తమ్ముడిని బాగా చదివించు.. అమ్మను బాగా చూసుకోండి!
ABN , Publish Date - Jun 10 , 2026 | 05:54 AM
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కందుల పైడిరాజు.. తన పెద్ద కుమారుడిని ఉద్దేశించి చెప్పిన మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
కన్నీరు పెట్టిస్తున్న క్షతగాత్రుడు పైడిరాజు మాటలు
నా కళ్ల ముందే సహచరులు కాలిపోయారు
ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను
ప్రమాదం నుంచి తప్పించుకున్న రామ్మోహనరావు
విశాఖపట్నం, జూన్ 9(ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కందుల పైడిరాజు.. తన పెద్ద కుమారుడిని ఉద్దేశించి చెప్పిన మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. పిల్లలకు తన చివరి మాటలను తెలియజేయాలంటూ పైడిరాజు అక్కడున్న కొందరికి చెప్పగా, వారు వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు వైరలవుతోంది. ‘‘వర్మా (పెద్ద కుమారుడు) తమ్ముడి మీద ఎప్పుడూ చిరాకు పడకు. తమ్ముడిని బాగా చదివించురా. నువ్వు కూడా బాగా చదువుకో. అమ్మను బాగా చూసుకోండి. ఉంటాను డాడీ’’ అంటూ పైడిరాజు చెప్పిన మాటల్లో కుటుంబం పట్ల బాధ్యత, తనకు ఏమైనా జరిగితే వారి పరిస్థితి ఏంటన్న ఆవేదన కనిపించాయి. పైడిరాజుకు భార్య అరుణ, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు వర్మ బీటెక్ చేస్తుండగా, చిన్న కుమారుడు హేమంత్ ఇంటర్ చదువుతున్నాడు. గంగవరంలోని ధారవీధిలో నివాసం ఉంటున్నారు.
చూస్తుండగానే మంటల్లో కాలిపోయారు
ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఎన్.రామ్మోహనరావు అనే ఉద్యోగి ఘటన జరిగిన తీరును వివరించారు. చూస్తుండగానే సహచరులు మంటల్లో కాలిపోయారని, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయానని, కళ్ల ముందే ఘోరం జరిగిపోయిందంటూ కన్నీరుమున్నీరయ్యారు. స్నేహితుడు అప్పారావుతోపాటు ఇతర సహచరులు మంటల్లో కాలిపోవడం ఇప్పటికీ తన కళ్ల ముందు కదలాడుతోందన్నారు. తాను, నక్కా రమణ అనే ఉద్యోగి విశ్రాంతి తీసుకొని, డ్యూటీలోకి వచ్చిన 13 నిమిషాల్లోనే పేలుడు జరిగిందని, అప్పుడు తాను రమణకు 30 అడుగుల దూరంలో ఉన్నానని తెలిపారు. పేలుడుతో పెద్ద శబ్ధం వచ్చిందని, పెద్ద బిందెలో నుంచి నీళ్లు తుళ్లినట్టు ద్రవపు ఉక్కు తుళ్లిపడిందని, మంటలు చెలరేగాయని వివరించారు. బద్ధలైన లావా మాదిరి పరిస్థితి మారిపోయిందన్నారు. మంటల్లో చిక్కుకుపోయిన సహచరులను రక్షించేందుకు ముందుకువెళ్లే ప్రయత్నం చేస్తే.. షూ కూడా మెల్ట్ అయిపోయిందని తెలిపారు. రిన్సింగ్ సరిగా చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు.