డేటా సెంటర్లతో ‘రియల్’ బూమ్
ABN , Publish Date - Aug 07 , 2026 | 04:42 AM
డేటా సెంటర్లకు గ్లోబల్ హబ్‌గా మారుతున్న నేపథ్యంలో మన దేశంలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటుందని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘స్క్వేర్ యార్డ్స్’ అంచనా వేసింది.
దేశంలో పట్టణీకరణ పెరిగి కొనుగోళ్లకు ఊతం
స్క్వేర్ యార్డ్స్ నివేదికలో వెల్లడి
విశాఖపట్నం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): డేటా సెంటర్లకు గ్లోబల్ హబ్‌గా మారుతున్న నేపథ్యంలో మన దేశంలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటుందని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘స్క్వేర్ యార్డ్స్’ అంచనా వేసింది. గత కొన్నేళ్లుగా దేశంలో రియల్ ఎస్టేట్ రంగం మందగమనంలో ఉన్నా.. ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో డేటా సెంటర్ల నిర్మాణానికి సన్నాహాలు జరుగుతుండడంతో ఆయా ప్రాంతాల్లో పట్టణీకరణ పెరిగి, మళ్లీ కొనుగోళ్లు ఊపందుకునే అవకాశం ఉందని తాజాగా విడుదల చేసిన నివేదికలో విశ్లేషించింది. విశాఖపట్నాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. దేశంలో అతి పెద్ద డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా రూపాంతరం చెందుతోందని చెప్పింది. ప్రస్తుతం విశాఖలో ఉన్న డేటా సెంటర్ల ఎకో సిస్టమ్ వల్ల కొత్తగా 51,800 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొంది. విశాఖలో ప్రతిపాదించిన డేటా సెంటర్ల వల్ల నేరుగా 3,240 మందికి ఉద్యోగాలు, అనుబంధ రంగాల ద్వారా 48,600 ఉద్యోగాలు వస్తాయని తెలిపింది. డేటా సెంటర్ల ఎకో సిస్టమ్‌తో వ్యాపార, సేవా రంగాలు కూడా వృద్ధి చెందుతాయని, పెట్టుబడులను ఆకర్షిస్తాయని వివరించింది. విద్యుత్, ఫైబర్ కనెక్టివిటీ, యుటిలిటీలు, లాజిస్టిక్స్, కమర్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో కొత్త పెట్టుబడులు వస్తాయని పేర్కొంది. వీటి ద్వారా విశాఖ రీజియన్‌లో కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఆర్థిక లావాదేవీలు పెరుగుతాయని వెల్లడించింది. ఈ అభివృద్ధి కారణంగా విశాఖపట్నం, పరిసర ప్రాంతాల్లో 2.33 కోట్ల చదరపు అడుగుల నివాసాలకు డిమాండ్ ఏర్పడుతుందని స్క్వేర్ యార్డ్స్ పేర్కొంది. విశాఖపట్నానికి జనాభా రాక పెరిగి వాణిజ్య స్థలాలకు, గొడౌన్లకు, రిటైల్ సెంటర్లకు డిమాండ్ పెరుగుతుందని, మౌలిక వసతులు కూడా పెరుగుతాయని అంచనావేసింది. ఇక విశాఖపట్నంలో గూగుల్ రూ. 1.35 లక్షల కోట్లతో నిర్మిస్తున్న డేటా హబ్ 2028 నాటికి పనిచేయడం ప్రారంభిస్తుందని, ఒక గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ద్వారా రాష్ట్రానికి రూ. 10 వేల కోట్ల ఆదాయం వస్తుందని స్క్వేర్ యార్డ్స్ అంచనా వేసింది.