Share News

రూ.600 కోట్లు భూమికి స్కెచ్చేశారు !

ABN , Publish Date - Jul 04 , 2026 | 03:55 AM

ఇదో భూస్కామ్‌! తెరవెనుక సూత్రధారి... విశాఖ నగరానికి చెందిన ఒక మాజీ మంత్రి! పాత్రధారులు... కొందరు రెవెన్యూ, మరికొందరు సర్వే అధికారులు! భూమి 30 ఎకరాలు...

రూ.600 కోట్లు భూమికి స్కెచ్చేశారు !

  • విశాఖలో ఓ మాజీ మంత్రి భూచక్రం

  • ఎండాడలో 30 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్ను

  • రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి స్వాహా ప్లాన్‌

  • భూమి రికార్డుల్లో ‘ప్రైవేటు’గా మార్పు

  • ముగ్గురు ప్రైవేటు వ్యక్తుల పేరిట సబ్‌ డివిజన్‌

  • వారికే అనుకూలంగా ‘రీసర్వే’ ప్రక్రియ

  • పాస్‌బుక్కుల మంజూరుకు సిఫారసు

  • ఉన్నతస్థాయిలో అనుమానంతో లోతుగా ఆరా

  • కలెక్టర్‌ పరిశీలన, చర్యలతో ఆగిన ‘అన్యాక్రాంతం’

  • ఇంత చేసినా అక్రమార్కులపై చర్యలు నిల్‌

  • మరి.. ఆ భూమి భవిష్యత్తు భద్రమేనా?

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఇదో భూస్కామ్‌! తెరవెనుక సూత్రధారి... విశాఖ నగరానికి చెందిన ఒక మాజీ మంత్రి! పాత్రధారులు... కొందరు రెవెన్యూ, మరికొందరు సర్వే అధికారులు! భూమి 30 ఎకరాలు... విలువ దాదాపు రూ.600 కోట్లు! తెలుగుదేశం పార్టీకి చెందిన ఆ నాయకుడు విశాఖలో మరోసారి భూ చక్రం తిప్పారు. దీనిపై ప్రభుత్వానికీ సమాచారం అందింది. విశాఖలోని ఓ కీలక అధికారిని అమరావతిలోని సర్వే ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా సర్కారు ఆదేశించింది. షోకాజ్‌ నోటీసు కూడా ఇచ్చింది. కానీ తదుపరి చర్యలు మాత్రం లేవు! వివరాల్లోకి వెళితే... విశాఖపట్నం చుట్టూ ఉన్న భూములు ఎప్పుడో బంగారంగా మారాయి. నగరానికి చెందిన ఒక నాయకుడు భీమిలి, ఎండాడ, మధురవాడ తదితర ప్రాంతాల్లో భారీగా అసైన్డ్‌ భూములు సేకరిస్తున్నారు. ఇదే క్రమంలో... ఎండాడలోని ఓ సర్వే నంబర్‌లో ఉన్న 30 ఎకరాలపై ఆయన కన్ను పడింది. రెవెన్యూ రికార్డుల్లో అది ‘గయాళు’గా నమోదైంది. అంటే... ప్రభుత్వ భూమి అని అర్థం. ఆర్‌ఎస్ఆర్‌ (రీసెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌)లో కూడా అలాగే ఉంది. ఆ భూమి ధర ఎకరం రూ.20 కోట్ల పైమాటే! అంటే... 30 ఎకరాల విలువ రూ.600 కోట్లు. సదరు నాయకుడు తనకున్న పరిచయాలు, పలుకుబడిని ఉపయోగించి... ఆ భూమిని చెరపట్టాలని ప్లాన్‌ వేశారు. రెవెన్యూ, సర్వే శాఖలోని కీలక అధికారులను పిలిచి మాట్లాడారు. తొలుత ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఆ భూములకు సబ్‌ డివిజన్‌ పిటిషన్లు పెట్టించారు. వాటిని అడ్డంపెట్టుకొని... 30 ఎకరాలున్న సర్వే నంబర్‌లోని భూమిని సబ్‌ డివిజన్‌ చేశారు. రికార్డుల్లో ‘గయాళు’ను తీసేసి... ‘జిరాయితీ’ (ప్రైవేటు)గా మార్పించేశారు. ఆ తర్వాత ఆ భూమిని మూడు భాగాలుగా సబ్‌ డివిజన్‌ చేసి... ముగ్గురి పేరిట రికార్డుల్లో రాసేశారు. ఆ తర్వాత ఆరునెలల పాటు ఈ విషయంలో సైలెంట్‌గా ఉండిపోయారు.


రీ సర్వేలో సక్సెస్‌...

రికార్డుల మార్పిడి విజయవంతంగా పూర్తికాగానే... ఆ నాయకుడు తదుపరి దశకు స్కెచ్‌ వేశారు. మూడు సబ్‌ డివిజన్‌లుగా మారిన ఆ 30 ఎకరాల భూమిని రీసర్వే చేయించారు. అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిపోయింది. ఆ భూమి ప్రైవేటుదే అని నిర్ధారిస్తూ... డ్రాఫ్ట్‌ ల్యాండ్‌ రిజిస్టర్‌ (డీఎల్‌ఆర్‌)లో నమోదు చేయించారు. ముగ్గురు వ్యక్తుల పేరిట భూమి హక్కులు రాశారు. పాస్‌బుక్‌లు ఇవ్వాలని సిఫారసు చేశారు. ఇక... వాటిని ఇచ్చేయడమే తరువాయి!

అంతలోనే... అనుమానం!

రికార్డుల్లో మార్పులు, చకచకా రీసర్వే జరగడంతో రెవెన్యూ ఉన్నతాధికారుల్లో ‘ఎండాడలో ఏదో జరుగుతోంది’ అనే చిన్న అనుమానం తలెత్తింది. ఎండాడలోని ఆ 30 ఎకరాల భూమి ఒరిజినల్‌ ఆర్‌ఎస్ఆర్‌ర్‌ను, రీ సర్వే అనంతరం రూపొందించిన డీఎల్‌ఆర్‌ను సరిపోల్చగా... తేడా జరిగినట్లు స్పష్టంగా అర్థమైంది. సర్వేకు చెందిన ఓ ఉన్నతాధికారి దీన్ని తప్పుదోవపట్టించే ప్రయత్నం చేశారని తెలిసింది. ‘‘అబ్బే, అది ప్రైవేటు భూమే! ఆర్‌ఎ్‌సఆర్‌లో పొరపాటున గయాళు అని రాసి ఉంది’’ అంటూ నమ్మబలికేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. విశాఖ కలెక్టర్‌ దీనిపై మరింత లోతైన పరిశీలన చేయించారు. సర్వే, రెవెన్యూ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కయి తప్పులు చేశారని నిర్ధారణ వచ్చారు. దీంతో సర్వేకు చెందిన కీలక అధికారిని ప్రభుత్వానికి సరెండర్‌ చేసినట్లు తెలిసింది. రీ సర్వే అనంతరం రూపొందించిన డీఎల్‌ఆర్‌ను ఆమోదించకుండా, దానిని నిలుపుదల చేసినట్లు తెలిసింది. అంటే... ప్రస్తుతానికి ఆ భూమి సేఫ్‌!


ఇవేం చర్యలు?

ఎండాడలో రూ.600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు పరం చేయాలనుకోవడం తీవ్రమైన తప్పిదం. ఘోరమైన నేరం కూడా! అలాంటి నేరానికి పాల్పడిన ప్రైవేటు వ్యక్తులు, అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ప్రభుత్వ భూముల జోలికి రావడానికి ఎవరైనా భయపడతారు. ఈ కేసులో... రికార్డుల తారుమారు ఉదంతం బయటకొచ్చాక సర్వేలోని కీలక అధికారిని అమరావతిలోని సర్వే ప్రధాన కార్యాలయానికి సరెండర్‌ చేశారు. ఆ తర్వాత దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాల్సి ఉంది. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు వ్యక్తుల పాత్రను నిర్ధారించి చట్టపరమైన చర్యలకు సిఫారసు చేయాలి. విచిత్రం ఏమంటే... ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి కేవలం షోకాజ్‌ నోటీసు ఇచ్చి వదిలేశారు. ఆ అధికారి హెడ్‌క్వార్టర్‌లో రిపోర్టుచేసి ఆ తర్వాత సెలవుపెట్టి వెళ్లిపోయారు. తనకు మళ్లీ విశాఖలోనే పోస్టింగ్‌ ఇప్పించాలని పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ భూ మంత్రాంగంలో ఉన్న ప్రైవేటు వ్యక్తులు, పెద్దలను గుర్తించే విచారణే ఇప్పటిదాకా ముందుకురాలేదు! కఠిన చర్యలు తీసుకోకుంటే అక్రమార్కులు ఆగుతారా? ఆ భూమిని ఇప్పటికైతే కాపాడారు! మరి భవిష్యత్తులో ఏం చేస్తారో! పరిణామాలు ఎలా మారతాయో!

Updated Date - Jul 04 , 2026 | 03:57 AM