విశాఖలో నేవీ విన్యాసాలు
ABN , Publish Date - Feb 17 , 2026 | 04:16 AM
భారత నౌకాదళం విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)కు సోమవారం పూర్తిస్థాయిలో రిహార్సల్స్ నిర్వహించారు.
ఐఎఫ్‌ఆర్‌కు రెండు రోజుల ముందే పూర్తిస్థాయిలో ప్రాక్టీస్
విశాఖపట్నం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): భారత నౌకాదళం విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)కు సోమవారం పూర్తిస్థాయిలో రిహార్సల్స్ నిర్వహించారు. 18న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ముగిసిన తరువాత 19వ తేదీన రామకృష్టా బీచ్‌లో వైమానిక దళం ప్రదర్శించనున్న సాహస విన్యాసాలన్నీ ప్రాక్టీస్ చేశారు. ఆహూతుల ముందు నుంచి జాతీయ పతాకం, నౌకాదళం పతాకం రెపరెపలాడిస్తూ సాగిపోయే హెలికాప్టర్ల తరువాత.. ఒక దాని తరువాత ఒకటి దూసుకొచ్చే యుద్ధ విమానాల విన్యాసాలు కళ్లార్పాకుండా చేశాయి. డార్నియర్, మిగ్-29కే యుద్ధ విమానాలు, నిఘా విమానం పీ8ఐ, సీ కింగ్, కమోవ్ హెలికాప్టర్లు విభాగాల వారీగా వచ్చి కనువిందు చేశాయి, సముద్రంలో చేతక్ హెలికాప్టర్ల రెస్క్యూ ఆపరేషన్, తీరంపై శత్రుమూకలపై దాడి వంటి అంశాలన్నీ కళ్ల ముందు యుద్ధం జరుగుతున్నట్టుగా ప్రదర్శించారు. ఇవి ముగిసిన తరువాత ఆహ్వానిత దేశాల ప్రతినిధులంతా వారి వారి సంస్కృతీ సంప్రదాయాలతో కవాతు చేస్తూ బీచ్ రోడ్డులో ‘పరేడ్’ నిర్వహించారు. ఇవన్నీ 19వ తేదీ సాయంత్రం ప్రదర్శిస్తారు.