Share News

గత దశాబ్ద కాలంలో విశాఖ ఎయిర్‌పోర్టు విస్తరణకు 100 కోట్లు

ABN , Publish Date - Aug 17 , 2026 | 04:18 AM

గత దశాబ్ద కాలంలో విశాఖ విమానాశ్రయ విస్తరణకు ఏఏఐ సుమారు రూ.100 కోట్లు వెచ్చించిందని, ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ పురుషోత్తం తెలిపారు.

గత దశాబ్ద కాలంలో విశాఖ ఎయిర్‌పోర్టు విస్తరణకు 100 కోట్లు

  • ‘ఆంధ్రజ్యోతి’తో విమానాశ్రయ డైరెక్టర్‌ పురుషోత్తం

విశాఖపట్నం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): గత దశాబ్ద కాలంలో విశాఖ విమానాశ్రయ విస్తరణకు ఏఏఐ సుమారు రూ.100 కోట్లు వెచ్చించిందని, ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ పురుషోత్తం తెలిపారు. ఇప్పుడు టెర్మినల్‌ భవనం సహా, అనేక సదుపాయాలు నిరుపయోగమవుతాయని, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపై ప్రణాళిక తయారు చేయాల్సి ఉందని చెప్పారు. ఆదివారం విశాఖ విమానాశ్రయం ఆఖరి పనిదినం సందర్భంగా అక్కడ ఏపీ విమాన ప్రయాణికుల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. భోగాపురంలోని విమానాశ్రయం ప్రైవేటుది అయినప్పటికీ.. అక్కడ అత్యంత కీలకమైన ‘ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ)’ కార్యాలయాన్ని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)నే నడుపుతుందని వెల్లడించారు. ఆ కార్యక్రమాల నిర్వహణకు తనను అక్కడకు బదిలీ చేశారని, సోమవారం నుంచి భోగాపురంలో విధులు నిర్వహిస్తానని పేర్కొన్నారు. తనతో పాటు కమ్యూనికేషన్‌ రంగానికి చెందిన మరో 15 మందిని కూడా బదిలీ చేశారని తెలిపారు. పౌరవిమానయాన శాఖ జూలై 28నాటి ఉత్తర్వుల ప్రకారం విశాఖ విమానాశ్రయంలో నాన్‌-షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ విమానాలనే నడిపే అవకాశం ఉందని, ప్రైవేటు, ప్రత్యేక విమానాలను పరిమితంగా అనుమతిస్తారన్నారు. నేవీ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. నాలుగున్నర దశాబ్దాలపాటు విమానాశ్రయాన్ని సురక్షితంగా నడపడానికి సహకరించిన నేవీ ఐఎన్‌ఎస్‌ డేగా అధికారులకు, ఎయిర్‌లైన్స్‌కు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Aug 17 , 2026 | 04:19 AM