విశాఖ విమానాశ్రయానికి వీడ్కోలు
ABN , Publish Date - Aug 16 , 2026 | 05:27 AM
ప్రజలకు నాలుగున్నర దశాబ్దాలు సేవలు అందించిన విశాఖపట్నం విమానాశ్రయం సోమవారం నుంచి విశ్రమిస్తోంది. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన..
పౌరుల సేవలో నాలుగున్నర దశాబ్దాలు
నేటి అర్ధరాత్రి నుంచి రాకపోకలు బంద్
ఇక పూర్తిగా నేవీ ఆధ్వర్యంలోనే కార్యకలాపాలు
ప్రత్యేక విమానాలకు మాత్రమే అనుమతులు
చిన్న రన్ వే, ఒక్క విమానంతో మొదలై
అంతర్జాతీయ సర్వీసులూ అందించే స్థాయికి..
రేపటి నుంచి భోగాపురం నుంచి కార్యకలాపాలు
విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ప్రయాణం ఓ మధురానుభూతి. సముద్రం మీదుగా విమానం గాలిలోకి ఎగురుతుంటే విండో సీట్లో కూర్చుని చూడడం మరిచిపోలేని అనుభవం. సముద్ర తీరంలో ఓవైపు పోర్టు, ఆ పక్కనే మత్స్యకారుల బోట్లు, రెండింటికీ మధ్య కంటెయినర్ టెర్మినల్, అలా ఇంకొంచెం ప్రయాణిస్తే మిరుమిట్లు గొలిపే కాంతులతో వెలిగిపోయే అందమైన భవనాలు మనసులో చెరగని ముద్ర వేస్తాయి. అయితే, ఇకపై ఈ అనుభూతి గత స్మృతి కానుంది. భోగాపురం ఎయిర్‌పోర్టు సిద్ధమై సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి విశాఖ విమానాశ్రయానికి రాకపోకలు నిలిచిపోనున్నాయి.
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ప్రజలకు నాలుగున్నర దశాబ్దాలు సేవలు అందించిన విశాఖపట్నం విమానాశ్రయం సోమవారం నుంచి విశ్రమిస్తోంది. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన నేపథ్యంలో దీనిని పూర్తిగా మూసి వేస్తున్నారు. అత్యవసర సమయాల్లో ప్రత్యేక విమానాలకు తప్ప ప్రయాణికుల విమానాలను అనుమతించబోరు. తూర్పు నౌకాదళం పూర్తిస్థాయిలో దీనిని ఉపయోగించుకోనుంది. విశాఖపట్నం విమానాశ్రయానికి ఘనమైన చరిత్ర ఉంది. ఇంతింతై వటుడింతైన రీతిన ఎదిగింది. రోజుకు ఒక విమానం రాకపోకతో ప్రారంభమై అత్యధికంగా 40 విమానాలు వచ్చి, తిరిగి వెళ్లే స్థాయికి చేరింది. కొత్త కొత్త అంతర్జాతీయ సర్వీసులను ప్రజలకు పరిచయం చేసింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో (1941) ఆంగ్లేయులు రాయల్ ఎయిర్‌ఫోర్స్ కోసం ఇక్కడ చిన్న రన్ వే (ఎయిర్ స్ట్రిప్) నిర్మించారు. యుద్ధం ముగిశాక దాని అవసరం లేకుండా పోయింది. తిరిగి 1962లో పౌర విమానాల కోసం దానిని వినియోగంలోకి తీసుకువచ్చారు. కానీ పూర్తిస్థాయిలో నిర్వహించలేకపోయారు. భారత నౌకాదళం 1972లో ఇదే రన్‌వేను రక్షణ అవసరాలకు ఉపయోగించుకోవడం ప్రారంభించింది. విశాఖలో తూర్పు నౌకాదళం కార్యకలాపాలు విస్తృతం కావడంతో, 1986లో ఆ రన్‌వేను, భూములను రక్షణ శాఖకు బదిలీ చేశారు.
ఇంతింతై వటుడింతై...
మొదట్లో విశాఖపట్నానికి రోజుకు ఒకటే విమానం వచ్చి వెళ్లేది. వాతావరణం అనుకూలంగా లేకపోతే, అది కూడా రద్దు అయ్యేది. ఆ తరువాత నుంచి పౌర విమానాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. రన్ వే చిన్నదిగా, పల్లపు ప్రాంతంలో ఉండడంతో వర్షాలు పడితే నీరు వచ్చి చేరేది. దీంతో 20వ శతాబ్దం ప్రారంభంలో పెద్ద రన్‌వే నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు 3,050 మీటర్ల పొడవైన రన్‌వేను నిర్మిం చి 2007 జూన్ 15 నుం చి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ తరువాత నైట్ ల్యాండింగ్ సదుపాయం కూడా అందుబాటులోకి రావడంతో రాత్రి 9 గంటల వరకు విమానాలు వచ్చేవి. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో వారి కోసం 2008లో ప్రత్యేకంగా ఒక టెర్మినల్ నిర్మించారు. అంతర్జాతీయ సర్వీసులకు కూడా ప్రయత్నించి తొలుత దుబాయ్‌కు ఎయిర్ ఇండియా ప్రారంభింపజేశారు. అలా....శ్రీలంక, సింగపూర్, మలేసియా, బ్యాంకాక్‌లకు అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
ఒక వైపే ల్యాండింగ్
తరువాతి కాలంలో విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం రక్షణ పరంగా కీలకంగా మారింది. ఐఎన్‌ఎస్ డేగాలో కార్యకలాపాలు అధికమయ్యాయి. ఒకే ప్రాంగణంలో అటు నేవీ విమానాలు, మరోవైపు పౌర విమానాల రాకపోకలు సాగించడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని నేవీ ఆంక్షలు పెంచింది. విమానాశ్రయంలోకి ఒక వైపు నుంచే(సముద్రం మీదుగా) ల్యాండిం గ్, టేకాఫ్‌లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. అధికారులు దీనిని ‘యుని డైరెక్షనల్ ల్యాండింగ్’గా వ్యవహరిస్తున్నారు. విశాఖ వచ్చే ప్రతి విమానం స ముద్రం మీదకు వెళ్లి... అక్కడి నుంచి మళ్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సూచించిన మార్గంలో విమానాశ్రయంలోకి ల్యాండ్ అయ్యేలా ఉత్తర్వులు జారీ చేశారు. 2014లో వచ్చిన హుద్‌హుద్ తుఫాన్‌తో విమానాశ్రయం టెర్మినల్ ఛిన్నాభిన్నం అయింది. నేవీ తన అవసరాల కోసం రన్‌వేకు సమాంతరంగా ట్యాక్సీ ట్రాక్ నిర్మించుకుంది. భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తరువాత నేవీ విశాఖ వచ్చే విమానాలపై ఆంక్షలు పెంచింది. రాత్రి 11 గంటల తరువాత, ఉదయం 5 గంటలలోపు ఏ విమానాన్నీ అనుమతించడం లేదు. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. దీంతో అంతర్జాతీయ విమానాలు వెనక్కి వెళ్లిపోయాయి. ఒక్క సింగపూర్ విమానమే మిగిలింది. ప్రస్తుతం రోజుకు సగటున పది వేల మంది ప్రయాణికులు విశాఖ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నెల 16 అర్ధరాత్రి నుంచే భోగాపురం విమానాశ్రయం పౌర విమాన సేవలను ప్రారంభిస్తుంది. విశాఖ విమానాశ్రయం 350.31 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 276.89 ఎకరాలను ప్రస్తుతం వినియోగిస్తున్నారు. మిగిలిన భూమిని భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.