విశాఖకు మరో 3 డేటా సెంటర్లు
ABN , Publish Date - Aug 23 , 2026 | 04:28 AM
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు డేటా సెంటర్ల పరంపర కొనసాగుతోంది. మరో మూడు డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా
58 వేల కోట్లతో డేటా సెంటర్ హోల్డింగ్స్, 31 వేల కోట్లతో ఏఎం ఏఐ డేటా సెంటర్లు
అనకాపల్లి జిల్లాలో ‘రెన్యూ’కు గ్రీన్ సిగ్నల్
తిరుపతిలో లిథియం బ్యాటరీ, కడపలో సీసీ కెమెరా ఉత్పత్తి సంస్థలు
11 వేల మందికి ఉద్యోగ అవకాశాలు
ఉత్తర్వులు జారీ చేసిన ఐటీ శాఖ
అమరావతి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు డేటా సెంటర్ల పరంపర కొనసాగుతోంది. మరో మూడు డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విశాఖ రూరల్, ఆనందపురం మండలం జగన్నాథపురం గ్రామంలో రూ. 58,743 కోట్లతో 486 మెగావాట్ల సామర్థ్యం ఉన్న డేటా సెంటర్‌ను స్థాపిస్తామంటూ డేటా సెంటర్ హోల్డింగ్స్ ఇండియా ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ, రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి, రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించాయి. ఈ మేరకు ఆ డేటా సెంటర్‌తో పాటు మరో రెండు సంస్థల డేటా సెంటర్లకు కూడా అనుమతి తెలుపుతూ శనివారం ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డేటా సెంటర్లకు ప్రభుత్వ పాలసీ మేరకు ప్రోత్సాహకాలను అమలు చేస్తారు. డేటా సెంటర్ హోల్డింగ్స్ డేటా సెంటర్ ఏర్పాటుతో 1,250 మందికి ఉద్యోగాలు దక్కుతాయి. ఈ సంస్థకు 200 ఎకరాలను మార్కెట్ ధరపై 25 శాతం డిస్కౌంట్‌తో ఇస్తారు. ఇక భీమునిపట్నం మండలం అమనాం గ్రామంలో రూ. 31,387 కోట్లతో 512 మెగావాట్ల సామర్థ్యంతో ఏఎం ఏఐ ఫ్యాక్టరీ (వైజాగ్) ప్రైవేటు లిమిటెడ్ సమీకృత ఏఐ డేటా సెంటర్‌ను స్థాపిస్తోంది. ఈ డేటా సెంటర్‌లో 1,000 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయని వెల్లడించారు.
అనకాపల్లి జిల్లాలో రెన్యూకు 433 ఎకరాలు
అనకాపల్లి జిల్లా మాకవానిపాలెంలో రూ. 85,200 కోట్లతో 1000 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన రెన్యూ ఏపీ గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ స్థాపనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డేటా సెంటర్ పాలసీ ప్రకారం రెన్యూ సంస్థకు మాకవారిపాలెంలో 433.30 ఎకరాలను కేటాయించారు. ఈ సంస్థలో 1,880 మందికి ఉద్యోగాలు దక్కుతాయి. ప్రభుత్వ పాలసీ ప్రకారం రాయితీలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. కాగా, చైనాకు పోటీగా సీసీ కెమెరాలను ఉత్పత్తి చేస్తామంటూ మన దేశానికి చెందిన ఏఐఎల్ డిక్సన్ సంస్థ ముందుకొచ్చింది. కడప జిల్లాలో రూ. 450 కోట్లతో స్థాపించే ఈసంస్థలో 7,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఏఐఎల్ డిక్సన్ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక తిరుపతిలో రూ. 500 కోట్లతో 240 మందికి ఉద్యోగాలను కల్పించే మునోథ్ లిథియం బ్యాటరీ తయారీ సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదించింది.