Share News

భారీగా పరిశ్రమలను ఆకర్షించాలి

ABN , Publish Date - Jun 30 , 2026 | 05:19 AM

రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మరోసారి పారిశ్రామిక పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. 2014-19 మధ్య కాలంలో ఏటా పెట్టుబడుల..

భారీగా పరిశ్రమలను ఆకర్షించాలి

  • నవంబరు 12, 13 తేదీల్లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు

  • పెట్టుబడులతో పాటు నాలెడ్జ్‌ షేరింగ్‌ కూడా ముఖ్యమే

  • వినూత్న ఆలోచనలు పంచుకునే వేదికగా నిర్వహించాలి

  • ముందుగా ఐదు చోట్ల సన్నాహక సదస్సులు

  • సెప్టెంబరు వరకూ దేశ విదేశాల్లో రోడ్‌షోలు చేపట్టాలి

  • సదస్సుకు విస్తృత ప్రచారం కల్పించాలి

  • అమరావతిలో సీఐఐ గ్లోబల్‌ లీడర్‌షిప్‌ సెంటర్‌

  • పెట్టుబడుల సదస్సు సన్నాహక భేటీలో సీఎం చంద్రబాబు

అమరావతి, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మరోసారి పారిశ్రామిక పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. 2014-19 మధ్య కాలంలో ఏటా పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులను క్రమం తప్పకుండా నిర్వహించిన సీఎం చంద్రబాబు.. ఆ ఒరవడిని కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది నవంబరు 12, 13 తేదీల్లో విశాఖలో 31వ సీఐఐ పారిశ్రామిక పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు నిర్వహించడానికి నిర్ణయించారు. వ్యాపారాలు, పెట్టుబడులు వంటి అంశాల మీదే కాకుండా వినూత్న ఆలోచనలనూ పంచుకునే వేదికలా సదస్సును నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సదస్సును ‘నావిగేటింగ్‌ చేంజ్‌: లీడర్‌షిప్‌, టెక్నాలజీ, ట్రస్ట్‌ అండ్‌ ట్రేడ్‌ ఇన్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ వరల్డ్‌’ ఇతివృత్తంతో నిర్వహిస్తారు. పెట్టుబడుల సదస్సు ద్వారా రాష్ట్రంలో భారీ పరిశ్రమలను నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని సీఎం నిర్ణయించారు. ఇందులో భాగంగా.. ఈ సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా అమరావతి, అనంతపురం, తిరుపతి, విశాఖ, రాజమండ్రి లేదా కాకినాడల్లో సన్నాహక ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో సోమవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. దీనికి సీఐఐ డెరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీతో పాటు మంత్రులు టీజీ భరత్‌, కొండపల్లి శ్రీనివాస్‌, నారాయణ, కందుల దుర్గేశ్‌, గొట్టిపాటి రవికుమార్‌ హాజరయ్యారు.


సీఐఐ గ్లోబల్‌ లీడర్‌షిప్‌ సెంటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నామని సీఎం ప్రకటించారు. రెండు రోజుల పాటు విశాఖలో నిర్వహించే భాగస్వామ్య సదస్సులో బిజినెస్‌ టు బిజినెస్‌ సమావేశాలు, ఎంఓయూలు, మినిస్టీరియల్‌ సెషన్స్‌, ప్లీనరీ సెషన్స్‌, కంట్రీ సెషన్స్‌, బిజినెస్‌ టు గవర్నమెంట్‌ వంటి కార్యక్రమాలతో కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల యాజమాన్యాలు, ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, పలుదేశాలకు చెందిన ప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. జూలై నుంచి సెప్టెంబరు వరకూ దేశవిదేశాల్లో రోడ్‌షోలను చేపట్టి సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ప్రచారం కల్పించాలన్నారు. ఢిల్లీ, బెంగళూర్‌, చెన్నై, ముంబై, కోయంబత్తూరు, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌లలో రోడ్‌షోలు నిర్వహించాలని స్పష్టం చేశారు. భాగస్వామ్య సదస్సులోని పబ్లిక్‌ పాలసీలపై విస్తృత స్థాయిలో చర్చ జరగాలని పేర్కొన్నారు. ప్రాంతీయ సదస్సుల్లోనూ ఎంఓయూలు కుదుర్చుకునేలా చూడాలన్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, ప్రకృతి వ్యవసాయం, సర్కులర్‌ ఎకానమీ, ఆధ్యాత్మికత, స్ట్రెస్‌ ఫ్రీ వర్క్‌ వంటి అంశాలపై సదస్సులో చర్చలు జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. ఎంత పెట్టుబడి వచ్చింది.. ఎన్ని ఎంఓయూలు జరిగాయన్నదానికంటే.. ఎంత వరకూ నాలెడ్జ్‌ షేరింగ్‌ జరిగిందన్నదే ముఖ్యమన్నారు. భాగస్వామ్య సదస్సులో జరిగే కార్యక్రమాలపై ప్రజల్లోనూ చర్చ జరిగేలా చూడాలన్నారు. ఫ్యూచరిస్టిక్‌ అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. సదస్సులో ప్రముఖ అంతర్జాతీయ వర్సిటీల నిపుణులు భాగస్వామ్య సదస్సునకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Updated Date - Jun 30 , 2026 | 05:21 AM