Share News

పరిశ్రమల కోటా నుంచే డేటా సెంటర్లకు నీరు

ABN , Publish Date - Aug 20 , 2026 | 03:24 AM

డేటా సెంటర్లపై కొందరు ఉద్దేశపూర్వకంగా అపోహలు సృష్టిస్తున్నారని ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ అన్నారు. నీటి భద్రతపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కోరారు.

పరిశ్రమల కోటా నుంచే డేటా సెంటర్లకు నీరు

  • తాగునీటిని మళ్లించే ప్రసక్తే లేదు

  • విశాఖలో డేటా సెంటర్లకు 3 టీఎంసీలు చాలు.. కొందరు కావాలనే అపోహలు సృష్టిస్తున్నారు

  • వాటిని ప్రజలు నమ్మవద్దు.. డేటా సెంటర్లకు 70శాతం గ్రీన్‌ ఎనర్జీ.. అసెంబ్లీలో మంత్రి లోకేశ్‌ వివరణ

అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): డేటా సెంటర్లపై కొందరు ఉద్దేశపూర్వకంగా అపోహలు సృష్టిస్తున్నారని ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ అన్నారు. నీటి భద్రతపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కోరారు. పరిశ్రమలకు కేటాయించిన నీటినే డేటా సెంటర్లకు ఇస్తామని, తాగునీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ మళ్లించబోమని భరోసా ఇచ్చారు. బుధవారం అసెంబ్లీలో డేటా సెంటర్లపై నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్‌ బదులిచ్చారు. తాము వస్తున్నామని గూగుల్‌ ప్రకటించిన తర్వాతనే ఐటీ సంస్థలు విశాఖవైపు వస్తున్నాయని చెప్పారు. గోదావరి నుంచి ఏటా 3 వేల టీఎంసీల నీరు బంగాళాఖాతంలోకి వృథాగా పోతోందని వివరించారు. ఆ నీటలో కొంత భాగాన్ని పోలవరం నుంచి గ్రావిటీద్వారా విశాఖకు తీసుకువస్తున్నామని చెప్పారు. ప్రస్తుత సాంకేతికత ప్రకారం 6.5 గిగావాట్ల డేటా సెంటర్లు విశాఖలో ఇన్‌స్టాల్‌ అయితే 3 టీఎంసీల నీరు మాత్రమే అవసరమవుతుందని వివరించారు. పోలవరం నుంచి వచ్చే నీరు ప్రత్యేకంగా విశాఖపట్నం నగర ప్రజల తాగు, సాగు, పరిశ్రమల అవసరాలకు కేటాయింపులు జరిగాయని తెలిపారు. పరిశ్రమలకు కేటాయించిన నీటి వాటా నుంచే డేటా సెంటర్లకు అవసరమైన నీరందిస్తామని స్పష్టం చేశారు. వచ్చే 18 నెలల్లో పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా విశాఖ ప్రజలకు తాగునీరు అందిస్తామని, డేటా సెంటర్లకు ప్రత్యేక పైపులైన్‌ ద్వారా నీరిస్తామని వెల్లడించారు. ప్రజల అవసరాలకు కేటాయించిన నీటిని మళ్లించే ప్రసక్తే లేదన్నారు. అలానే 1 గిగావాట్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకు ఉపయోగించే నీటి కంటే డేటా సెంటర్‌కు పది రెట్లు తక్కువ నీరు అవుతుందన్నారు. విశాఖలో ఇప్పుడు డేటా సెంటర్లపై విమర్శలు చేస్తున్న వారు ఏనాడు థర్మల్‌ ప్లాంట్ల గురించి మాట్లాడలేదన్నారు.


వన్‌ నేషన్‌ - వన్‌ గ్రిడ్‌తో..

వన్‌ నేషన్‌ - వన్‌ గ్రిడ్‌ వ్యవస్థ వల్ల రాయలసీమలో తయారుచేసే రెన్యువబుల్‌ ఎనర్జీ ఉత్తర భారత్‌కు కూడా పంపించే అవకాశం ఉందని లోకేశ్‌ అన్నారు. డేటా సెంటర్లకు కనీసం 70 శాతం గ్రీన్‌ ఎనర్జీ వాడాలని స్పష్టంగా చెప్పామన్నారు. సోలార్‌, విండ్‌, పంప్డ్‌స్టోరేజీ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌నే వాడతారని చెప్పారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మంత్రి గొట్టిపాటి సారథ్యంలో డిస్ట్రిబ్యూషన్‌ లైసెన్సు కూడా ఆ కంపెనీలకే ఇచ్చామన్నారు. డేటా సెంటర్ల వల్ల ఉద్యోగాలు వస్తాయా అనే చర్చ జరుగుతోందన్నారు. డేటా సెంటర్ల ఎకో సిస్టమ్‌ చాలా ముఖ్యమని అన్నారు. దీనికి ఎయిర్‌ కూలింగ్‌ సిస్టమ్‌ చాలా అవసరమన్నారు. ఎయిర్‌కూలింగ్‌ విభాగంలో కేరీర్‌, ఎల్జీ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అయ్యాయని చెప్పారు. కూలింగ్‌ ఎకోసిస్టమ్‌ వల్ల 20 వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించబోతున్నామని వెల్లడించారు. ఏఐ డేటా సెంటర్స్‌ వస్తున్నాయని, అడ్వాన్స్‌డ్‌ చిప్స్‌ కంపెనీలు రావాల్సి ఉందని చెప్పారు. గతంలో కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా అపోహలు సృష్టించారని, డేటా సెంటర్లపై వస్తున్న అపోహలు కూడా అలాంటివే అని వివరించారు.


ఏఐ ఎకో సిస్టం గేట్‌వేగా విశాఖ..

విశాఖపట్నం ఒక ఏఐ పట్నంగా మారబోతుందని కేంద్ర మంత్రి అశ్వినీవైష్టవ్‌ చెప్పిన విషయాన్ని లోకేశ్‌ గుర్తుచేశారు. విశాఖను గేట్‌వే ఆఫ్‌ ఇండియా ఏఐ ఏకో సిస్టమ్‌గా మార్చడమే తమ లక్ష్యమన్నారు. దీంతో పాటు అమెరికా యూనివర్సిటీ ఏఐ సంబంధిత సబ్జెక్ట్‌తో విశాఖ కేంద్రంగా ఓ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతోందని చెప్పారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటు కాబోయే డేటా సెంటర్ల ద్వారా ఇంత అభివృద్ధి జరుగుతుంటే కొంత మంది కావాలనే రాజకీయ లబ్ధి కోసం అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దొంగ వీడియోలు తీసుకొచ్చి ఏదో అయిపోతోందని చెప్పే మాటలు నమ్మవద్దని ప్రజల్ని కోరారు. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. తాను స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ సమీపంలోని పోలోవోల్డ్‌ డేటా సెంటర్‌ను స్వయంగా చూశానని, అక్కడ డేటా సెంటర్‌ ఉన్నట్లు కూడా తమకు తెలియదని చెప్పారు. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో డేటా సెంటర్‌ మన గడ్డపై ఉండాల్సిన అవసరం ఉందని లోకేశ్‌ స్పష్టం చేశారు.

విశాఖ ఎమ్మెల్యేలు డేటాసెంటర్ల గురించి తెలుసుకోవాలి: స్పీకర్‌

డేటా సెంటర్ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మంత్రి లోకేశ్‌ స్పష్టంగా వివరించడంతో సభలోని సభ్యులంతా అభినందనలు తెలిపారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కల్పించుకుని.. విశాఖపట్నం ఎమ్మెల్యేలంతా డేటా సెంటర్ల గురించి తెలుసుకోవాలని సూచించారు. డేటా సెంటర్‌ గురించి తెలుసుకుని జిల్లా ప్రజలందరికి వివరించాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు చెప్పారు. ఈ మొత్తం నోట్‌ను ఎమ్మెల్యేలకు పంపించాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణరాజు కోరారు. దానికి లోకేశ్‌ కూడా ఆంగీకరించారు.

Updated Date - Aug 20 , 2026 | 03:25 AM