Share News

‘రనౌట్‌’ వివాదం.. కత్తితో హత్య!

ABN , Publish Date - Apr 07 , 2026 | 05:39 AM

క్రికెట్‌ మ్యాచ్‌ ఆడుతుండగా.. రనౌట్‌ విషయంలో చోటుచేసుకున్న వివాదం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఆటకు ఎలాంటి సంబంధం లేదని వ్యక్తి.. ఓ ప్లేయర్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు.

‘రనౌట్‌’ వివాదం.. కత్తితో హత్య!

  • మాటు వేసి, ప్లాన్‌ ప్రకారం కత్తితో దాడి

  • యువకుడి మృతి, మరో ఇద్దరికి గాయాలు

  • విశాఖలో దారుణం.. పాత కక్షలతోనే హత్య!

విశాఖపట్నం, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): క్రికెట్‌ మ్యాచ్‌ ఆడుతుండగా.. రనౌట్‌ విషయంలో చోటుచేసుకున్న వివాదం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఆటకు ఎలాంటి సంబంధం లేదని వ్యక్తి.. ఓ ప్లేయర్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. విశాఖపట్నం నగర పరిధిలోని పెదగదిలి బీఆర్‌టీఎస్‌ రోడ్డు సమీపంలో ఆదివారం క్రికెట్‌ మ్యాచ్‌ ఆడుతుండగా బ్యాటింగ్‌ చేస్తున్న డోలా అజిత్‌కు, ప్రత్యర్థి జట్టు సభ్యులకు రనౌట్‌ విషయంలో వివాదం తలెత్తింది. మరో అంపైర్‌ చిరంజీవి ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో తిరిగి మ్యాచ్‌ కొనసాగించారు. ఇంతలో మ్యాచ్‌ చూస్తున్న గంటా కిశోర్‌ అనే వ్యక్తి కలుగజేసుకుని అజిత్‌కు అనుకూలంగా ఎలా నిర్ణయం తీసుకుంటావంటూ చిరంజీవితో వాగ్వాదానికి దిగాడు. అజిత్‌ వచ్చి.. ‘నీకేంటి సంబంధం’ అని కిశోర్‌ను ప్రశ్నించడంతో వివాదం జరిగింది. మిగిలిన వారంతా వచ్చి సర్దిచెప్పడంతో అప్పటికి సద్దుమణిగింది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం సాయంత్రం 6 గంటల సమయంలో అజిత్‌, చిరంజీవి, నాగు, మరికొందరు యువకులు పెదగదిలి జంక్షన్‌కు వెళ్లగా, అప్పటికే అక్కడ వేచిచూస్తున్న కిశోర్‌ మరోసారి గొడవపడ్డాడు. ఆ సమయంలో కత్తితో అజిత్‌ చాతీపై బలంగా పొడిచాడు. అజిత్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అడ్డుకునేందుకు యత్నించిన నాగుకు బలమైన గాయాలు కాగా, చిరంజీవికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ముగ్గురినీ సమీపంలోనే ఆస్పత్రికి తరలించగా, అజిత్‌ అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.


కనిపించగానే దాడి

అజిత్‌ హత్యకు కిశోర్‌తో ఉన్న పాతకక్షలే కారణంగా తెలుస్తోంది. అజిత్‌ నివాసం ఉంటున్న పెదగదిలి ప్రాంతంలోనే కిశోర్‌ నివాసం ఉండేవాడు. బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేసే కిశోర్‌.. విశాలాక్షినగర్‌ వెళ్లి ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ, ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల పోలమాంబ జాతర సందర్భంగా పెదగదిలి వచ్చినప్పుడు అజిత్‌తో గొడవపడ్డాడు. ఆ సమయంలో అజిత్‌ స్నేహితులు ఎక్కువ మంది ఉండడంతో కిశోర్‌ వెనక్కి తగ్గాడు. ఆదివారం అజిత్‌ క్రికెట్‌ ఆడుతున్న చోటుకు వెళ్లి గొడవపడ్డాడు. సాయంత్రం పథకం ప్రకారం అజిత్‌ కోసం పెదగదిలి జంక్షన్‌ వద్ద కాపు కాసి, కనిపించగానే దాడి చేశాడని పోలీసుల దర్యాప్తులో గుర్తించినట్టు తెలిసింది. కాగా, అజిత్‌ అంత్యక్రియలు సోమవారం పూర్తిచేశారు.

Updated Date - Apr 07 , 2026 | 05:40 AM