రెండెకరాలు.. ఆరు పిటిషన్లు అదే నేత భూమేత!
ABN , Publish Date - Jul 05 , 2026 | 04:06 AM
అదే నాయకుడు... అదే ఎండాడ... అక్కడే మరో భూమికి స్కెచ్! ఈసారి రెండెకరాలు! విలువ రూ.20 కోట్లు! భూములు బంగారంగా మారిన విశాఖలో..
విశాఖ ఎండాడలో మరో మాయ
ప్రభుత్వ భూమిలో పాగాకు యత్నం
ఆరు పిటిషన్లలో రెండింటికి ఆమోదం
రైత్వారీ పట్టా చేసేందుకు రంగం సిద్ధం
రెవెన్యూ, సర్వే అధికారుల సహకారం
ఆ ఇలాకాలో ఆ నేత చెప్పినట్లే సర్వేలు
రిజిస్ట్రేషన్లూ ఆయన కనుసన్నల్లోనే
కాదంటే బదిలీ వేటు తప్పదు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
అదే నాయకుడు... అదే ఎండాడ... అక్కడే మరో భూమికి స్కెచ్! ఈసారి రెండెకరాలు! విలువ రూ.20 కోట్లు! భూములు బంగారంగా మారిన విశాఖలో ఒక మాజీ మంత్రి రూ.600 కోట్ల విలువైన 30 ఎకరాలకు టెండర్ పెట్టడం... ఉన్నతస్థాయి యంత్రాంగం పరిశీలన, కలెక్టర్ పరిశోధనతో విషయం ఆగిపోవడం గురించి శనివారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. ఇప్పుడు... అదే నాయకుడు తెరవెనుక ఉండి నడిపిస్తున్న మరో భూమాయ బయటపడింది. ఎండాడలోని ఒక సర్వే నంబర్‌లో పదెకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో రెండెకరాలను ప్రైవేటుదిగా చూపించి రికార్డులు మార్చేందుకు సదరు నేత సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం మూడు నెలల వ్యవధిలో ఆరు సర్వే పిటిషన్‌లు పెట్టించారు. ఆ సర్వే నంబర్‌లో ఉన్న భూమిని సబ్ డివిజన్ చేసి, రెండెకరాలను జిరాయితీ (ప్రైవేటుది)గా నమోదు చేయించాలని మాస్టర్‌ప్లాన్ వేశారు. ఇద్దరు కీలక అధికారులకు ఈ టాస్క్ అప్పగించారు. రీ సర్వేను ‘సానుకూలం’గా మార్చుకుని... రికార్డులు తారుమారుచేసి ఆ రెండెకరాలకు హక్కుదారులను పుట్టించే బాధ్యతను ఆ ఇద్దరు అధికారులు భుజానవేసుకున్నారు.
ఇందుకు రెవెన్యూ ఆర్కైవ్స్‌లో ఉన్న ఒక రికార్డును ఆధారంగా చూపాలని ప్లాన్‌వేశారు. దీనికి అనుగుణంగా ఒక ఫేక్ డాక్యుమెంట్‌ను సృష్టించి, అది రైత్వారీ పట్టాగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఆ భూమిపై రీ సర్వేను పూర్తిచేసి, పదెకరాలున్న ప్రభుత్వ భూమిని 8 ఎకరాలకు పరిమితం చేసి... మిగిలిన రెండెకరాలను ప్రైవేటుకు కట్టబెట్టడమే వీరి లక్ష్యం. ఇందులో భాగంగా ఇప్పటికే దాఖలైన ఆరు పిటిషన్లలో రెండింటిని ఒక కీలక అధికారి ఎండార్స్ చేసినట్లు తెలిసింది. రెండెకరాలను ఆ నేత సూచించిన వ్యక్తి/వ్యక్తుల పేరిట రైత్వారీగా నమోదు చేయించేందుకు ఇద్దరు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిసింది. ఇందులో ఓ కీలక సర్వే అధికారి పాత్ర కీలకం! ఆ నేత సిఫారసుతోనే ఆయనకు అక్కడ పోస్టింగ్ దక్కింది.
అంతులేని భూదాహం... విశాఖ జిల్లాకు చెందిన ఆ నాయకుడి భూ దాహం అంతులేనిది. విలువైన ప్రభుత్వ భూమి కనిపిస్తే వాలిపోవడం, ఎలాగైనా దాన్ని చేజిక్కించుకోవడం ఆయనకు బాగా తెలిసిన పనిగా సన్నిహితులు చెబుతుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అడవివరంలోనే ఇనామ్ భూమి 108 ఎకరాలను చెరపట్టాలని సకల ప్రయత్నాలు చేశారు. ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో ఆ స్వాహాపర్వం నిలిచిపోయింది. ఆ కేసులో ఇరుక్కున్న అనేక మంది అధికారులు ఇప్పటికీ పూర్తి పెన్షను తీసుకోలేకపోతున్నారు. ఆ తర్వాతి కాలంలో విశాఖలోనే మధురవాడ, ఆనందపురం, భీమిలి, సీతమ్మధార, ఎండాడ ప్రాంతాల్లోని విలువైన భూములపై ఆ నాయకుడు కన్నేశారు. మాజీ సైనికుల భూములను భారీగా సెటిల్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రమంతా భూముల రీ సర్వే జరుగుతోంది. భూముల కొలతలు వేశాక రికార్డులను తాజాపరిచే కార్యక్రమం ఉంటుంది. రెవెన్యూ, సర్వేశాఖలు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నాయి. కానీ... భీమిలి, ఆనందపురం, విశాఖ రూరల్, ఎండాడ, సీతమ్మధార తదితర ప్రాంతాల్లోని భూముల సర్వే మాత్రం ఆ నేత కనుసన్నల్లోనే సాగుతున్నట్లు తెలుస్తోంది. గ్రామం, మండలం వారీగా ఆయన సూచించిన వారే సర్వేయర్లుగా ఉన్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆ నేత మాట వినని అధికారిని వెంటనే మరో ప్రాంతానికి బదిలీ చేయిస్తుంటారు. భూముల క్రయ, విక్రయాలు, రిజిస్ట్రేషన్లనూ ఆయనే శాసిస్తున్నట్లు సమాచారం. ఆయన చెబితేనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ‘కాదు’ అంటే ఆగుతుంది. ఆయనకు తెలియకుండా ఏదైనా భూమి రిజిస్ట్రేషన్ జరిగిందంటే అగ్గిరాజేస్తారని, సబ్ రిజిస్ట్రార్‌లను బదిలీ చేయించేదాకా వదిలిపెట్టరని అధికారవర్గాలు చెబుతున్నాయి.