషన్, రిసెర్చ్, డెవలప్‌మెంట్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో డేటా సెంటర్ ఆపరేటర్లకు తగిన సేవలందించాలని సూచించారు. ఆ తర్వాత క్యారియర్ ఎండీ సుందర నారాయణన్‌తో భేటీ అయ్యారు. ఐటీ, లాజిస్టిక్ రంగాల్లో ఉపయోగపడేలా విశాఖలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఏపీని ఓ స్టార్టప్‌గా చూడండి!
ఏపీ కొత్త రాష్ట్రమని, అభివృద్ధి విషయంలో చాలా కసితో ఉన్నామని లోకేశ్ అన్నారు. తమను ఒక స్టార్టప్‌గా చూడాలని కోరారు. చరిత్రలో 4సార్లు రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సి వచ్చిందన్నారు. ఏపీలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో గూగుల్ క్లౌడ్, గూగుల్ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉపాధ్యక్షుడు బికాష్ కోలేతోపాటు 49 మంది కంపెనీ ప్రతినిధులు, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.