Share News

ఏసీబీకి మస్కా

ABN , Publish Date - Apr 09 , 2026 | 06:15 AM

దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగరి శాంతి ఏసీబీకి దొరక్కుండా కొన్ని ఆస్తులను పక్కకు తప్పించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

ఏసీబీకి మస్కా

  • కొన్ని ఆస్తులు తప్పించిన ఏసీ శాంతి

  • కాసులపేరు, కొత్త కారు మిస్సింగ్‌

  • ఏసీబీ సోదాల్ని ముందే పసిగట్టి...అప్రమత్తం

  • ఇప్పటికీ వైసీపీతో సంబంధాలు!

విశాఖపట్నం, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగరి శాంతి ఏసీబీకి దొరక్కుండా కొన్ని ఆస్తులను పక్కకు తప్పించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తాడేపల్లి, ఉండవల్లి ప్రాంతాల్లో ఆమెకు చెందిన విల్లాల్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలుచేసిన సంగతి తెలిసిందే. తనిఖీలు పూర్తయ్యాక చరాస్తుల ఫొటోలన్నీ పత్రికలకు విడుదల చేశారు. వాటి వివరాలు పేర్కొన్నారు. అయితే వాటిలో వడ్డాణం ఉందికానీ ఆమె విశాఖలో ముచ్చటపడి కొనుక్కున్న కాసులపేరు లే దు. విశాఖలో ఏ దైవకార్యం జరిగినా ఆమె ఆ కాసులపేరు ధరించేవారు. పీఠాధిపతి దర్శనానికి వెళ్లినప్పుడూ దానిని ధరించారు. అదేవిధంగా గత ఏడాది కొనుగోలు చేసిన కొత్తకారు కూడా ఏసీబీకి దొరకలేదు.


ముందే పసిగట్టి అప్రమత్తం

ఇంటికి అమర్చుకున్న సీసీ టీవీ కెమెరాల ద్వారా ఏసీబీ అధికారుల రాకను గమనించి ఆమె అప్రమత్తమైనట్లు తెలిసింది. విశాఖలో ఏసీగా పనిచేసినప్పుడు వైసీపీ మహిళా నాయకులతో ఆమె సన్నిహితంగా ఉండేవారు. వారంతా ఒక నేత వర్గానికి చెందినవారు. కనకమహాలక్ష్మి ఆలయ ఈవోగా శాంతి పనిచేసిప్పుడు ఆ ఆలయ ట్రస్టు బోర్డు చైర్‌పర్సన్‌ కొల్లి సింహాచలం, సభ్యురాలు మళ్ల ధనలత ఉన్నారు. వారితో ఇప్పటికీ శాంతి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. వారిద్దరూ గత మూడు రోజులుగా విజయవాడలోనే శాంతితోనే ఉన్నారు. శాంతికి కవల కుమార్తెలు. వారిలో ఒకరు మాజీ భర్త మదన్‌ వద్ద ఉండగా, మరొక అమ్మాయి శాంతి వద్ద ఉంటోంది. ఆ పాప పుట్టినరోజు సందర్భంగా విశాఖ నుంచి ఈ ఇద్దరు వైసీపీ మహిళలు శాంతి ఇంటికి వెళ్లారు. దానికి ముందు రోజు కూడా, శాంతి తనకు మళ్లీ పోస్టింగ్‌ వచ్చినందుకు ఓ అమ్మవారి గుడిలో మేకపోతును బలి ఇచ్చి మొక్కు తీర్చుకున్నారు. ఆ కార్యక్రమంలో కూడా విశాఖ మహిళలు ఇద్దరూ ఉన్నారు. ఏసీబీ అధికారులు సోదాలకు వచ్చినప్పుడు, శాంతిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసినప్పుడు కూడా వారిలో ఒక మహిళ సంతకాలు చేసినట్టు సమాచారం. ఆ మహిళ చేతికి శాంతి తన సీక్రెట్‌ మొబైల్‌ ఫోన్‌ అందజేసి, దానిని జాగ్రత్తగా ఉంచాలని కోరినట్టు తెలిసింది. అదేవిధంగా కొన్ని బంగారు ఆభరణాలను కూడా ఒక బ్యాగులో పెట్టి ఏసీబీ కంటపడకుండా తప్పించారని విశ్వసనీయంగా తెలిసింది. కాగా, ఏసీబీ తనిఖీలు జరుగుతుంటే శాంతి వాష్‌రూమ్‌కని వెళ్లి అందుబాటులో ఉన్న ఫోన్‌ ద్వారా తెలిసిన వారికి సోదాల గురించి చెప్పి సాయం కోరినట్టు తెలిసింది. లాయర్లతో సంప్రతించి బెయిల్‌ కోసం మంతనాలు సాగించినట్టు సమాచారం.

Updated Date - Apr 09 , 2026 | 06:16 AM