Visakhapatnam: జీసీసీ హబ్‌గా విశాఖ
ABN , Publish Date - Jan 18 , 2026 | 05:48 AM
విశాఖపట్నాన్ని గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ) హబ్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సాకారమవుతోంది. జపాన్‌కు చెందిన అతిపెద్ద ఫార్మా కంపెనీ ‘ఇసాయ్’ విశాఖలో తొలి జీసీసీని మార్చిలో ప్రారంభించనుంది.
మార్చి నుంచి ‘ఇసాయ్ ఫార్మా’ కార్యకలాపాలు!
అదే లైన్‌లో ఎన్‌టీటీ, లూలులెమన్
రుషికొండ ఐటీ పార్కులోని హిల్-2పై ‘ఇన్‌స్పైర్‌ఎడ్జ్’ భవనాన్ని లీజుకు తీసుకున్న సంస్థలు
ఆ తర్వాత క్యూలో ఏఎన్‌ఎస్‌ఆర్, రహేజా
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నాన్ని గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ) హబ్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సాకారమవుతోంది. జపాన్‌కు చెందిన అతిపెద్ద ఫార్మా కంపెనీ ‘ఇసాయ్’ విశాఖలో తొలి జీసీసీని మార్చిలో ప్రారంభించనుంది. ఈ సంస్థ ఇప్పటికే విశాఖకు 35 కిలోమీటర్ల దూరంలోని పరవాడ రాంకీ ఫార్మా సిటీలో 2009 నుంచి మందులు తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జీసీసీ పాలసీ ప్రకటించగానే తామూ సంస్థ ఏర్పాటు చేస్తామని ముందుకువచ్చింది. అది మార్చిలో ప్రారంభం కానుందని ఐటీ వర్గాలు తెలిపాయి. దీని తర్వాత జపాన్‌కే చెందిన నిప్పన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ కార్పొరేషన్ (ఎన్‌టీటీ) కూడా విశాఖలో జీసీసీని ప్రారంభించనుంది. మొబైల్, ఇంటర్నెట్, ఐటీ, కన్సల్టెన్సీ, ఏఐ, ఫొటోనిక్స్ రంగాల్లో ఈ సంస్థ 190 దేశాలకు సేవలు అందిస్తోంది. 70 దేశాల్లో కార్యాలయాలున్నాయి.
రుషికొండ ఐటీ పార్కు హిల్-2 పైన ఉన్న ‘ఇన్‌స్పైర్‌ఎడ్జ్’ భవనంలో కొంత భాగాన్ని లీజుకు తీసుకుంది. ప్రాథమిక ఒప్పందాలన్నీ పూర్తయినట్టు సమాచారం. మరోవైపు ఇదే భవనంలోనే లూలులెమన్ కంపెనీ ఒక జీసీసీని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సంస్థ దుస్తులు, ఫుట్‌వేర్‌ను తయారు చేస్తోంది. భారత్‌లో టాటా క్లిక్‌తో కలిసి పనిచేయాలని ప్రయత్నిస్తోంది. ముందుగానే జీసీసీ కోసం విశాఖలో భవనాన్ని ఎంపిక చేసుకుంది. ఆ తర్వాత ఏఎన్‌ఎస్‌ఆర్, రహేజా వంటి సంస్థలు కూడా జీసీసీలను ఏర్పాటు చేయనున్నాయి. రాబోయే మూడేళ్లలో మొత్తం 200 జీసీసీలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. జపాన్‌కు చెందిన రెండూ జీసీసీలు మార్చిలోనే ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు. ఇవి కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో పేరొందిన ఆర్‌ఎంజెడ్ కార్పొరేషన్ విశాఖలో పెద్ద ఐటీ పార్క్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. భూమి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తోంది. ఐటీ రంగానికి అవసరమైన మౌలిక వసతులతో ఐటీ పార్క్ నిర్మిస్తామని ప్రతిపాదించింది.
ఆకర్షణీయమైన పాలసీలు
ప్రభుత్వం గతేడాదిలో ఐటీ రంగానికి సంబంధించి కొత్తగా 30 పాలసీలు ప్రకటించింది. అందులో జీసీసీలకూ ప్రత్యేకంగా ఒక పాలసీ ఉంది. బిలియన్ డాలర్ల టర్నోవర్ చేసే మల్టీ నేషనల్ కంపెనీలకు ఎకరా భూమిని 99పైసలకే అందిస్తోంది. మధ్యశ్రేణి కంపెనీలకు ఎకరా రూ.10 కోట్ల విలువ చేసే భూమిని రూ.4 కోట్లకే ఇస్తోంది. కొత్తగా స్టార్టప్‌లు ప్రారంభించే వారికి ప్లగ్ అండే ప్లేతో ఇంక్యుబేషన్ సెంటర్లు సమకూరుస్తోంది. మరికొన్ని కంపెనీలకు రెంటల్ సబ్సిడీ అందిస్తోంది. ఆ క్రమంలోనే గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకువచ్చింది. కాగ్నిజెంట్ 21 ఎకరాల్లో ఐటీ క్యాంపస్ నిర్మిస్తోంది. టీసీఎస్‌కు కూడా 20 ఎకరాలు కేటాయించారు. తాత్కాలికంగా కార్యకలాపాల నిర్వహణకు మిలీనియం టవర్లలో ఒకటి పూర్తిగా ఇచ్చారు. మరోవైపు క్యాప్‌జెమినీ విశాఖలో తన ఉద్యోగుల కోసం సొంత క్యాంపస్ నిర్మించాలని భావిస్తోంది. భూమి కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తోంది.